ఓటరే గెలవాలి!

Published : 06 Dec 2018 00:49 IST

యిదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలకు సంబంధించి ఆఖరి, కీలక ఘట్టంగా రేపు తెలంగాణ, రాజస్థాన్లలో పోలింగుకు తెర లేవనుంది. కొత్త రాష్ట్రం ఏర్పాటుకు ముందు జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణవ్యాప్తంగా 69 శాతం పోలింగ్‌ నమోదైంది. పోరుబాటలో స్వరాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో పోటెత్తిన జనచైతన్యమే ప్రామాణికమైతే, ఆ ఓటింగ్‌ శాతం బాగా తక్కువనే చెప్పాలి. రాష్ట్ర సాధన తరవాత తొలిసారి చోటుచేసుకుంటున్న ఈ ఎన్నికల్లో తాము కోరుకున్న విధంగా తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దుకునే చేతనత్వంతో ఓటర్లంతా పోలింగ్‌ కేంద్రాలకు స్వచ్ఛందంగా బారులు తీరాల్సిన తరుణమిది! ఎనభై కోట్లకుపైగా ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా ప్రతీతమవుతున్న దేశం మనది. ‘ప్రజల వలన ప్రజలచేత ప్రజల కొరకు’గా నిర్వచించుకున్న జనతంత్రంలో పౌరుల పాత్ర నేతిబీరలో నెయ్యి చందం కానేకూడదు. తెలంగాణలో నియోజకవర్గాలవారీగా గత  ఎన్నికల్లో ఓటు వేయనివారి సంఖ్య లక్షల్లో లెక్కతేలింది. దేశంలోని నగరాలవారీగా ఆరా తీసినా- చెన్నై (60.5శాతం), లఖ్‌నవూ(58.1), దిల్లీ (67.8)ల సరసన హైదరాబాద్‌(53) వెనకబాటుతనం పౌరస్వామ్యం మౌలిక స్ఫూర్తికే తూట్లు పొడుస్తోంది. వందకన్నా తక్కువ ఓట్ల తేడా అభ్యర్థుల తలరాతలు మార్చేసే ఉదంతాలెన్నో చూస్తున్నాం. వాజ్‌పేయీ జమానాలో కేవలం ఒక్క ఓటు తేడాతో కేంద్రంలో ప్రభుత్వమే కూలిపోయింది. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ నిర్ణాయకమైందే. ‘నేను ఓటేయకపోతే ఏమవుతుందిలే!’ అని ఏ ఒక్క ఓటరూ తలపోసే వీల్లేదు. మహాత్మాగాంధీ చెప్పినట్లు, జనాభిప్రాయమే ప్రజాస్వామ్య వజ్రాయుధం. దానికి ఏ దశలోనూ అలసత్వమనే తుప్పుపట్టకుండా కాచుకోవడం బాధ్యతాయుత పౌరధర్మం!

ధన, భుజబల ప్రదర్శనలు పెచ్చరిల్లడం దేశంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యాన్ని కుంగదీస్తోందన్నది శేషన్‌, గోపాలస్వామి మొదలు నిన్నటి రావత్‌ వరకు పలువురు మాజీ ప్రధానాధికారులు వెల్లడించిన చేదు నిజం. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో 83శాతం కోటీశ్వరులైన ప్రస్తుత హోరాహోరీలోనూ అంతిమఘట్టం చేరువయ్యేకొద్దీ ప్రలోభాల జాతర, డబ్బూ మద్యం పంపిణీ పాతరికార్డుల్ని బద్దలుగొడుతున్నాయి. తనిఖీల్లోనే కోట్లరూపాయల మేర నోట్ల కట్టలు పట్టుబడుతుండగా అంతకు మరెన్నో రెట్ల వాస్తవ వ్యయం ధనస్వామ్య మహా తిరణాలను కళ్లకు కడుతోంది. కొన్నిచోట్ల ఓటుకు రెండువేల రూపాయల నోటును ఎరవేస్తుండగా, బలమైన అభ్యర్థి ఖర్చు రూ.30-60 కోట్లకు చేరుతున్నచోట్ల మరికొంచెం ఎక్కువ రేటు పలుకుతోంది. తలా రెండు వేలివ్వడమంటే- అయిదేళ్లు (1825 రోజులపాటు) ఇష్టారాజ్యంగా సర్వాధికారాలు చలాయించడానికి రోజుకు 110 పైసల చొప్పున విదుపుతున్నట్లు! ఇలా తలసరి ఓటుకు రేటు కట్టి అయిదేళ్ల పదవీ కాలానికి లైసెన్స్‌ సంపాదించి ప్రజాప్రతినిధిగా వందల కోట్లు కొల్లగొట్టదలచిన బరితెగింపు ధోరణుల్ని ఓటర్లు ఉపేక్షించకూడదు. అర్హతలు, ప్రజాసేవానురక్తి ఊసెత్తకుండా- ప్రలోభాల మాయవలలు విసిరి, డబ్బు వెదజల్లి, మద్యం పారించి అధికారం చేజిక్కించుకోగలమని విర్రవీగుతున్నవాళ్లను ఓటర్లు పనిగట్టుకొని ఓడించాలి. వరదలెత్తుతున్న ధనప్రవాహం, ఇతరత్రా ప్రలోభాల విషప్రభావం ప్రజాస్వామ్యాన్ని ‘హైజాక్‌’ చేసి రాజకీయ పెత్తందారుల పరంకావించే దుస్తంత్రాన్ని తిప్పికొట్టగలిగేది ఓటర్ల విచక్షణే. ధనతంత్ర కుయుక్తులతో రాజకీయాధికారాన్ని కైవసం చేసుకోగోరే అభ్యర్థుల పట్ల ఏవగింపుతో పోలింగుకు దూరమైతే దొంగ ఓట్ల ఉరవడికి అవకాశం ఇచ్చినట్లే. అటువంటి దొడ్డిదోవలకు దారులు మూసెయ్యాలంటే, అర్హులైన ఓటర్లందరూ విధిగా పోలింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకోవాలి. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కును సక్రమంగా వినియోగించుకోవడంలో యువతరం ముందుండి కదలాలి!

రాష్ట్రపతిగా డాక్టర్‌ కలామ్‌ ఉద్బోధించినట్లు- ఓటు అనేది పవిత్ర హక్కు మాత్రమే  కాదు, అది మాతృభూమికోసం నిబద్ధతతో నిర్వర్తించాల్సిన బాధ్యత. ఓటుహక్కును అస్తిత్వ చిహ్నంగా భావించడం పురోగామి దేశాల్లో విప్పారుతున్న పౌర చేతనకు దాఖలా. సమర్థుల చేతుల మీదుగా విధాన రచన, ప్రణాళికల రూపకల్పన సాగేందుకు దోహదపడటంలో పౌరులు స్వీయ ధర్మాన్ని నిష్ఠగా నిర్వహిస్తున్న చోట్ల బహుముఖాభివృద్ధి సుసాధ్యమవుతోంది. అందుకు విరుద్ధంగా ఇక్కడ గణనీయ సంఖ్యలో ఓటర్లు విముఖత చూపడం ఎంత అనర్థదాయకమో శేషన్‌ గతంలోనే హెచ్చరించారు. మంచివాళ్లు ఓటింగుకు దూరంగా ఉండటం చెడ్డ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీస్తుందని ఆయన చెప్పింది అక్షరసత్యం. దేశంలో 65 శాతానికిపైగా జనాభా 35ఏళ్లలోపు వయసువారేనని గణంకాలు చాటుతున్నాయి. వర్తమానాన్నే కాదు, భవిష్యత్తునూ నిర్దేశించగల పటుతర శక్తి ఓటుహక్కు రూపేణా తమకు దఖలుపడినా- ఆచితూచి ఉపయోగించుకోవడంలో నిర్లక్ష్యం వారి కలలకు ఆశలకు గ్రహణం పట్టిస్తోంది. ‘రాష్ట్రం దేశం మావి... దిశానిర్దేశమూ మాదే’నంటూ ముఖ్యంగా యువ ఓటర్లు చురుగ్గా వ్యవహరించాల్సి ఉంది. వివిధ పక్షాల తరఫున అభ్యర్థుల ఖరారులో పౌర సమాజం మనోభావాల్ని ఏమాత్రం పట్టించుకోని నాయకులు, గెలుపు గుర్రాల పేరిట ధన భుజబలుల్నే ఆనవాయితీగా బరిలోకి దించుతున్నారు. ఎలాగైనా నెగ్గితీరాలన్న పంతంతో దిగజారుడు ధోరణుల్లో ఒకరిని మించి మరొకరు భ్రష్టుపడుతున్నారు. అభ్యర్థులెవరూ నచ్చలేదని అందర్నీ టోకున తిరస్కరించడానికి ‘నోటా’ వీలు కల్పిస్తున్నా- ఉన్నంతలో ఉత్తముల్ని ఎన్నుకోవడం ఓటర్లకు అనుసరణీయ మార్గం. కొన్ని నిమిషాలు వెచ్చించి పౌరులిచ్చే తీర్పు రాబోయే అయిదేళ్లపాటు వారి జీవన స్థితిగతుల్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యాంగదత్తమైన పౌర హక్కు నిరుపయోగం కాకుండా అందరూ ఓటేస్తేనే, ప్రజాస్వామ్యం అర్థవంతమై భాసిస్తుంది!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.