శాంతిదూతగా ఇండియా!

నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అయ్యాక మొదటి ఎనిమిదేళ్లలో పదహారు సార్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ వరసలో చివరిసారి 2022 సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ఇరు దేశాధినేతలూ సమావేశమయ్యారు. ఆపై మోదీ-పుతిన్‌ ముఖాముఖి కలవకపోవడం, 2021 తరవాత దిల్లీ-మాస్కో వార్షిక శిఖరాగ్ర సదస్సులు సైతం జరగకపోవడంతో ద్వైపాక్షిక బంధం బీటలు వారుతోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Published : 11 Jul 2024 01:44 IST

నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రి అయ్యాక మొదటి ఎనిమిదేళ్లలో పదహారు సార్లు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. ఆ వరసలో చివరిసారి 2022 సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో ఇరు దేశాధినేతలూ సమావేశమయ్యారు. ఆపై మోదీ-పుతిన్‌ ముఖాముఖి కలవకపోవడం, 2021 తరవాత దిల్లీ-మాస్కో వార్షిక శిఖరాగ్ర సదస్సులు సైతం జరగకపోవడంతో ద్వైపాక్షిక బంధం బీటలు వారుతోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన దరిమిలా పాశ్చాత్య దేశాలకు మరింత దూరమైన మాస్కో... బీజింగ్‌కు చేరువ కావడం- భారతదేశ భద్రతకు ప్రమాదకరం కానుందనే విశ్లేషణలు వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించాక మొదటి విదేశీ పర్యటనకు రష్యాను ఎంపిక చేసుకోవడం ద్వారా మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. తుపాకులు మొదలు యుద్ధ విమానాల వరకు భారతీయ సాయుధ సంపత్తిలో మూడింట రెండొంతులు నాటి సోవియట్‌ యూనియన్, నేటి రష్యాల నుంచి వచ్చినవే. చైనా, పాకిస్థాన్‌ల రూపంలో పొంచిఉన్న జంట శత్రువులను దీటుగా ఎదుర్కోవాలంటే- ఆయుధాల నిర్వహణ, మరమ్మతులు, విడిభాగాల సరఫరాల పరంగా రష్యా నిరంతర సహకారం ఇండియాకు ప్రాణావసరం. చైనాతో దాని దోస్తీ మనకు ముప్పు కాకుండా కాచుకోవడమూ కీలకం. ఈ మేరకు దేశ ప్రయోజనాల పరిరక్షణను లక్షించిన ప్రధాని మోదీ తాజా మాస్కో పర్యటన  ఫలప్రదమైంది. పద్నాలుగేళ్ల క్రితమే ‘ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరిన ఇండో-రష్యా మైత్రీబంధాన్ని ఇంకా పటిష్ఠపరచే తొమ్మిది ఒడంబడికలు ఈ సందర్భంగా ముడివడ్డాయి. ప్రధానంగా ఆర్థిక, ఆరోగ్య, ఆహార, ఇంధన రంగాల్లో అవి ఉభయతారకం కానున్నాయి!

రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలన్న ఇండియా ఆకాంక్షను మన్నిస్తూ అధునాతన ఆయుధ వ్యవస్థల ఉమ్మడి అభివృద్ధికి, ఉత్పత్తికి రష్యా ఇప్పటికే కట్టుబాటు చాటింది. ఆ మేరకు పరస్పర సాంకేతిక సహకారానికి సరికొత్త వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటుకు రెండు దేశాలు తాజాగా నిశ్చయించాయి. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి పదివేల కోట్ల డాలర్లకు విస్తరింపజేయాలన్న లక్ష్యాన్నీ అవి ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇండియా, రష్యా నడుమ వాణిజ్య విలువ రికార్డు స్థాయిలో 6570 కోట్ల డాలర్లకు చేరింది. కానీ, అందులో భారతీయ ఎగుమతుల వాటా కేవలం 426 కోట్ల డాలర్లే! ఎరువులు, ఖనిజ ఉత్పత్తులు, వంటనూనెలతో పాటు చమురు దిగుమతుల వెల్లువతో రష్యాతో భారత వాణిజ్యలోటు విపరీతమవుతోంది. అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా నడవా, చెన్నై-వ్లాదివస్తాక్‌ సముద్ర రవాణా మార్గాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే... ఇండియా నుంచి ఎగుమతులు ఊపందుకోవచ్చు. ఉక్రెయిన్‌పై దమనకాండకు పాల్పడుతున్న రష్యా నుంచి ఇండియా చమురును భారీగా కొనుగోలు చేస్తుండటంపై పాశ్చాత్య దేశాలు రుసరుసలాడుతున్నాయి. స్వదేశ అవసరాల రీత్యా మాస్కోతో వ్యాపార లావాదేవీలు ఇండియాకు అత్యవసరమే. అదే సమయంలో రష్యాకు చిరకాల సన్నిహిత మిత్రరాజ్యంగా విశ్వశాంతి స్థాపనకోసం ఇండియా మరింతగా చొరవ తీసుకోవాలి. రెండేళ్ల నాడు సమర్‌ఖండ్‌ భేటీలోనే ‘ఇది యుద్ధాల యుగం కాదు’ అంటూ పుతిన్‌కు హితవు పలికిన మోదీ- ఉక్రెయిన్‌పై రష్యా దాష్టీకాలను అన్యాపదేశంగా నిరసించారు. మొన్న మంగళవారం కూడా ఆయన శాంతి చర్చలకు పిలుపిచ్చారు. తనను ‘ప్రియ మిత్రుడి’గా సంబోధించే పుతిన్‌ను ఉక్రెయిన్‌తో సయోధ్యకు ఒప్పించడంలో మోదీ సఫలీకృతులైతే- అంతకంటే అద్భుతమైన దౌత్య విజయం మరొకటి ఉండదు. శాంతిదూతగా భారతావని కీర్తికిరీటంలో అది కలికితురాయి కాగలదు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.