Amaravati: మగువ.. తెగువ

అమరావతి ఉద్యమాన్ని అంతా తామై నడిపించారు. ఉద్యమాన్ని అణచడానికి పోలీసులు లాఠీలు ఎత్తినా.. బూటు కాళ్లతో తన్నినా సహనాన్నే చూపారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రాజధానిని కాపాడుకునే పోరాటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు.

Updated : 04 Mar 2022 05:53 IST

మగువా.. మగువా లోకానికి తెలుసా నీ విలువా
మగువా.. మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా
అటు ఇటు అన్నింటా.. నువ్వే జగమంతా...
(సమాజంలో మహిళల ప్రాధాన్యానికి ఒక సినీ కవి ఇచ్చిన అక్షర రూపం ఇది)


అహింసే మన జీవన విధానమైతే...భవిష్యత్తు అంతా మహిళలదే - మహాత్మాగాంధీ


అమరావతి ఉద్యమాన్ని అంతా తామై నడిపించారు. ఉద్యమాన్ని అణచడానికి పోలీసులు లాఠీలు ఎత్తినా.. బూటు కాళ్లతో తన్నినా సహనాన్నే చూపారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే రాజధానిని కాపాడుకునే పోరాటంలో నిర్ణయాత్మక పాత్ర పోషించారు. అమరావతి ఉద్యమాన్ని 807 రోజులపాటు సుదీర్ఘంగా నడిపిన మహిళా రైతులు... తెగువ, పట్టుదలకు నిలువెత్తు సాక్ష్యంగా  నిలిచారు.


2019 డిసెంబరు 17... అమరావతి ఉద్యమం ప్రారంభమైన రోజు. నాడు మహిళలు తమ ఇళ్లకు తాళాలు వేసి రోడ్ల మీదకు వచ్చారు. గతంలో ఇళ్ల నుంచి ఎప్పుడూ బయటకు వచ్చిన వాళ్లు కాదు. బిడ్డల భవిష్యత్తు ఏంటి? అనే ప్రశ్న వారిని కలచివేసింది. అమరావతి కోసం తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత అకస్మాత్తుగా ఇక్కడ రాజధాని లేదంటే ఏంచేయాలో తోచలేదు. అలాంటి నిస్సహాయ స్థితిలో వారి నోటి నుంచి వచ్చిన మాట... జై అమరావతి. అమరావతి పరిరక్షణ ఉద్యమం వారిని క్రమంగా రాటుదేల్చింది. పోలీసుల నిర్బంధాలను, ఇనుప కంచెలను ఛేదించగల తెగువను వారికిచ్చింది. ఎన్ని రోజులైనా శిబిరంలోనే ఉంటాం... మాది రాజధాని అనిపించుకునే వరకు బయటకు వెళ్లేది లేదనే పట్టుదలను వారిలో పెంచింది. కేసులకు వెరవలేదు. లాఠీలకు బెదరలేదు. ‘ఒక్కటే రాజధాని.. అది అమరావతే కావాలి’ అని భీష్మించి, విభిన్న రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతున్న మహిళలకు న్యాయస్థానం గురువారం ఇచ్చిన తీర్పు కొంత ఊరట కలిగించింది.

నిర్బంధాలపై సహనంతో పైచేయి

‘‘రోడ్డు విస్తరణలో గజం స్థలం పోతుందంటేనే ఎంతో బాధ పడతాం. అలాంటిది కన్నతల్లిలా చూసుకునే 33 వేల ఎకరాలను త్యాగం చేశాం. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవితవ్యానికి సొంత పొలాల్ని ధారాదత్తం చేశాం.  ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని అనేదే నినాదం’’ అని ఉద్యమంలో పాల్గొన్న మహిళలు ముక్తకంఠంతో చెప్పిన మాటలు ఇవి. పెయిడ్‌ ఆర్టిస్టులతో మహిళలను ముందుంచి ఉద్యమం చేయిస్తున్నారని అధికార పార్టీ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నా సహనంతో భరించారు. శాంతియుతంగానే నిరసన తెలిపారు.

ఉద్యమ నిర్మాణంలో ఎన్నో కష్టాలు

సచివాలయం, కోర్టు ముట్టడిలు, హైవే దిగ్బంధనం వంటి ఆందోళనల్లో కీలక భూమిక పోషించారు. గత ఏడాది మార్చి 8న మహిళా దినోత్సవం రోజు కనకదుర్గమ్మ ఆలయానికి పాదయాత్రగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నా... అనుకున్నది సాధించారు. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు’ అనే నినాదంతో 45 రోజుల సుదీర్ఘ పాదయాత్రను ముందుండి నడిపించారు.

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని