Updated : 02 May 2022 06:23 IST

Azadi Ka Amrit Mahotsav: ఇంగ్లిష్‌ కాదు...రాబడే ముఖ్యం

వర్తకం పేరిట వచ్చిన ఆంగ్లేయులు... కుట్రలు, కుతంత్రాలతో దేశాన్ని ఆక్రమించారు. మొదట్లో ఇండియాను ఆధునికతకు దూరంగా ఉంచాలని పట్టుదల ప్రదర్శించారు. ‘భారతీయులు చీకట్లోనే ఉండాలి. వారికి ఇంగ్లిషు నేర్పిస్తే మన చట్టాలను చదువుతారు. హక్కుల కోసం ప్రశ్నిస్తారు. మన శాస్త్రసాంకేతికతలనూ అనుసరిస్తారు. అందుకే వారి భాషలనే మనం నేర్చుకుందాం. వారి చట్టాలను తెలుసుకుందాం. వాటికి అనుగుణంగానే పాలిద్దాం. సాధ్యమైనంత ఎక్కువగా దోచుకుందాం’... అంటూ బ్రిటిష్‌ పార్లమెంటును ఒప్పించారు. చివరికి తమ అవసరాల కోసం పంథా మార్చుకున్నారు.

ఈస్టిండియా కంపెనీ సైనికాధికారులు భారత్‌లోని చిన్నాపెద్దా రాజ్యాలను ఒక్కొక్కటిగా చేజిక్కించుకున్నారు. సాధారణ పరిపాలన కోసం 1772లో తమ ఆధీనంలోని ప్రాంతాలను జిల్లాలుగా విభజించారు. న్యాయ పాలన కోసం ప్రతి జిల్లాలో సివిల్‌, క్రిమినల్‌ కోర్టులను ప్రారంభించారు. కోల్‌కతాలో 1773లో సుప్రీంకోర్టును స్థాపించారు. తీర్పులు చెప్పడంలో ఆంగ్లేయ జడ్జిలకు హిందూ పండితులు, ముస్లిం మౌల్వీలు సాయం చేసేవారు. అదేసమయంలో ఆదాయంపైనే దృష్టి పెట్టి... చదువుల గురించి ఏమీ పట్టించుకోలేదు. ఆంగ్లం నేర్పాలనే ఆలోచననే దరి చేరనీయలేదు. అప్పటికి ఉన్న విధానాన్నే కొనసాగించారు. ఏదోవిధంగా కొన్ని ఆంగ్లపదాలు నేర్చుకున్న వారిని గుమాస్తాలుగా చేర్చుకున్నారు. ఆంగ్లేయులకు దగ్గరగా మెలిగిన ఇలాంటి వారు మరింత బాగా ఇంగ్లిషు నేర్చుకోగా... వీరికి కాస్త పెద్ద ఉద్యోగాలు ఇచ్చారు. కానీ... వారికి సంస్కృతం వచ్చేది కాదు. సంస్కృత పండితులకు ఆంగ్లం అర్థమయ్యేది కాదు. అందుకే... విశాల భారత ఉపఖండాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోవడానికి సంస్కృతాన్ని నేర్చుకోవాల్సిన, ఇక్కడి చట్టాలు, సంప్రదాయాలను క్షుణ్నంగా తెలుసుకోవాల్సిన అవసరాన్ని గవర్నర్‌ జనరల్‌ వారన్‌ హేస్టింగ్స్‌ గుర్తించారు. ఒక ఆయుర్వేద వైద్యుడి సాయంతో సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించారు. న్యాయపాలనకు ఆధారమైన హిందూ, ఇస్లాం మత గ్రంథాలను అధ్యయనం చేశారు.

వివాదార్ణవ సేతువు

హేస్టింగ్స్‌ కోరిక మేరకు 1775లో భారత్‌కు చెందిన 11 మంది పండితులు హిందూ ధర్మసూత్రాల నుంచి న్యాయ చట్టాలను క్రోడీకరించారు. మొత్తం 21 భాగాలతో కూడిన ‘వివాదార్ణవ సేతువు’ అనే బృహత్‌ గ్రంథాన్ని రచించారు. వారి నుంచి ఈ గ్రంథం ప్రతులన్నీ స్వాధీనం చేసుకున్న హేస్టింగ్స్‌... దీన్ని సంస్కృతం నుంచి పర్షియన్‌లోకి అనువదింపజేశారు. అనంతరం పర్షియన్‌ నుంచి ఇంగ్లిషులోకి బ్రిటన్‌కు చెందిన ఎన్‌.బి. హల్‌హెడ్‌ అనే ఆంగ్ల పండితుడితో తర్జుమా చేయించారు. లండన్‌లో దీన్ని 1776లో ‘ఎ కోడ్‌ ఆఫ్‌ జెంటూ లాస్‌ (పండితులు గుదిగుచ్చిన చట్టాలు)’ పేరిట రహస్యంగా ముద్రించారు. వాటి ప్రతులను భారత్‌లోని ఐరోపా న్యాయమూర్తులకు మాత్రమే పంపిణీ చేశారు. ఈ పుస్తకం ముఖ్యంగా భారతీయులు, ఇతర దేశస్థులకు అందకుండా కట్టుదిట్టం చేశారు. వారెన్ని జాగ్రత్తలు తీసుకున్నా... 1777లో దాని నకలు ప్రతి బయటికి వచ్చింది. అదే ఏడాది ‘కోడ్‌ ఆఫ్‌ ముస్లిం లా’ సైతం సిద్ధం చేశారు.

మూల స్ఫూర్తికి విరుద్ధంగా తీర్పులు

జెంటూ లాస్‌ గ్రంథాన్ని ఆధారం చేసుకుని తీర్పులు ఇచ్చే, శిక్షలు విధించే క్రమంలో ఐరోపా న్యాయమూర్తులకు సహాయకులుగా పండితులు, మౌల్వీలు ఉండే విధానాన్ని కొనసాగించారు. వాస్తవంలోకి వచ్చేసరికి ధర్మసూత్రాల స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహారాలు కొనసాగాయి. ముఖ్యంగా సంస్కృతంలోని వివాదార్ణవ సేతువులో ఉన్నదానికి భిన్నంగా ఆంగ్లంలో తర్జుమా ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. శిక్షలు విధించడంలోనూ పండితుల ప్రభావం కారణంగా జడ్జిలు కులాలను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించారు. భారత సమాజంలో అలజడికి కారణమయ్యారు. అయితే మొదటి స్వాతంత్య్ర పోరాటం తర్వాత భారత పాలనా పగ్గాలను తన చేతుల్లోకి తీసుకున్న బ్రిటిష్‌ ప్రభుత్వం... హంటర్‌ కమిషన్‌, మెకాలే సూచనల మేరకు ఇండియాలో ఆంగ్ల విద్యను ప్రవేశపెట్టింది.


నిజాంకు రహస్యంగా ముద్రణ యంత్రం అందజేత

భారతీయులకు మొదట్లో ఆంగ్ల భాషను దూరంగా పెట్టినట్లుగానే ముద్రణ యంత్రాలను సైతం దాచిపెట్టారు. నిజాం నవాబు కోరిక మేరకు... అప్పట్లో సికింద్రాబాద్‌లోని బ్రిటిష్‌ రెసిడెంట్‌ ఒక చిన్న ముద్రణ యంత్రాన్ని ఇంగ్లండు నుంచి రహస్యంగా తీసుకొచ్చి అందజేశారు. విషయం తెలుసుకున్న కోల్‌కతాలోని గవర్నర్‌ జనరల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాను దాన్ని ధ్వంసం చేయిస్తానంటూ రెసిడెంట్‌ రాతపూర్వకంగా విన్నవించుకోవాల్సి వచ్చింది.


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని