Punjab election results 2022: ‘దిల్లీ మోడల్‌’తో పంజాబ్‌లో పాగా

పంజాబ్‌ రాజకీయాల్లో కొత్త పొద్దు పొడిచింది. దేశ రాజధానిలో వరుస విజయాలను నమోదుచేసిన కేజ్రీవాల్‌ పార్టీ... మరోసారి ‘చీపురు’ సత్తాను చాటిచెప్పింది. దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ...

Updated : 11 Mar 2022 06:12 IST

నమ్మకమైన హామీలు, పదునైన వ్యూహాలతో బరిలోకి దిగిన ఆప్‌

ఈనాడు, దిల్లీ: పంజాబ్‌ రాజకీయాల్లో కొత్త పొద్దు పొడిచింది. దేశ రాజధానిలో వరుస విజయాలను నమోదుచేసిన కేజ్రీవాల్‌ పార్టీ... మరోసారి ‘చీపురు’ సత్తాను చాటిచెప్పింది. దిల్లీలో కాంగ్రెస్‌ను ఓడించి అధికారంలోకి వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీ... పంజాబ్‌లోనూ అదే పరంపరను కొనసాగిస్తూ ప్రభంజనం సృష్టించింది. దీంతో దేశ రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త చర్చకు తెరలేచింది. ఇంతటి ఘనవిజయం ఎలా సాధ్యమైంది? కేజ్రీవాల్‌ వ్యూహాలే పనిచేశాయా? ‘దిల్లీ మోడల్‌’ నినాదమే గెలిపించిందా? అన్నది అత్యంత ఆసక్తిగా మారింది.

‘దిల్లీ మోడల్‌’ను చూపి పంజాబ్‌లో కేజ్రీవాల్‌ జయకేతనం ఎగురవేశారు. హస్తినలో విద్య, వైద్యానికి తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని విస్తృతంగా ప్రచారంచేసి పంజాబీల్లో భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించారు. పంజాబ్‌ గెలుపుతో ఆప్‌ ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టబోతోంది. ఈనెల 31న ఆ రాష్ట్రంలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో 5 స్థానాలను చేజిక్కించుకొనే అవకాశం ఆ పార్టీకి చిక్కింది.

ఆ తప్పు మళ్లీ చేయకుండా

2017 ఎన్నికల్లోనే పంజాబ్‌లో ఆప్‌ గెలుపు ఖాయమన్న ప్రచారం జరిగింది. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ తనకు చివరి ఎన్నికలంటూ ఓట్లు అభ్యర్థించడంతో... ప్రజలు అటువైపు తిరిగారు. అప్పట్లో ఆప్‌ సీఎం అభ్యర్థిని ప్రకటించకుండా కేజ్రీవాల్‌ను ముందుపెట్టి ప్రచారం చేసింది. ఆ పార్టీ గెలిస్తే... దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్‌ రాజీనామాచేసి వస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో ఆ వ్యూహం ఫలించలేదు. ఇప్పుడు ఆ తప్పు సరిద్దుకొంది. సిక్కు మతానికి చెందిన భగవంత్‌ మాన్‌ను ఆప్‌ సీఎం అభ్యర్థిగా ప్రకటించి సర్దార్జీల్లో నమ్మకం కలిగించింది. తమను గెలిపిస్తే స్వరాష్ట్రంలోని పేద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తే ముఖ్యమంత్రి అవుతారని కేజ్రీవాల్‌ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్‌ అంతర్గత కుమ్ములాటలు కూడా ఆ పార్టీకి కలిసొచ్చాయి. పటియాలా మహారాజ్‌గా పేరొందిన కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌.. అధికారంలో ఉన్నంతకాలం తన రాజమహల్‌కే పరిమితం కావడం అక్కడి ప్రజల్లో కాంగ్రెస్‌ పట్ల అసంతృప్తిని పెంచింది. అది గ్రహించి పార్టీ అధిష్ఠానం ఆయన్ను పదవీచ్యుతున్ని చేసేలోపు పుణ్యకాలం కాస్త పూర్తయింది. ఆయన స్థానంలో బలమైన జాట్‌ సిక్కు సామాజికవర్గం నేతను కాకుండా, అత్యధిక జనాభా ఉన్న దళితుల నేత చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీని కూర్చోబెట్టడం, ఆ ప్రయత్నాన్ని పీసీసీ అధ్యక్షుడు సిద్ధూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం... కాంగ్రెస్‌ను నవ్వులపాలు చేసింది. ఇవన్నీ ఆప్‌నకు వరాలయ్యాయి. ఇక 2007-17 మధ్య అధికారం చేపట్టిన పురాతన ప్రాంతీయ పార్టీ అకాలీదళ్‌కు ఆ పాలనే శాపంగా మారింది. వయోవృద్ధుడైన ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ సీఎంగా ఉన్నప్పటికీ అప్పట్లో ఉపముఖ్యమంత్రిగా ఉన్న కుమారుడు సుఖ్‌బీర్‌సింగ్‌ బాదలే చక్రం తిప్పారు. ఆ హయాంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోవడం, డ్రగ్స్‌ వ్యాపారం వెర్రితలలు వేయడం పంజాబీలను భయాందోళనలకు గురిచేశాయి. అక్కడి యువత డ్రగ్స్‌కు బానిసలు కావడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారి రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చింది. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందేంతలా సాగిన ఆ పాలనను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు. కాంగ్రెస్‌, అకాలీదళ్‌ రాజకీయాలతో విసిగిపోయిన ఓటర్లు... కులం, మతం, ప్రాంతం అన్న తేడాలేకుండా ఈసారి ఆప్‌నే ఎన్నుకున్నారు. దేశంలోనే అత్యధిక దళిత సామాజికవర్గం ఉన్న ఈ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రిగా ఉన్నా, వారు కూడా ఆప్‌నే ఆదరించినట్టు విశ్లేషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని