Huzurabad By Election: గెలుపు మాదే..

హుజూరాబాద్‌ రాజకీయ సమరాంగణంలో వేడి పతాకస్థాయికి చేరింది. ఉప ఎన్నికను పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ గెలుపు కోసం అహరహం శ్రమించారు. ఈటల రాజేందర్‌ విజయానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటికో ఓటు వేసి

Updated : 24 Sep 2022 16:09 IST

ఉప ఎన్నికపై ఈనాడు ఇంటర్వ్యూలో మూడు ప్రధాన పార్టీల నేతల ధీమా

హుజూరాబాద్‌ రాజకీయ సమరాంగణంలో వేడి పతాకస్థాయికి చేరింది. ఉప ఎన్నికను పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆర్థిక మంత్రి హరీశ్‌రావు తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ గెలుపు కోసం అహరహం శ్రమించారు. ఈటల రాజేందర్‌ విజయానికి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. ఇంటికో ఓటు వేసి కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను ఆశీర్వదించాలనే నినాదాన్ని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. ప్రచార అంకానికి బుధవారంతో తెరపడిన నేపథ్యంలో హరీశ్‌రావు, బండి సంజయ్‌, రేవంత్‌రెడ్డి ‘ఈనాడు’ ఇంటర్వ్యూల్లో విజయంపై ధీమా వ్యక్తం చేశారు.


ఎగిరేది గులాబీ జెండానే

తెరాసతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారు

సెంటిమెంట్‌ డైలాగులతో భాజపాకు ఓట్లు పడవు

సీఎం కేసీఆర్‌ ప్రచారాన్ని అడ్డుకున్నది వాళ్లే

 మంత్రి హరీశ్‌రావు

హుజూరాబాద్‌ ఓటర్లు అభివృద్ధిని కోరుకుంటున్నారు. మరింత అభివృద్ధికి నిధుల్ని తీసుకొస్తామని చెప్పాం. రాబోయే రోజుల్లో పేదలకు సొంత జాగాలో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చాం. హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే. సెంటిమెంట్‌ డైలాగులతో భాజపాకు ఓట్లు పడవు. నిజానికి కేంద్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమీ లేదు.


మీ అభ్యర్థి విజయావకాశాలు ఎలా ఉన్నాయి ?

హుజూరాబాద్‌ గడ్డ తెరాస అడ్డా. 2001లోనే ఇక్కడ తెరాస అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను గెలిచింది. ఇప్పటి వరకు ఇక్కడ ఏ ఎన్నికలు జరిగినా.. గులాబీ జెండా రెపరెపలాడేలా ఓటర్లు తీర్పునిచ్చారు. కచ్చితంగా ఈ ఉప ఎన్నికలోనూ తెరాస మంచి ఆధిక్యంతో గెలుస్తుంది.


ఈ ఎన్నిక తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందని ఈటల అంటున్నారు..?

అసలు ఆ పదం ఉచ్చరించే అర్హత ఆయనకు లేదు. ఎప్పుడైతే దళితుల ఎసైన్డ్‌ భూములను కబ్జా పెట్టారో.. అప్పుడే ఆయన ఆత్మగౌరవం మంట కలిసి పోయింది. దిల్లీ పెద్దల ముందు ఆయన దాన్ని తాకట్టుపెట్టారు. ఆరుసార్లు గెలిచినా మహిళా సంఘాల భవనాల్ని కట్టలేదు. పేదలకు నాలుగు వేల రెండు పడకగదుల ఇళ్లు వచ్చినా.. ఒక్కటీ కట్టలేదు. ఈ విధంగా మహిళల, పేదల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ప్రజలు ఆయన్ని విశ్వసించే పరిస్థితి లేదు.


ప్రచారంలో మీకు ఎలాంటి స్పందన కనిపించింది ?

అభివృద్ధికి పెద్ద పీట వేసే తెరాసను ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రం పెట్రోల్‌ ధర రూ.110కి పెంచింది. డీజిల్‌ ధర వంద దాటింది. సిలిండర్‌ వెయ్యి రూపాయలు అయ్యింది. ఇప్పుడు ఈ హుజూరాబాద్‌లో ఎన్నిక ఉందని పెంచాల్సిన ధరను ఆపారు. 30న ఎన్నికలు అయిపోగానే మరో రూ.200 పెంచడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అంటే వచ్చేనెల రెండునో.. మూడునో సిలిండర్‌ ధర రూ.1,200 దాటబోతోంది. ఇలా ధరలు పెంచుతున్న భాజపాకు ఓటేయ్యాలని ప్రజలు ఆలోచించనే ఆలోచించరు.


ప్రచార పర్వాన్ని ఎలా విశ్లేషిస్తారు ?

మొత్తం ఎన్నికల ప్రచార సరళిని గమనిస్తే ఎంతసేపు తెరాసను దూషించడం, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం తప్ప..ఒక్క సానుకూల అంశం కూడా భాజపాకు లేదు. పైగా అబద్ధాలు చెప్పారు. ఇదే మాకు ప్రచారాస్త్రంగా మారింది. కేసీఆర్‌ కిట్‌లో రూ.5 వేలు కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. మేము సవాలు విసిరితే తోకముడిచారు. వడ్డీలేని రుణం రూ.25.69 కోట్లు ఇస్తే చెల్లని చెక్కులిచ్చానంటూ నామీద బురద జల్లారు. చర్చకు పిలిస్తే రాలేదు. భాజపా అధికారంలోకి వచ్చాక పెట్రోల్‌, డీజీల్‌పై పన్ను రూపంలో ఒక లీటర్‌ మీద రూ.32.90 పెంచారు. దీనిమీదా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చర్చకు రాలేదు.


అధికార బలాన్ని ప్రయోగిస్తున్నారనే భాజపా నేతల వ్యాఖ్యలను మీరెలా చూస్తారు?

కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని మా మీద వారే దాడులు చేస్తున్నారు. ఏ ఉప ఎన్నిక చరిత్రలో లేని విధంగా ఇక్కడికి 20 ప్లాటూన్ల బలగాలతో 2 వేల మంది పోలీసుల్ని తెచ్చుకుని.. ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసి ఓట్లు వేయించుకోవాలని భాజపా వాళ్లు భావిస్తున్నారు. బండి సంజయ్‌ హుజూరాబాద్‌ పక్క జిల్లాలో సభ పెట్టుకోవడానికి ఎన్నికల కోడ్‌ అడ్డం రాలేదు. సీఎం కేసీఆర్‌ సభ ఖరారు కాగానే.. పక్క జిల్లాలకు కోడ్‌ వర్తిస్తుందని ఉత్తర్వులు తెచ్చింది వాళ్లు. ఇలా ఎన్నికల కమిషన్‌ను అడ్డుపెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది ఎవరనేది ప్రజలు గమనిస్తున్నారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి ఉత్తరం రాసి దళితబంధును ఆపించారు. పైగా మాపై ఆరోపణలు చేస్తున్నారు.


చివరగా మీరు ఓటర్లకు చేసే విజ్ఞప్తి ఏమైనా ఉందా ?

మా అభివృద్ధిని చూడండి. ఇంకా రెండున్నర సంవత్సరాలు తెరాస అధికారంలో ఉంటుంది.  హుజూరాబాద్‌లో అభివృద్ధి కొనసాగాలంటే తెరాసతోనే సాధ్యం. భాజపా వాళ్ల సెంటిమెంట్‌ డైలాగ్‌లు కడుపు నింపవు. మన వేలితో మన కన్నును పొడుచుకోవద్దు. భాజపాకు ఈ ఉప ఎన్నికలో ఓటు వేస్తే పెరుగుతున్న ధరలను ఆమోదించినట్టు అవుతుంది. కాబట్టి తెరాసను ఆదరించాలని హుజూరాబాద్‌ ఓటర్లను వేడుకుంటున్నా. మా అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను గెలిపించాలని కోరుతున్నా.

- ఈనాడు డిజిటల్‌, కరీంనగర్‌


తెరాసకు భవిష్యత్తు లేదు

 హుజూరాబాద్‌లో ఓటమే ఆ పార్టీ పతనానికి తొలి మెట్టు

 దళితబంధును 2023 వరకు అమలు చేయకుండా ముఖ్యమంత్రి కుట్ర

 భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

తెరాస ఓడిపోతుందనుకున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ప్రచారం చేయరు. నాడు దుబ్బాక ఉప ఎన్నికలో, ఇటీవల జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అదే జరిగింది. ఇప్పుడు హుజూరాబాద్‌లో ఓటమి ఖాయమని తెలిసే ప్రచారానికి వెళ్లలేదు. అబద్ధాలు, అవినీతి సొమ్ముతో గెలిచేందుకు.. ఓటుకు రూ.20 వేలు పంచుతున్న తెరాస నిజ స్వరూపం ప్రజలకు తెలిసింది. ఆ ప్రలోభాల్ని ఓటర్లు తిప్పికొడతారు. భాజపా భారీ మెజార్టీతో విజయం సాధించబోతోంది. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో మేం అధికారంలోకి రావడానికి ఈ ఫలితం తొలి మెట్టు అవుతుంది. తెరాసకు దశ, దిశ లేవు. రాష్ట్రంలో ఆ పార్టీకి ఇక భవిష్యత్తు కూడా ఉండదు.


ఆస్తుల రక్షణకే భాజపాలో ఈటల చేరారన్న రేవంత్‌ విమర్శలపై ఏమంటారు ?

ఈటలను కాంగ్రెస్‌ కూడా చేర్చుకునేందుకు ప్రయత్నించింది కదా! ఆయన ఆస్తులను చూసేనా? దిల్లీలో..గల్లీల్లో లేని పార్టీ అది. తెరాసను వదిలిపెట్టి మాతో పోటీపడేందుకు ప్రయత్నిస్తోంది.


ప్రచార అంకం ముగిసిన తర్వాత మీ అంచనాలు ఎలా ఉన్నాయి ?

పింఛన్ల పేరుతో, పోలీసులతో తెరాస బెదిరించినా ప్రజలు భాజపాకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రైవేటు సంస్థతో ఓటుకు రూ.20 వేలు పంచుతూ ఆ విషయంలో విజయం సాధించిన తెరాసకు హేట్సాఫ్‌. కానీ ప్రజలు అధికార పక్షానికి ఓటేయరు. తెరాస మోసాన్ని దళిత సమాజం గుర్తించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, అగ్రవర్ణాలు వ్యతిరేకంగా ఉన్నాయి. వరి కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటేే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వద్దంటోంది? వరి కావాలంటే భాజపాకు.. ఉరి కావాలంటే తెరాసకు ఓటు వేయాలన్న మా ప్రచారానికి మంచి స్పందన వచ్చింది.


హుజూరాబాద్‌లో ప్రధాన పార్టీలు భారీగా ఖర్చు చేస్తున్నాయనే ప్రచారంపై మీరేమంటారు ?

ఉద్యమ సమయంలో పైసల్లేక కూలి పనులు, భోజన కార్యక్రమాలతో చందాలు తీసుకున్న తెరాస.. అధికారంలోకి వచ్చాక విష సంస్కృతి తెచ్చింది. ఎన్నికల్లో రూ.వేల కోట్లు ఖర్చు చేస్తోంది. హుజూరాబాద్‌లోనూ విచ్చలవిడిగా డబ్బు పెడుతూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తోంది. సేవ చేయాలన్న దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నవాళ్లు అధికార పార్టీ తీరు చూసి భయపడిపోతున్నారు. ఈ పరిస్థితికి చరమగీతం పాడాలి.


పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరల పెరుగుదలను తెరాస, కాంగ్రెస్‌ ప్రస్తావిస్తున్నాయి కదా ?

రాష్ట్రంలో 10.70 లక్షల కుటుంబాలకు కేంద్రం ఉజ్వల గ్యాస్‌ కనెక్షన్లను ఉచితంగా ఇచ్చింది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.41 ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి వస్తోంది. జీఎస్టీలోకి తీసుకురావడానికి, ధరలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవట్లేదు?


భాజపా ఎన్నికల ప్రణాళికకు సంబంధించి మంత్రి హరీశ్‌రావు విమర్శలపై మీ స్పందన ఏమిటి ?

రైల్వే లైన్లకు, రైల్వే స్టేషన్లకు తేడా తెలియని మూర్ఖులు, జోకర్లే మా మేనిఫెస్టోపై విమర్శలు చేస్తున్నారు. భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా మేనిఫెస్టోను చెప్పుకొన్న తెరాస గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ అమలు చేయలేదు. కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు. అందుకే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో 2023లో మేం అధికారంలోకి రావడం ఖాయం.


దళిత బంధు పథకం ఆగటాన్ని మీరెలా చూస్తారు?

దళితబంధు పథకంతో మోసం చేసిందే ముఖ్యమంత్రి. ఈ పథకాన్ని ఆపేయాలని ఏ పార్టీ లేఖ ఇవ్వలేదని ఎన్నికల సంఘం హైకోర్టుకు చెప్పింది. తెరాస న్యాయవాది ఇదే విషయం చెప్పారు. ఉప ఎన్నిక తర్వాతే కాదు.. 2023 ఎన్నికల వరకూ ఈ పథకం అమలు కావద్దన్న పన్నాగంతో సీఎం కుట్ర పన్నారు. ప్రైవేటు వ్యక్తులతో కేసు వేయించబోతున్నారు.


మీ లోక్‌సభ స్థానం పరిధిలో జరుగుతున్న ఎన్నిక కదా... ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారా ?

ప్రతి ఎన్నికలాగే ప్రత్యేక దృష్టి పెట్టాం. ఉద్యమ సమయంలో, కొవిడ్‌ వేళ మంత్రిగా ఈటల చేసిన కృషి, కేంద్రంలో మోదీ ప్రభుత్వ పథకాలు, కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు, కార్యకర్తలు చేసిన ప్రచారం భాజపాను గెలుపు తీరానికి తీసుకెళ్తాయి.

- ఈనాడు, హైదరాబాద్‌


అధికార దుర్వినియోగం
 తెరాస, భాజపా రూ.కోట్లు పంచుతున్నాయ్‌

ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడంలేదు

కాంగ్రెస్‌కు... ఇంటికో ఓటేయాలని అభ్యర్థించాం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీకి ఇంటికో ఓటు వేయాలని హుజూరాబాద్‌ ఓటర్లను అభ్యర్థించాం. ఎన్నికల హామీలను నెరవేర్చని తెరాస, భాజపాకు ఓట్లు అడిగే హక్కే లేదు. తెరాస, భాజపాలు కోట్ల రూపాయలు వ్యయం చేస్తూ గెలవాలని ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల సంఘం, పోలీసు వ్యవస్థ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంలో విఫలమయ్యాయి. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా హుజూరాబాద్‌ ఎన్నిక రికార్డవుతుంది.


ఉప ఎన్నిక కోణంలో తెరాస, భాజపాలను మీరెలా చూస్తున్నారు ?

భాజపా, తెరాస ఏడున్నర ఏళ్ల్లుగా అధికారంలో ఉంటున్నా ప్రజలు అడిగినవి కాదు కనీసం వాళ్లు చెప్పినవి కూడా చేయలేదు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ లేదు.. రుణమాఫీ అమలు కాలేదు.. గిట్టుబాటు ధర దక్కడంలేదు.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు.. ఉద్యోగాలు భర్తీ చేయలేదు.. పండించిన ధాన్యాన్ని కొనడం అటుంచితే కనీసం గోనె సంచులను కూడా ఇచ్చే పరిస్థితి లేదు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.లక్షల కోట్లు వ్యయం చేసి ఇప్పుడేమో వరి సాగు చేయవద్దని అంటున్నారు. రైతులకు ఎంత కష్టం? వారిని ఏంచేద్దాం అనుకుంటున్నారు? రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణం, దళితులకు మూడెకరాల భూమి, ఎస్సీల్లో ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని వాళ్లే స్వయంగా చెప్పి చేయకుండానే ఎలా ఓట్లు అడుగుతున్నారు? భాజపా వారు రైౖతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామన్నారు. విదేశాల్లోని నల్లధనం తెచ్చి లక్షలు ఇస్తామన్నారు. ఇవి జరిగాయా? దేశంలో జరిగింది ఏమైనా చేశారంటే రూ.400 ఉన్న గ్యాస్‌ సిలిండర్‌ ధర వెయ్యి రూపాయలవడం, రూ.60 ఉన్న లీటరు పెట్రోలు ధర వంద రూపాయలు దాటడమే.


భాజపాను గెలిపించాలని కాంగ్రెస్‌ ప్రయత్నిస్తున్నట్లు తెరాస ఆరోపిస్తోంది కదా ?

భాజపా దిల్లీ పెద్దల సూచనల మేరకే సీఎం కేసీఆర్‌ నడుస్తున్నారు. భాజపాలోకి ఈటల రాజేందర్‌ను పంపిందే కేసీఆర్‌. ఆయన పార్టీలో చేరే  నేపథ్యంలో వాడిన ప్రత్యేక విమానం ఎవరిదో పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయి. వారి లోపాయికారీ వ్యవహారాలు వెలుగులోకి వస్తాయనే కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ దిల్లీలో భాజపా పెద్దల్ని కలిసిన తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే అన్నీ స్పష్టమవుతాయి. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ సభ ఎందుకు పెట్టలేదు? సభను అడ్డుకున్నదెవరు? కాంగ్రెస్‌, భాజపాలు సభలు పెట్టలేదా? ఎన్నికల ప్రచారం చేయలేదా? కేసీఆర్‌ సభ పెట్టకపోవడంలో ఆంతర్యం గుర్తించాలి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్‌, భాజపా కలిసిన దాఖలాలు ఉన్నాయా?


ఉప ఎన్నిక తీరుతెన్నులపై మీ విశ్లేషణ ఏమిటి ?

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగడంలేదు. రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల కమిషన్‌, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన పోలీసు శాఖ రెండూ కూడా వైఫల్యం చెందాయి. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతుంటే ఎన్నికల కమిషన్‌, పోలీసు యంత్రాంగం పట్టించుకోవడంలేదు. ఓటుకు రూ.6 వేలకు తగ్గకుండా పంచుతున్నారంటేనే ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో తెలుస్తోంది. తెరాస, భాజపా కోట్ల రూపాయలను ఖర్చు చేసి ఎన్నికల్లో గెలవాలని పోటీ పడుతున్నాయి. డబ్బులు పంచుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాయి.


ఈ ఎన్నికలో మీ బలం ఏమిటి ?

ప్రజల పక్షాన పోరాడేందుకు, ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ప్రభుత్వాలను నిలదీసేందుకు కాంగ్రెస్‌కు ఓటు వేయాలి. ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు ఇంటికో ఓటు వేయమని అడిగాం. ప్రజల పక్షాన నిలిచేది కాంగ్రెస్‌ పార్టీనే. విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్‌ను కాంగ్రెస్‌ బరిలో నిలిపింది. కార్యకర్తల బలమే మా పార్టీ బలం. ఎన్నికల ముందు కాంగ్రెస్‌లోని కొందరు తెరాస కోవర్టులుగా వ్యవహరించారు. ఈ ఎన్నికలో తెరాస, భాజపా అభ్యర్థుల్లో ఎవర్ని గెలిపించినా దోపిడీకి లైసెన్స్‌ ఇచ్చినట్లే కాబట్టి ఆలోచించి ఓటెయ్యాలి. వ్యక్తిగత లబ్ధిని కాకుండా రాష్ట్ర ప్రయోజనాలను ప్రజలు గుర్తించాలి. ఓటర్లు డబ్బులు, ప్రలోభాలకు లొంగకుండా వ్యవహరించాలి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని