Putin: పుతిన్‌ యుద్ధోన్మాదం

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగి రెండేళ్లు దాటిపోయింది. రావణకాష్ఠంగా రగులుతున్న ఆ యుద్ధం- ప్రపంచం గుండెలపై కుంపటిగా పరిణమించింది. స్వీయభద్రత కోసం నాటో కూటమిలో చేరాలనుకున్న ఉక్రెయిన్‌పై రష్యా అధినేత పుతిన్‌ కత్తిగట్టారు.

Updated : 18 Jun 2024 06:57 IST

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగి రెండేళ్లు దాటిపోయింది. రావణకాష్ఠంగా రగులుతున్న ఆ యుద్ధం- ప్రపంచం గుండెలపై కుంపటిగా పరిణమించింది. స్వీయభద్రత కోసం నాటో కూటమిలో చేరాలనుకున్న ఉక్రెయిన్‌పై రష్యా అధినేత పుతిన్‌ కత్తిగట్టారు. పొరుగు దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ ఆయన కదనానికి కాలుదువ్వారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై దండెత్తిన రష్యా- అప్పటి నుంచి  ఎడతెగని వినాశానికి పాల్పడుతోంది. మిత్రపక్షాల అండతో మాస్కోకు ఎదురునిలిచిన కీవ్‌- తన స్వేచ్ఛా స్వాతంత్య్రాల సంరక్షణకు ప్రాణాలుపెట్టి పోరాడుతోంది. యావత్‌ మానవాళికీ అనర్థదాయకమవుతున్న యుద్ధాన్ని విరమించాలన్న ప్రపంచ దేశాల హితవచనాలకు పుతిన్‌ పూచికపుల్లపాటి విలువైనా ఇవ్వడంలేదు. ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకోసం తాజాగా స్విట్జర్లాండ్‌ ఆతిథ్యమిచ్చిన అంతర్జాతీయ సదస్సుకూ రష్యా హాజరు కాలేదు. మాస్కోకు వెన్నుదన్నుగా నిలుస్తున్న బీజింగ్‌ కూడా ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టింది. ప్రపంచ శాంతికీ, ఆహారభద్రతకూ పెనుప్రమాదకరమైన యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తపరచిన స్విస్‌ సదస్సు- ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రత పరిరక్షణకు పిలుపిచ్చింది. ఆ మేరకు 80కి పైగా దేశాలు, అంతర్జాతీయ సంస్థలు సంతకం చేసిన ఉమ్మడి ప్రకటనకు న్యూదిల్లీ దూరంగా ఉండిపోయింది. రష్యాతో మైత్రీబంధం కారణంగా ఇండియా ఆ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి మిగిలిన దేశాలతో కలిసి పాటుపడతానని హామీ ఇచ్చింది. ఇటీవలి జీ7 సమావేశ సందర్భంలోనూ అదే విషయాన్ని భారత్‌ స్పష్టంచేసింది. ఉక్రెయిన్‌తో సంధికి సిద్ధమంటున్న పుతిన్‌- అందుకోసం అలవిగాని షరతులను విధిస్తున్నారు. అవసరమైతే అణ్వాయుధాల వినియోగానికి సైతం వెనకాడబోననే వదరుబోతు ప్రకటనలతో ప్రపంచానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు!

భీకర సాయుధ సంపత్తితో ఉక్రెయిన్‌ను తేలిగ్గానే లొంగదీసుకోవచ్చునని రష్యా మొదట్లో భావించింది. ఉక్రెయిన్‌ తలొగ్గకపోవడం, నాటో దేశాలు దానికి అండదండలు అందిస్తుండటంతో యుద్ధ తీవ్రత ఇంకా పెరిగింది. అది ప్రపంచార్థికాన్ని పెను ఇక్కట్లలోకి నెట్టింది. పుతిన్‌ సేనల ధాటికి ఉక్రెయిన్‌లో 30శాతం పంట భూములు నాశనమయ్యాయి. పొద్దుతిరుగుడు నూనె, గోధుమ ధరలకు రెక్కలొచ్చాయి. ఆఫ్రికాలోని పలు దేశాలు ఆకలి మంటల్లో చిక్కుకున్నాయి. చమురు.. ఎరువుల ధరలూ అదుపు తప్పి ద్రవ్యోల్బణం విజృంభించింది. రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, ఐరోపాలు విధించిన ఆర్థిక ఆంక్షలు ఆశించిన మేర ఫలితాన్ని ఇవ్వలేదు. పాశ్చాత్య దేశాల అభ్యంతరాలను పట్టించుకోకుండా మాస్కో నుంచి తక్కువ ధరకు చమురును ఇండియా కొనుగోలు చేసింది. దశాబ్దాలుగా రష్యాతో ముడివడిన సంబంధ బాంధవ్యాల దృష్యా అంతర్జాతీయ వేదికలపై భారత్‌ తటస్థంగా వ్యవహరిస్తోంది. కానీ- ఇది యుద్ధాల శకం కాదని, వినాశకర సమరానికి ముగింపు పలకాలని మాస్కోకు ఇండియా ఇప్పటికే సూచించింది. ఎవరేమి చెప్పినా బేఖాతరు చేస్తున్న పుతిన్‌ కారణంగా ఆయన సొంత సైనికులే వేల సంఖ్యలో బలయ్యారు. శిథిలాల దిబ్బగా మారిన ఉక్రెయిన్‌ మళ్ళీ కోలుకోవాలంటే రూ.40 లక్షల కోట్లు అవసరమవుతాయని ఐరాస ఇటీవల అంచనా వేసింది. మానవతా దీపాన్ని కొండెక్కిస్తున్న యుద్ధాన్ని నిలిపివేసేలా పుతిన్‌ను ఒప్పించేందుకు ప్రపంచ దేశాలు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయాలి. అలీనోద్యమ నిర్మాతల్లో ఒకటైన ఇండియా సైతం విశ్వశాంతి స్థాపనకోసం జరుగుతున్న కృషిలో చురుగ్గా భాగస్వామి కావాలి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.