Indian Army: మృత్యువుతో యుద్ధం

ఒక్క తూటా కూడా పేలకుండానే నిమిషాల వ్యవధిలో ఇరువైపులా దాదాపు 60 మంది సైనికుల ప్రాణాలు తీసిన గల్వాన్‌ ఘటన వాస్తవాధీన రేఖ వద్ద అనుసరిస్తున్న మన సైనిక వ్యూహ స్వరూపాన్ని మార్చేసింది. ‘ఆయుధాలు...

Updated : 22 Oct 2021 04:57 IST

గల్వాన్‌ ఘటనతో మారిన భారత సైనిక వ్యూహం

ఒట్టిచేత్తో శత్రువును మట్టికరిపించేలా కఠోర శిక్షణ

గాలి కూడా అందని చోట సైనికుల విధులు

గడ్డు పరిస్థితుల్లో సరిహద్దుల రక్షణ

వలసాల వీరభద్రం

వాస్తవాధీన రేఖ నుంచి ఈనాడు ప్రతినిధి

‘చంపు లేదంటే చావు’ ఈస్ట్రన్‌ కమాండ్‌లోని చైనా సరిహద్దు వద్ద 15వేల అడుగుల ఎత్తులో ఉన్న అస్సాం హిల్‌ మీద ఏర్పాటుచేసుకున్న బంకర్‌పై భారత సైనికులు రాసుకున్న నినాదం ఇది.

క్క తూటా కూడా పేలకుండానే నిమిషాల వ్యవధిలో ఇరువైపులా దాదాపు 60 మంది సైనికుల ప్రాణాలు తీసిన గల్వాన్‌ ఘటన వాస్తవాధీన రేఖ వద్ద అనుసరిస్తున్న మన సైనిక వ్యూహ స్వరూపాన్ని మార్చేసింది. ‘ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందాన్ని’ గౌరవిస్తున్నట్లు నటిస్తున్న చైనా సైనికులు కర్రలు, ఇనుపరాడ్‌ల వంటి ఆయుధాలతో విధ్వంసానికి పాల్పడిన నేపథ్యంలో భారత సైన్యం తన బలగాల శిక్షణ పంథాను మార్చింది. అత్యంత కఠినమైన వాతావరణంలో, ప్రాణవాయువు అరకొరగా అందే పరిస్థితుల్లో కఠోరంగా తర్ఫీదు ఇస్తోంది.

గల్వాన్‌ ఘటనకు ముందు వరకూ భారత సైన్యం వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ మాత్రమే నిర్వహించేది. 2017లో జరిగిన ‘డోక్లాం ఘటన’లో ఇరు దేశాల సైనికులు దాదాపు 72 రోజులపాటు ఎదురెదురుగా నిలబడ్డారు తప్ప దాడులకు దిగలేదు. గల్వాన్‌ ఘటన భారత సైన్యానికి కొత్త పాఠం నేర్పింది. తూటా పేల్చకూడదన్న ఒప్పందాన్ని గౌరవిస్తూనే ఒట్టిచేతులతో ప్రత్యర్థిని మట్టికరిపించే వ్యూహాలకు పదునుపెట్టాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ‘ప్లాన్‌-190’కి రూపకల్పన చేసింది. ఆ ప్రకారం..చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ప్రతి సైనికుడు వాతావరణం మార్పులతో సంబంధం లేకుండా ప్రతి 24 గంటలకు ఒకసారి 190 నిమిషాల పాటు కఠోర శిక్షణ తీసుకోవాలి. ఇందులో భాగంగా పుషప్స్‌, సిటప్‌, స్క్వాట్లు, చిన్నప్స్‌ వంటి కసరత్తులు చేయాలి. శీతాకాలం ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 25 డిగ్రీలకు పడిపోతుంది. సముద్ర పట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో వీరు విధులు నిర్వర్తిస్తుంటారు. సాధారణంతో పోలిస్తే ఇక్కడి వాతావరణంలో ఆక్సిజన్‌ 70 శాతమే ఉంటుంది. వాస్తవానికి ఇక్కడ శ్వాస తీసుకోవడమే చాలా కష్టం. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కఠోర శిక్షణ కొనసాగించాల్సిందే. దీంతోపాటు మానసిక ఆరోగ్యం కోసం 20 నిమిషాలు ధ్యానం చేయాలి. వీటన్నింటితోపాటు వేగంగా ప్రత్యర్థిపై విరుచుకుపడేలా కిక్‌ బాక్సింగ్‌, బురదలో కుస్తీ వంటి యుద్ధ విద్యలూ అభ్యసించాలి. ‘‘ఇక్కడ విధులు నిర్వర్తించాలంటే ఇవన్నీ తప్పవు. ఆలోచించేలోపే ఎదురుదాడికి దిగితేనే మనుగడ సాధ్యమవుతుంది. ఈ దిశగా బలగాలను సిద్ధంగా ఉంచుతున్నాం’’ అని కమాండింగ్‌ అధికారి విజయ్‌ ‘ఈనాడు’కు తెలిపారు. ‘‘ఇక్కడ విధులు నిర్వర్తించేవారికి అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించేలా తర్ఫీదు ఇస్తాం. ద్విచక్రవాహనం మొదలు భారీ లారీ వరకూ అన్ని వాహనాలనూ సంక్లిష్టమైన పర్వత మార్గాల్లో ఒడుపుగా నడపడం కూడా నేర్పిస్తాం. యుద్ధం వస్తే ఎవరు..ఎలాంటి విధులైనా నిర్వర్తించేలా తీర్చిదిద్దుతాం’ అని వెల్లడించారు.

అంచెలంచెలుగా అంతెత్తుకు
ఎత్తయిన ప్రాంతాల్లో విధులు నిర్వర్తించడం చాలాకష్టం. ఇందుకోసం సైనికులను ఒక పద్ధతి ప్రకారం సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. దీనికి మూడు దశల్లో ప్రాథమిక శిక్షణ ఇస్తారు. మొదటి దశలో 9 వేల అడుగుల ఎత్తులో ఆరు రోజుల తర్ఫీదు ఉంటుంది. అక్కడ ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక 12 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళతారు. అక్కడా శిక్షణ, ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక 15 వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్తారు. అక్కడ నాలుగు రోజుల శిక్షణతోపాటు, 40 కిలోల బరువు ఎత్తుకొని 20 కిలోమీటర్లు నడవాలి. వీటన్నింటిలోనూ ఉత్తీర్ణులైన వారినే ఇక్కడ మోహరిస్తారు.

అసలు శత్రువు వాతావరణమే
ఇక్కడ పనిచేస్తున్న సైనికులకు అసలు ప్రత్యర్థి వాతావరణమే. శత్రువుపై విజయం సాధించాలంటే ముందు వాతావరణంపై పైచేయి సాధించాలి. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఇలా అన్నింటికీ సమస్యలే. ఇక్కడ విధులు నిర్వర్తించేవారు నిత్యం కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. అత్యంత శీతల ప్రాంతంలో దేహంలో జరిగే జీవక్రియల వల్ల ముక్కు, నోటి నుంటి ఒంట్లోని నీరు వేగంగా ఆవిరి రూపంలో బయటకు వెళుతుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషనకు గురవుతారు. దాహం కాకపోయినా నీళ్లు తాగుతూ ఉండాల్సిందే. ‘‘ఇక్కడ నీరు పుష్కలంగా ఉన్నా.. దాన్ని పొందడమే పెద్ద సమస్య. భూగర్భంలో నీళ్లు ఉంటాయి.  వాటిని తోడాలంటే మోటార్లు పనిచేయవు. పర్వతప్రాంతం కావడంతో  యంత్రాల సామర్థ్యం 40 శాతానికిపైగా తగ్గుతుంది. అందుకే ఇక్కడ నీళ్లు తోడటానికి నానాపాట్లు పడాలి. తోడిన నీటిని సిబ్బంది బసచేసిన బంకర్లకు పైపుల ద్వారా సరఫరా చేయాలి. శీతాకాలంలో ఉష్ణోగ్రత మైనస్‌ 25 డిగ్రీలకు పడిపోతుంది. దాంతో పైపుల్లో నీళ్లు గడ్డకడతాయి. ఇదో పెద్ద సమస్య. దీన్ని అధిగమించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఇన్సులేటెడ్‌ పైపులు వాడుతున్నాం’ అని సైనిక వర్గాలు తెలిపాయి.

ముంచుకొచ్చే అనారోగ్యం
ఇక్కడ పనిచేసే సైనికులు అనేక అనారోగ్య సమస్యలకు లోనవుతుంటారు. సముద్రమట్టం వద్ద వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్‌ ఉంటే 15 వేల అడుగుల ఎత్తులో 15 శాతమే ఉంటుంది. అందువల్ల ఇక్కడ శ్వాస పీల్చడం కష్టమవుతుంది. దేహంలో ఆక్సిజన్‌ పరిమాణం తగ్గుతుంది. అయినప్పటికీ మామూలు పరిస్థితుల్లో మాదిరిగానే కఠోర వ్యాయామాలు చేయాలి. విధులు నిర్వర్తించాలి. శీతాకాలం ఉష్ణోగ్రత మైనస్‌ 25 డిగ్రీలకు పడిపోతుంది. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక్కడ రెండు నెలలు ఉంటే రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం 20కి పెరుగుతుంది. ఇక్కడ ఉన్నంత కాలం ఇలా పెరుగుతూనే ఉంటుంది. దీనివల్ల రక్తం గడ్డకట్టి గుండెపోటు, సెరిబ్రల్‌ వాస్కులర్‌ యాక్సిడెంట్‌ (సీవీఏ), భవిష్యత్తులో వెరికోస్‌ వెయిన్స్‌ వంటివి వస్తాయి. అలానే చలి కారణంగా ఎక్యూట్‌ మైల్డ్‌ సిండ్రోమ్‌(ఏఎంఎస్‌), ఊపిరితిత్తుల్లో, మెదడులో నీరు చేరడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుత్తాయి. చలివల్ల చిల్‌బ్లేన్‌ (కాళ్లు, చేతుల వేళ్లు, పెదాలు, చెవుల చివర్లు మొద్దుబారి స్పర్శ కోల్పోవడం) వంటి సమస్యలు వెంటాడుతాయి.

అడుగడుగునా ప్రతికూలతలే
ఇన్ని ప్రతికూల పరిస్థితులు తట్టుకొని విధులు నిర్వర్తించడం దినదినగండమే. గస్తీ నిర్వహించే వారు ఆయుధాలు ధరిస్తారు. కానీ వాటిని వాడాలంటే అధికారులు అనుమతి కావాలి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకంగా రోడ్లు ఉండవు. కొండలు గుట్టల మీదుగా నడుచుకుంటూ గస్తీ నిర్వహించాలి. ఒక్కోసారి రోజుకు 40 కిలోమీటర్లు కూడా నడవాల్సి ఉంటుందని శ్రీనివాసులు అనే తెలుగు సైనికుడు తెలిపారు. చలికాలం ఆరడుగుల మేర మంచు పేరుకుపోతుందని, అందులో నడుస్తూ గస్తీ నిర్వహించడం నరకప్రాయంగా ఉంటుందని వివరించారు.


దుస్తుల్లో చుక్కనీరున్నా ప్రమాదమే

దుస్తులు వేసుకునేటప్పుడు ఒంటిమీద ఎక్కడా చిన్న నీటి బిందువు కూడా లేకుండా చూసుకోవాలి. విధులు ముగించి బంకర్‌ చేరుకున్న తర్వాత దుస్తులు విప్పేటప్పుడు కూడా మరోమారు ఇలానే పరీక్షించుకోవాలి. ఒంటిమీద నీటి చుక్క ఉన్నా అది మంచులా మారి చర్మానికి హాని కలిగిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని