Hathras stampede: దారుణ విషాదం

నూట ఇరవైకి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్‌ తొక్కిసలాటకు బాధ్యులెవరు? తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ, సరైన ఏర్పాట్లేవీ లేనిచోట వేలాది జనంతో ‘సత్సంగ్‌’ నిర్వహించిన భోలేబాబా,

Published : 04 Jul 2024 01:35 IST

నూట ఇరవైకి పైగా నిండు ప్రాణాలను బలితీసుకున్న హాథ్రస్‌ తొక్కిసలాటకు బాధ్యులెవరు? తాను సాక్షాత్తు పరమాత్మ స్వరూపుణ్ని అని ప్రచారం చేసుకుంటూ, సరైన ఏర్పాట్లేవీ లేనిచోట వేలాది జనంతో ‘సత్సంగ్‌’ నిర్వహించిన భోలేబాబా, అతడి అనుచరులు- మొన్నటి మారణకాండకు ప్రధాన కారకులు. నేరచరిత్ర కలిగిన ఒక వ్యక్తికి అమాయక భక్తజన భావోద్వేగాలతో మృత్యుక్రీడలాడే అవకాశమిచ్చిన సర్కారీ యంత్రాంగమూ హాథ్రస్‌ మహావిషాదానికి బాధ్యత వహించాల్సిందే! ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటా జిల్లావాసి అయిన సూరజ్‌ పాల్‌- 28 ఏళ్ల క్రితం హెడ్‌కానిస్టేబుల్‌గా పని చేసేవాడు. మంత్ర తంత్రాలు, లైంగిక దోపిడీకి సంబంధించిన కేసులో నిందితుడైన అతణ్ని అప్పట్లో ఉద్యోగంలోంచి గెంటేశారు. జైల్లోంచి విడుదలయ్యాక నారాయణ్‌ హరి అలియాస్‌ సాకార్‌ విశ్వహరిగా పేరు మార్చుకున్న సూరజ్‌పాల్‌... స్వయంప్రకటిత దేవుడయ్యాడు! ముప్ఫై ఎకరాల్లో ఆశ్రమాన్ని, ‘సేవాదార్‌’ పేరిట సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మంచినీళ్లతో సర్వరోగాలను నయం చేయగలిగిన మహిమాన్విత భోలేబాబాగా సూరజ్‌పాల్‌ను కొలుస్తూ- ఉత్తర్‌ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ వాసులు కొన్ని లక్షల మంది అతడి మాయవలలో చిక్కుకున్నారు. ఆ బాబాపై పలు కేసులున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ డీజీపీ విక్రమ్‌ సింగ్‌ చెబుతున్నారు. లైంగిక వేధింపులు, భూఆక్రమణల అభియోగాలను నెత్తినమోస్తున్న భోలేబాబా సేవలో యూపీలోని బడా రాజకీయ నాయకులతోపాటు ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులెందరో తరించిపోతుంటారు.  కొవిడ్‌ కల్లోల కాలంలో వేలమందితో సమావేశాలు పెట్టిన బాబాపై ఈగైనా వాలలేదు. ఓట్ల రాజకీయాలకోసం ఇటువంటి నకిలీ బాబాలకు పొర్లుదండాలు పెడుతున్న నేతాగణాలు- మానవాభివృద్ధిని పొట్టనపెట్టుకునే సామాజిక విష రుగ్మతలను పెంచి పోషిస్తున్నాయి! 

ప్రజల ఆశలు, భయాలను పెట్టుబడిగా మార్చుకుని, ఆధ్యాత్మికత ముసుగులో అరాచకాలకు పాల్పడిన కేటుగాళ్లకు దేశీయంగా లోటేమీ లేదు. గుర్మీత్‌ రామ్‌రహీమ్‌ సింగ్, ఆశారాం బాపు, రామ్‌పాల్, సురాబాబా... ఇలా చెప్పుకొంటూ వెళ్తే- హత్యలు, అత్యాచారాలు, మోసాలు, భూకబ్జాల వంటి ఎన్నో నేరాలకు ఒడిగట్టిన దొంగ గురువులు కోకొల్లలు. అటువంటి నయవంచకుల బాగోతాలు తరచూ వెలుగు చూస్తున్నప్పటికీ నకిలీ బాబాల స్వైరవిహారానికి  ఎందుకు అడ్డుకట్ట పడటం లేదు? సామాన్యుల అజ్ఞానాన్ని  మూఢత్వంలోకి మళ్ళించి స్వార్థ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్న రాజకీయ నాయకుల మూలంగా జనభారతానికి వాటిల్లుతున్న నష్టం అంతాఇంతా కాదు. ‘మీ మూఢనమ్మకాలను ముందు వదిలించుకోండి... ధైర్యంగా ఉండండి... సత్యాన్ని తెలుసుకోండి... దాన్నే ఆచరించండి’ అని పిలుపిచ్చారు స్వామి వివేకానంద. అద్భుతాల కోసం వెంపర్లాడుతూ స్వీయవిచక్షణను కోల్పోతున్నవారు- ‘వివేక’ మార్గాన్ని వదిలి అంధవిశ్వాసాల్లో కూరుకుపోతున్నారు. బాణామతి, చిల్లంగి వంటి వాటి పేరిట సాటి మనుషులను కొట్టి చంపడం నుంచి గుప్తనిధులకోసం  పసివారిని బలివ్వడం వరకు జుగుప్సాకర నేరాలెన్నింటికో పాల్పడుతున్నారు. మానవాతీత శక్తుల మీద గుడ్డినమ్మకంతో అనారోగ్యానికి తగిన చికిత్స పొందకుండా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నవారూ చాలామందే ఉన్నారు. ప్రగతి విఘాతకరమైన ఈ చీకటి తొలగిపోవాలంటే- రాజ్యాంగం ఆకాంక్షిస్తున్నట్లు, పౌరులందరూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకోవాలి. ప్రశ్నించడం, చర్చించడం, విమర్శించడం, హేతుబద్ధమైన విషయాలనే విశ్వసించడం వంటి ప్రజాస్వామిక విలువలను ఒంటపట్టించుకోవాలి. శాస్త్రీయ విద్యాబోధన, జనచేతన కార్యక్రమాల నిర్వహణ ద్వారా ప్రభుత్వాలు తమవంతుగా పాటుపడితేనే- భారతీయ సమాజంలో విజ్ఞాన దీపాలు వెలుగుతాయి!  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.