Indian Army: మంచు పర్వతాల్లో రణన్నాదం

దట్టమైన మంచుతో అత్యంత చలి వాతావరణ పరిస్థితులుండే హిమాలయ పర్వతాలకు అత్యాధునిక ఆయుధాలు తరలివస్తున్నాయి. లేదు లేదంటూనే ఆయుధ వ్యవస్థలను మోహరిస్తున్న చైనాకు తగిన రీతిలో జవాబిచ్చేలా అవసరమైతే అగ్ని వర్షం కురిపించేందుకు భారత సైన్యం సిద్ధమయ్యింది.

Updated : 21 Oct 2021 10:06 IST

 దీర్ఘశ్రేణి రాకెట్‌ లాంఛర్లను తరలించిన చైనా
 ఇప్పటికే పీసీఎల్‌-191 హోవిట్జర్లతో మాటేసిన డ్రాగన్‌
 దీటుగా స్పందిస్తున్న భారత్‌
వాస్తవాధీన రేఖ వెంట ఎల్‌70 విమాన విధ్వంసక శతఘ్నులు
ఎం-777 హోవిట్జర్లు, బోఫోర్స్‌ గన్లకు అదనంగా చేరవేత
(వలసాల వీరభద్రం) తవాంగ్‌ నుంచి ఈనాడు ప్రతినిధి

దట్టమైన మంచుతో అత్యంత చలి వాతావరణ పరిస్థితులుండే హిమాలయ పర్వతాలకు అత్యాధునిక ఆయుధాలు తరలివస్తున్నాయి. లేదు లేదంటూనే ఆయుధ వ్యవస్థలను మోహరిస్తున్న చైనాకు తగిన రీతిలో జవాబిచ్చేలా అవసరమైతే అగ్ని వర్షం కురిపించేందుకు భారత సైన్యం సిద్ధమయ్యింది. సరిహద్దులు దాటి వచ్చే శత్రు లోహవిహంగాలను తుత్తునియలు చేసే ఎల్‌-70 విమాన విధ్వంసక శతఘ్నులు మొదలు వాయు మార్గంలో కూడా జార విడువగలిగే హోవిట్జర్‌ శతఘ్నులు వంటి వాటిని వాస్తవాధీన రేఖ వెంట పెద్ద సంఖ్యలో మోహరించింది. 15 వేల అడుగుల ఎత్తులో ఏకంగా ఆర్టిలరీ యూనిట్‌నే నెలకొల్పింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటైన ఆర్టిలరీ యూనిట్‌ ఇదే కావడం గమనార్హం. వీటన్నింటితో కలిపి వాస్తవాధీన రేఖ వెంట సమీకృత రక్షణ ప్రాంతాలను (ఇంటెగ్రేటెడ్‌ డిఫెండెడ్‌ లొకాలిటీ)లను సిద్ధం చేసింది. తూర్పు సెక్టార్‌లో వ్యూహాత్మక ప్రాంతమైన తవాంగ్‌ నుంచి వాస్తవాధీన రేఖకు వెళ్లే మార్గంలో పెద్ద సంఖ్యలో ఇలాంటి ప్రాంతాలు అనేకం కనిపిస్తాయి.

విమాన విధ్వంసక శతఘ్నులు..
ఆధునికీకరించిన ఎల్‌-70 విమాన విధ్వంసక శతఘ్నులను వాస్తవాధీన రేఖ వెంట వ్యూహాత్మక ప్రాంతాల్లో భారత సైన్యం మోహరించింది. ‘అన్నిరకాల మానవ రహిత యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు, విమానాలను ఇవి కూల్చేయగలవు. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఆటోమేటిగ్గా లక్ష్యాన్ని నిర్దేశించుకొని గురిపెట్టి కూల్చగల సాంకేతికత వీటి సొంతం. థర్మల్‌ ఇమేజింగ్‌ కెమేరా, లేజర్‌ రేంజ్‌ ఫైండర్‌ వంటివి దీనిలో ఉన్నాయి. రాడార్‌తోనూ అనుసంధానమై ఉంటాయి’ అని సైనికాధికారులు వెల్లడించారు. ‘నిమిషానికి 300 రౌండ్లు పేల్చగలవు. దీనికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మూడు కెమెరాలు మూడు రకాల విధులు నిర్వహిస్తాయి. 360 డిగ్రీలు చుట్టూ తిరగగలిగే ఈ ఆయుధం ప్రత్యర్థి విమానాలు, డ్రోన్లపై అగ్ని వర్షం కురిపిస్తోంది. తూర్పు సెక్టార్‌లో వీటిని మోహరించడం ఇదే ప్రథమమ’ని కమాండర్‌ జాన్సన్‌ తెలిపారు.
*ఎం-777 అల్ట్రా లైట్‌ హోవిట్జర్‌ శతఘ్నులను కూడా ఈ సెక్టారులో ఏర్పాటు చేశారు. కేవలం 4 టన్నుల బరువుండే వీటిని కావాల్సిన ప్రాంతాలకు చినూక్‌ హెలికాప్టర్లలోనూ తరలించవచ్చు. లారీకి వెనుక తగిలించి కూడా రవాణా చేయవచ్చు. నిర్దేశిత స్థానానికి చేర్చిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే వినియోగానికి సిద్ధం చేయవచ్చు. 30 సెకన్లలోనే 40 కిలోమీటర్ల దూరం వరకూ విధ్వంసం సృష్టిస్తుంది. వీటికి అదనంగా బోఫోర్స్‌ గన్స్‌ను మోహరించారు.
*తూర్పు సెక్టార్‌లోని అస్సాంహిల్స్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్టిలరీ యూనిట్‌ అత్యంత కీలకమైనది. ఇక్కడి నుంచి చైనా భూభాగం లోపల 50 కిలోమీటర్ల వరకూ అగ్ని వర్షం కురిపించవచ్చు.
* రఫేల్‌ యుద్ద విమానాలు, అపాచి, రుద్ర హెలికాప్టర్లనూ సమీకృత రక్షణ ప్రాంతాల్లో మోహరించారు. తూర్పు కమాండ్‌ పరిధిలోని 1300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దులను శత్రు దుర్భేద్యం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని ఓ అధికారి వెల్లడించారు.

అత్యాధునిక బంకర్లు
సరిహద్దుల్లోని బంకర్ల స్వరూపాన్ని కూడా భారత సైన్యం మార్చివేసింది. ఒకప్పుడు బంకర్లలో సైనికులు మాత్రమే ఉండేవారు. వీరికి అవసరమైన సరకులను ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేసేవారు. ఇప్పుడు అలా కాకుండా ఆయుధాలు, ఆహారం, సమాచార వ్యవస్థ వంటి వాటన్నింటినీ కలుపుతూ ప్రత్యేక పద్ధతిలో బంకర్లను నిర్మించారు. ఇందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక కమాండ్‌  కేంద్రంలో కూర్చొనే క్షేత్రస్థాయిలో పోరాడుతున్న సైనికులకు సూచనలు ఇవ్వవచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసిన పెద్ద తెరపై తన పరిధిలోని యుద్ధ క్షేత్రం మొత్తం కమాండ్‌ కేంద్రంలోని అధికారికి కనిపిస్తుంది. ఉపగ్రహం నుంచి నేరుగా సమాచారం అందుతుంది.  


100 రాకెట్‌ లాంఛర్లను మోహరించిన చైనా

కఠినమైన శీతాకాలం సమీపిస్తున్నా గత ఏడాది ఎదురైన చేదు అనుభవాలను పక్కన పెట్టి డ్రాగన్‌ మళ్లీ పాత పంథానే అనుసరిస్తోంది. భారత్‌ను భయపెట్టాలనే ప్రయత్నాల్లో భాగంగా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద తాజాగా 100 అత్యాధునిక రాకెట్‌ లాంఛర్లను చేర్చింది. అయితే, తమ జవాన్లు అతిశీతల వాతావరణానికి అలవాటు పడేలా చేయడానికేనంటూ ఆయుధ మోహరింపులను ఆ దేశ సైనిక నిపుణులు సమర్థించుకుంటున్నారు. సరిహద్దు వివాదంపై ఇటీవల జరిగిన 13వ విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు విఫలం కావడంతో గత ఏడాది పరిస్థితులను పునరావృతం చేసేందుకు డ్రాగన్‌ ప్రయత్నిస్తోంది. వాస్తవాధీన రేఖ వెంట 100కు పైగా అత్యాధునిక దీర్ఘశ్రేణి రాకెట్‌ లాంఛర్లను తరలించినట్లు చైనా సైనిక వర్గాలను ఉటంకిస్తూ హాంకాంగ్‌ నుంచి వెలువడే ‘సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్టు’ వెల్లడించింది. భారత్‌ వాడే ఎం-777 హోవిట్జర్ల కంటే ఇవి రెట్టింపు దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) చెబుతోంది. పీసీఎల్‌-181 కంటే శక్తిమంతమైన పీసీఎల్‌-191 హోవిట్జర్లను ఏప్రిల్‌ నెలలోనే ఎల్‌ఏసీ వద్దకు చేరవేసినట్లు చైనా ప్రభుత్వానికి చెందిన సీసీటీవీ గతంలోనే ధ్రువీకరించింది. వేర్వేరు దూరాల్లోని లక్ష్యాలను ఛేదించడం కోసం పీఎల్‌ఏ  వివిధ రకాల హోవిట్జర్లను మోహరిస్తున్నట్లు మకావ్‌కు చెందిన సైనిక నిపుణుడు ఆంటోనీ వాంగ్‌ టాంగ్‌ పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని