పీల్చే గాలే గరళమై...

ప్రాణాలను నిలబెట్టాల్సిన వాయువే విషమై ఆయువును హరిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను అది శోకసంద్రంలో ముంచుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా పది నగరాల్లోనైతే అత్యంత ప్రమాదకరమైన అతి సూక్ష్మ ధూళికణాల(పీఎం 2.5) ఉద్ధృతి కట్టుతప్పింది.

Published : 10 Jul 2024 01:03 IST

ప్రాణాలను నిలబెట్టాల్సిన వాయువే విషమై ఆయువును హరిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాలను అది శోకసంద్రంలో ముంచుతోంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా పది నగరాల్లోనైతే అత్యంత ప్రమాదకరమైన అతి సూక్ష్మ ధూళికణాల(పీఎం 2.5) ఉద్ధృతి కట్టుతప్పింది. ఆ మహానగరాల్లో రోజూ సంభవిస్తున్న మరణాల్లో సుమారు 7.2శాతానికి కలుషిత గాలే కారణమన్న చేదునిజం తాజాగా వెలుగుచూసింది. 2008-19 మధ్య ఆయా ప్రాంతాల స్థితిగతులను విశ్లేషించిన జాతీయ, అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ కఠోర వాస్తవాలను వెల్లడించింది. భారతావనిలో కోరలుచాస్తున్న వాయుకాలుష్యం ధాటికి సామాన్య జనజీవితాలు ఎంతగా బలైపోతున్నాయో ప్రపంచ వాయుస్థితి నివేదిక సైతం ఇటీవలే కళ్లకుకట్టింది. విషతుల్యమైన గాలిని పీల్చడం మూలంగా 2021లో విశ్వవ్యాప్తంగా 81 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఆ అభాగ్యుల్లో దాదాపు నాలుగో వంతు మందికి ఇండియా నెలవు కావడం తీవ్ర విషాదకరం! అదే ఏడాది ప్రపంచంలోనే అత్యధికంగా అయిదేళ్లలోపు భారతీయ చిన్నారుల్లో 1.69 లక్షల మందిని కలుషిత గాలి కాటేసింది. పోషకాహార లేమి తరవాత వాయుకాలుష్యమే ఎక్కువగా ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తోంది. ఊపిరితిత్తుల్లోకి, అక్కడి నుంచి రక్తంలోకి చేరుతున్న సూక్ష్మధూళికణాలు- పెద్దవారిలో  మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు, క్యాన్సర్లకు దారితీస్తున్నాయి. పసివారికేమో పుట్టుకతోనే పెనుసమస్యలను తెచ్చిపెడుతున్నాయి. అధ్వాన వాయునాణ్యత మూలంగా బాలబాలికల్లో మెదడు, నాడీ వ్యవస్థ, ఎముకలు, కండరాల ఎదుగుదల దెబ్బతింటోంది. భావిభారతం భవిష్యత్తుకు అది ప్రాణసంకటమవుతోంది! 

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం- ఘనపు మీటరు గాలిలో అయిదు మైక్రోగ్రాములకు మించి సూక్ష్మ ధూళికణాలు ఉండకూడదు. ఇండియాలో అవి అంతకు ఎన్నో రెట్లు అధికంగా పోగుపడినట్లు ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక ఇటీవల లెక్కగట్టింది. దిల్లీ (92.7 మై.గ్రా.), బిహార్‌లోని బెగుసరాయ్‌ (దాదాపు 119 మై.గ్రా.) వంటి చోట్ల పీఎం 2.5 సాంద్రత మరింత దట్టమై- ప్రపంచంలో మూడో అత్యంత కలుషిత దేశంగా ఇండియా దుష్కీర్తి మూటగట్టుకుంది. విశాఖపట్నం, అనంతపురం, తిరుపతి తదితర నగరాల్లోనూ వాయునాణ్యత దిగనాసిల్లుతున్న తీరును పరిశీలనలు లోగడే చాటిచెప్పాయి. 2026 నాటికి దేశవ్యాప్తంగా 131 నగరాల్లోని గాలిలో సూక్ష్మ ధూళికణాలను తగ్గించేందుకు జాతీయ వాయుశుద్ధి కార్యక్రమాన్ని (ఎన్‌క్యాప్‌) కేంద్రం అమలు చేస్తోంది. ‘ఎన్‌క్యాప్‌’ వల్ల ఆశించిన ఫలితాలు రాకపోగా చాలాచోట్ల పరిస్థితి ఇంకా దిగజారినట్లు వివిధ అధ్యయనాల్లో తేలింది. జాతి ఆరోగ్య భద్రతకు కీలకమైన కృషిలో మేటవేసిన వ్యవస్థాగత లోపాలకు అది అద్దంపడుతోంది. ఇబ్బడిముబ్బడిగా వాహనాల వినియోగం, పారిశ్రామిక వాణిజ్య నిర్మాణ కార్యకలాపాలు, పంట వ్యర్థాల దహనం వంటివి గాలిలో మలినాల శాతాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. వాయు కాలుష్యం కారణంగా ప్రకోపిస్తున్న ఉష్ణ తాపం- జనాన్ని బెంబేలెత్తిస్తోంది. దేశ ఆర్థికానికి అది ఏటా ఏడు లక్షల కోట్ల రూపాయల మేర నష్టం కలగజేస్తోంది. ప్రజల ఆయుర్దాయాన్నీ కర్కశంగా తెగ్గోస్తోంది. మలిన వాయువులు సృష్టిస్తున్న మారణహోమాన్ని నిలువరించాలంటే- ప్రభుత్వాలు ప్రజా రవాణా సదుపాయాలను విస్తృతం చేయాలి. పునరుత్పాదక ఇంధన వాడకాన్ని విరివిగా ప్రోత్సహించాలి. అవినీతి కాసారంలో మునిగితేలుతున్న కాలుష్య నియంత్రణ మండళ్లను ప్రక్షాళించాలి. వాహన ఉద్గారాల కట్టడి, హరిత వనాల పెంపకం వంటి వాటికి ప్రాధాన్యమిస్తూ పాలకులు నిబద్ధతతో శ్రమిస్తేనే- దేశంపై పరచుకొన్న విషవాయు మేఘాలు చెదిరిపోవడానికి అవకాశముంటుంది!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.