స్వయం సమృద్ధతే రక్షణ!

భిన్నశ్రేణుల రక్షణరంగ ఉత్పత్తులు, ఆయుధ విడిభాగాలకోసం భారత్‌ ప్రధానంగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడే దుస్థితి దశాబ్దాల తరబడి కొనసాగింది. ఇప్పుడా దురవస్థ క్రమంగా చెదిరిపోతోంది. జాతి సగర్వంగా తలెత్తుకునే రోజులు వస్తున్నాయి.

Published : 09 Jul 2024 01:56 IST

భిన్నశ్రేణుల రక్షణరంగ ఉత్పత్తులు, ఆయుధ విడిభాగాలకోసం భారత్‌ ప్రధానంగా విదేశీ దిగుమతులపైనే ఆధారపడే దుస్థితి దశాబ్దాల తరబడి కొనసాగింది. ఇప్పుడా దురవస్థ క్రమంగా చెదిరిపోతోంది. జాతి సగర్వంగా తలెత్తుకునే రోజులు వస్తున్నాయి. డీఆర్‌డీఓ (రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ), ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంలో ప్రాజెక్ట్‌ జొరావర్‌ పేరిట తేలికపాటి యుద్ధట్యాంకుల నిర్మాణం నిర్ణాయక దశకు చేరడం సహర్షంగా స్వాగతించదగ్గ పరిణామం. రెండున్నరేళ్ల వ్యవధిలోనే ఈ ట్యాంకు డిజైన్, నమూనా తయారీ దశలను అధిగమించి ప్రయోగ పరీక్షలకు సిద్ధం కావడం వెనక శాస్త్రవేత్తల నిబద్ధ కృషి బహుధా ప్రశంసనీయం. వరస పరీక్షల్లో నెగ్గితే 2027 నాటికి ఈ దేశవాళీ తేలికపాటి యుద్ధట్యాంకు భారత రక్షణావసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోషించనుందంటున్నారు. ఇప్పటివరకు ఉత్పత్తి ఆర్డర్ల పరిమాణాన్నిబట్టి సుమారు 350దాకా జొరావర్‌ ట్యాంకులు ఇంకో రెండున్నరేళ్లలో సైన్యానికి అందుబాటులోకి రానున్నాయి. చైనా, పాకిస్థాన్ల రూపేణా జంటశత్రువులు, ముఖ్యంగా లద్దాఖ్‌ ప్రాంతంలో హిమాలయ పర్వత శ్రేణుల్లో మోహరింపు అవసరాల ప్రాతిపదికన- అవెంతమాత్రం సరిపోవు. రష్యా తయారీ సంప్రదాయ యుద్ధట్యాంకులు సాధారణంగా 40-50 టన్నుల వరకు బరువు ఉంటాయి. వాటిలో చాలావరకు ఆయువు తీరే దశకు చేరువవుతున్నాయి. తొలగించాల్సిన వాటిస్థానే నియోగించడానికి, చైనామీద పైచేయి సాధించేలా మంచుకొండల్లో మోహరించడానికి దాదాపు 25 టన్నుల జొరావర్‌ యుద్ధట్యాంకులు ఎంతో ఉపయుక్తం కానున్నాయి. సైన్యంలో రెండున్నర వేలదాకా ఉన్న టి72 ట్యాంకులకు ప్రత్యామ్నాయం ఏమిటన్న ప్రశ్నకూ తేలికపాటి యుద్ధట్యాంకే సమాధానం. క్షేత్రస్థాయి స్థితిగతుల్ని, వాస్తవిక అవసరాల్ని పరిగణనలోకి తీసుకుని జొరావర్‌ ట్యాంకుల ఉత్పత్తి, మోహరింపు ప్రణాళికల్ని కేంద్రం విస్తరిస్తేనే- డీఆర్‌డీఓ కృషి సార్థకమవుతుంది!

తుపాకులు, తూటాలు, శిరస్త్రాణాలు సైతం దిగుమతి చేసుకునే పరాధీనత నుంచి బయటపడి భారత్‌ ఇప్పుడు ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలకు బ్రహ్మోస్‌ క్షిపణులు ఎగుమతి చేసే దశకు చేరడమన్నది- కచ్చితంగా స్ఫూర్తిమంతమైన విజయగాథే. అయినా, విశ్వవిపణిలో భారత రక్షణ ఎగుమతుల వాటా నేటికీ పరిమితమే. ఇది చురుగ్గా అధిగమించాల్సిన సంధి దశ. భవిష్యత్తు ఆశావహమనడానికి ఎన్నో సంకేతాలు లభిస్తున్నాయి. కృత్రిమ మేధ ఆధారిత నిఘా వ్యవస్థలు, ఇతర ప్రాజెక్టుల అభివృద్ధిని లక్షించి ఇటీవలే డీఆర్‌డీఓ- భువనేశ్వర్‌ ఐఐటీతో చేతులు కలిపింది. తద్వారా ఎలెక్ట్రానిక్‌ యుద్ధ వ్యవస్థలు, పవర్‌ సిస్టమ్స్, రాడార్‌ వ్యవస్థలు తదితరాల నిర్మాణ ప్రక్రియ చురుకందుకోనుంది. వార్‌హెడ్స్, ఏరియల్‌ బాంబులు, ఫిరంగిగుళ్లు వంటివి పెను విధ్వంసక శక్తి సంతరించుకోవడానికి బాటలు పరుస్తూ ప్రామాణిక టీఎన్‌టీ (ట్రైనైెట్రోటోలీన్‌) కన్నా రెండింతలకు పైగా శక్తిమంతమైన పేలుడు పదార్థాన్ని భారత శాస్త్రవేత్తలు రూపొందించారు. హైదరాబాద్‌ నగరానికి చెందిన సంస్థ ఒకటి ‘అస్మీ’ పేరిట కూర్చిన 9్ల19 ఎమ్‌ఎమ్‌ కాలిబర్‌ సబ్‌మెషీన్‌గన్‌- అంతర్జాతీయంగా పేరెన్నికగన్న ఇజ్రాయెల్, జర్మనీ ఉత్పత్తుల్నీ తలదన్నడం... ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్రస్థానగతికి నిదర్శనం. ప్రస్తుతం భారత్‌ 75 దేశాలకు ఆయుధాల్ని ఎగుమతి చేస్తున్నట్లు ఆమధ్య రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గణాంక వివరాలను వెల్లడించారు. చిన్న, మధ్యశ్రేణి ఆయుధాలు, పరికరాలు, బులెట్‌ఫ్రూఫ్‌ జాకెట్ల వంటి ఎగుమతులకే పరిమితం కాకుండా- జలాంతర్గాములు, భారీ యుద్ధవిమానాలకూ భారత పద్దు విస్తరించాలి. అలాగైతేనే- ప్రపంచ ఆయుధ విపణిలో మనకన్నా ముందున్న జర్మనీ, ఇటలీ, టర్కీ, యూకే, బెలారస్‌ ప్రభృత దేశాలకన్నా మెరుగ్గా రాణించగలిగేది. ఆ స్వప్నం సాకారం కావడానికి డీపీఎస్‌యూ (రక్షణరంగ ప్రభుత్వ సంస్థ)లు, ఆయుధ కర్మాగారాలకు ప్రభుత్వం కేటాయింపుల్ని పెంపొందించాలి. వాటిని నవీకరించాలి, పరిపుష్టీకరించాలి. ప్రైవేటు సంస్థలకూ తగినన్ని ప్రోత్సాహకాలు కల్పించాలి. శత్రుసేనల్ని దునుమాడే శక్తిగా, ఎగుమతి అవకాశాల్ని అందిపుచ్చుకొనేంతటి స్వయం సమృద్ధంగా భారత రక్షణరంగం వెలుగులీనేదప్పుడే! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.