యూకేలో గాలి మార్పు

అంచనాలే వాస్తవాలయ్యాయి. పద్నాలుగేళ్లుగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను ఏలుతున్న కన్జర్వేటివ్‌ పార్టీకి తాజా ఎన్నికల్లో నూకలు చెల్లిపోయాయి. 650 స్థానాలు కలిగిన బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ 411 సీట్లు సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది.

Published : 08 Jul 2024 01:34 IST

అంచనాలే వాస్తవాలయ్యాయి. పద్నాలుగేళ్లుగా యునైటెడ్‌ కింగ్‌డమ్‌ను ఏలుతున్న కన్జర్వేటివ్‌ పార్టీకి తాజా ఎన్నికల్లో నూకలు చెల్లిపోయాయి. 650 స్థానాలు కలిగిన బ్రిటన్‌ హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌లో కీర్‌ స్టార్మర్‌ నేతృత్వంలోని లేబర్‌ పార్టీ 411 సీట్లు సాధించి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. 2019తో పోలిస్తే- టోరీలు 250 స్థానాలు కోల్పోయి 121కే పరిమితం కావాల్సి వచ్చింది. మిన్నంటిన ద్రవ్యోల్బణం, కోరలుచాచిన నిరుద్యోగం, దిగజారిన జీవన ప్రమాణాలతో అల్లాడుతున్న ప్రజానీకాన్ని ఆదుకుంటానంటూ రిషీ సునాక్‌ రెండేళ్ల కిందట బ్రిటన్‌ పాలనా పగ్గాలు చేపట్టారు. జీవితాల్లో మార్పుకోసం నినదిస్తున్న సామాన్యులతో మమేకం కావడంలో విఫలమైన రిషి- తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకొన్నారు. ఆయనకు మునుపు ప్రధానులైన లిజ్‌ ట్రస్, బోరిస్‌ జాన్సన్‌ల దుర్విధానాలు, టోరీల్లో అంతర్గత కలహాలకు లేబర్‌ పార్టీ వాగ్దానాలు జతకలిసి 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లోకి స్టార్మర్‌కు రాచబాట పరచాయి. ఈ ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు 28 మంది విజేతలుగా నిలవడం విశేషం. పద్నాలుగు శాతానికి పైగా ఓట్లు ఒడిసిపట్టిన రిఫార్మ్‌ యూకే పార్టీ- సంప్రదాయ టోరీ ఓటర్లలో చాలామందిని తనవైపు తిప్పుకొంది. బ్రిటన్‌లో మితవాద భావజాల వ్యాప్తి వేగవంతమవుతోందనడానికి ఇది అద్దంపడుతోంది. కశ్మీర్‌ విషయంలో అంతర్జాతీయ జోక్యాన్ని కోరుతూ అయిదేళ్ల క్రితం లేబర్‌ పార్టీ తీర్మానించడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. దానికి వ్యతిరేకంగా గళం విప్పిన స్టార్మర్‌- కశ్మీర్‌ అంశం ఇండియా, పాకిస్థాన్‌ల వ్యవహారమని తేల్చిచెప్పారు. ఇండియాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) సత్వరం సాకారమయ్యేలా చూస్తామన్న బ్రిటిష్‌ నూతన ప్రధాని ప్రకటన- ద్వైపాక్షిక బంధాన్ని బలోపేతం చేసేదే! 

వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను పటిష్ఠం చేసుకోవాలనుకున్న ఇండియా, యూకే ఉమ్మడి ఆకాంక్ష- మూడేళ్ల క్రితం ‘2030 రోడ్‌మ్యాప్‌’నకు ప్రాణంపోసింది. అందులో ఒక భాగమే ఎఫ్‌టీఏ. 2022 దీపావళి నాటికే దాన్ని పట్టాలకు ఎక్కించాలని లక్షించినా- యూకేలో రాజకీయ అనిశ్చితి, ఎన్నికల కారణంగా చర్చలు కొలిక్కి రాలేదు. ఎఫ్‌టీఏ వాస్తవ రూపం దాలిస్తే- ఇండియా నుంచి బ్రిటన్‌కు తోలు, జౌళి, శుద్ధి చేసిన వ్యవసాయ ఉత్పత్తులు, ఔషధాలు, ఆభరణాల ఎగుమతులు ఊపందుకొనే అవకాశాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో దిల్లీ-లండన్‌ల ద్వైపాక్షిక వాణిజ్య విలువ సుమారు 2,134 కోట్ల డాలర్లు. ఎఫ్‌టీఏ అమలులోకి వస్తే- 2030 నాటికి అది పదివేల కోట్ల డాలర్లకు చేరుతుందని అంచనా. బ్రెగ్జిట్‌  అనంతర పరిణామాల మూలంగా ఆర్థిక ఇక్కట్లతో సతమతమవుతున్న యూకే- కల్పతరువు వంటి భారతీయ విపణిలోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతోంది. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎఫ్‌టీఏ గురించి స్టార్మర్‌ ప్రముఖంగా ప్రస్తావించడమే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో బ్రిటిష్‌ ఉత్పత్తుల దిగుమతులు భారతావనిలోకి విపరీతంగా వెల్లువెత్తి స్థానిక వ్యాపారులు, రైతులకు నష్టం చేకూర్చకుండా కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అత్యున్నత విద్యాసంస్థలకు, మేటి ప్రమాణాలకు నెలవైన యూకేలో ఉన్నత చదువులకు మన విద్యార్థులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కొలువుల కోసమూ  ఇండియా నుంచి అనేకమంది అక్కడికి వలస వెళ్తున్నారు. ఉపాధి, కుటుంబ వీసాల మంజూరును బ్రిటన్‌ కఠినతరం చేయడం- భారతీయులకు అశనిపాతమవుతోంది. యూకేలో తిష్ఠవేసి, ఇండియాపై విషం చిమ్ముతున్న ఖలిస్థానీ, కశ్మీరీ వేర్పాటువాదుల పట్ల బ్రిటిష్‌ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడమూ విమర్శలకు తావిస్తోంది. విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ లాంటి ఆర్థిక నేరగాళ్లను ఇండియాకు తిప్పి పంపడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటన్నింటి విషయంలో స్టార్మర్‌ సర్కారు వైఖరి ఎలా ఉండబోతోందన్నదే ప్రధాన ప్రశ్న! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.