Updated : 03 May 2022 06:07 IST

Azadi Ka Amrit Mahotsav: కప్పం పేరిట కంపెనీ నాటకం

సముద్రయానానికి అనువైన తీరప్రాంతాలు... దట్టమైన అడవులు... చిన్నచిన్న జమీన్లు... కష్టించి పనిచేసే రైతులకు ఆలవాలమైన ఉత్తర సర్కారు జిల్లాల్లో దండిగా దండుకోవచ్చని బ్రిటిషర్లు ఆశించారు. తీరా రంగంలోకి దిగాక గజపతుల బలం భయపెట్టింది. జమీందార్ల పౌరుషం తెలిసొచ్చింది. వెంటనే ‘విడదీసి పడగొట్టే’ తమ పన్నాగాన్ని పన్నారు. ఒకరిపై ఒకరిని ఉసిగొల్పారు. ఆఖరికి కప్పం పేరిట కుట్ర పన్ని కుంభస్థలాన్నీ కొల్లగొట్టారు.

భారత్‌లో ఫ్రెంచి స్థావరాలపై కన్నేసిన ఈస్టిండియా కంపెనీ... అప్పటి ఉత్తర సర్కారు జిల్లాలపై దృష్టి సారించింది. అదే సమయంలో 1757లో బొబ్బిలి యుద్ధం ముగిసిన తర్వాత ఫ్రెంచి సైన్యం విడిదిలోనే... విజయనగరం రాజు పెదవిజయరామ గజపతి హత్యకు గురయ్యారు. ఆయన తర్వాత సింహాసనం అధిష్ఠించిన ఆనంద గజపతి ఫ్రెంచివారితో తెగదెంపులు చేసుకున్నారు. పైగా విశాఖపట్నాన్ని స్వాధీనం చేసుకోవడానికి బ్రిటిష్‌ సైన్యాన్ని పంపాలంటూ కోల్‌కతాలోని రాబర్ట్‌ క్లైవ్‌కు ఉత్తరం రాశారు. క్లైవ్‌ సమ్మతి మేరకు ఆంగ్లేయులు-గజపతి మధ్య 1758 నవంబరు 15న ఒప్పందం కుదిరింది. అనంతరం కర్నల్‌ ఫోర్డే నాయకత్వంలో క్లైవ్‌ బ్రిటిష్‌ సైన్యాన్ని పంపించగా... 1758 అక్టోబరులో విశాఖపట్నం, డిసెంబరులో మచిలీపట్నంలోని ఫ్రెంచి స్థావరాలను స్వాధీనం చేసుకున్నారు. 1760 ఫిబ్రవరి 25న ఆనంద గజపతిరాజు అనారోగ్యంతో రాజమహేంద్ర వరంలో మృతి చెందగా బ్రిటిషర్లు ఒప్పందాలన్నీ తుంగలోతొక్కి కప్పం వసూలు చేయడం ప్రారంభించారు.

పట్టు కొనసాగించిన విజయనగరం

ఉత్తర సర్కారు జిల్లాలను బ్రిటిషర్లు తమ అజమాయిషీలోకి తెచ్చుకున్నా... 25 ఏళ్ల వరకు వారి పరిపాలన స్థిరపడలేదు. సుశిక్షిత సైన్యంతో తులతూగుతున్న విజయనగరం రాజుల కిందే అత్యధిక ప్రాంతం కొనసాగింది. మరోవైపు 35 వేల సొంత సైన్యం,  కోటలు, దుర్గాలతో బలంగా ఉన్న 20 మంది జమీందారులు సైతం స్వతంత్రంగా పరిపాలన సాగించేవారు. వీరికి ఆంగ్లేయులు, నిజాం సైన్యాలతో యుద్ధాలు చేయడం, ఓడిపోవడం, బలపడ్డాక మళ్లీ ఎదిరించడం... సర్వసాధారణ విషయంగా మారింది. అందుకే ఈ ప్రాంతంలో తమ పాలనను కట్టుదిట్టం చేసేందుకు 1783లో ఈస్టిండియా కంపెనీ ఒక కమిటీని వేసింది. సర్కారు జిల్లాల్లో తెలుగు రాజులు బలంగా ఉన్నారని, వీరిని ఒకేసారి కాకుండా ఒక్కొక్కరిగా అణచి వేయాలని, ముఖ్యంగా విజయనగరం రాజులను లొంగదీయాలని ఆ కమిటీ సూచించింది. ఈమేరకు పోలవరం, పర్లాకిమిడి వంటి జమీన్లను హస్తగతం చేసుకున్నారు. అప్పట్లో విజయనగరం సంస్థానాన్ని చినవిజయరామ (రెండో విజయరామ) గజపతి పాలిస్తున్నారు. మహారాజు వయసులో చిన్న కావడంతో ఆయన మారుతల్లి కుమారుడు, అన్న సీతారామరాజు దివాను(ప్రధాని)గా ఉన్నారు. సీతారామరాజును ప్రలోభాలతో తమవైపు తిప్పుకొన్న బ్రిటిషర్లు... సామంతరాజులను ఖైదు చేయడం ప్రారంభించారు. ఇది గ్రహించిన చినవిజయరామ... ఆయన్ని పదవి నుంచి తొలగించారు. తర్వాత సీతారామరాజు బ్రిటిషర్లతో చేతులు కలిపాడు.

పద్మనాభం యుద్ధంలో వీర మరణం

అదను కోసం వేచిచూస్తున్న బ్రిటిషర్లు... విజయనగరం సంస్థానం తమకు ఆరున్నర లక్షల రూపాయల కప్పం బకాయిలను వెంటనే చెల్లించాలని, సైన్యాన్ని తగ్గించుకోవాలని తాఖీదులు పంపారు. కప్పం చెల్లించని పక్షంలో నెలకు రూ.1200 భరణం అంగీకరించి, విశాఖపట్నం వెళ్లిపోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మహారాజు సమాధానం ఇవ్వకపోవడంతో 1793 ఆగస్టులో అకస్మాత్తుగా దాడిచేసి, విజయనగరం కోటను స్వాధీనం చేసుకున్నారు. చినవిజయరామ గజపతి కోటను విడిచినా... ప్రజల్లో ఆయన పలుకుబడి పెరిగిందేగానీ తగ్గలేదు. ఆయనతో ఎప్పటికైనా ముప్పు ఉంటుందని అనుమానించిన బ్రిటిషర్లు... చినవిజయరామను సంస్థానాన్ని వదిలి వెళ్లాలని మరోసారి హెచ్చరించారు. ఇక ఉపేక్షించడం తగదనే నిర్ణయానికి వచ్చిన గజపతి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తన సామంతులతో కలిసి 1794 జులై 10న విశాఖపట్నం జిల్లా పద్మనాభం కొండ వద్ద బ్రిటిషర్లతో యుద్ధానికి దిగారు. మూడు రోజులపాటు హోరాహోరీగా సాగిన పోరాటంలో చివరిరోజు చినవిజయరామ గజపతి వీరమరణం పొందారు.  
తర్వాత ఆయన కుమారుడు నారాయణబాబుకు కొండదొరలు ఆశ్రయం ఇచ్చారు. చివరికి రూ.50 లక్షల కప్పం సమర్పించుకుని, సామంతుడిగా ఉంటానని అంగీకరించిన నారాయణబాబుకు బ్రిటిషర్లు సంస్థానాన్ని తిరిగి అప్పగించారు. అప్పటి నుంచి స్వతంత్రం వచ్చాక భారత యూనియన్‌లో చేరే వరకు విజయనగరం సంస్థానంగా కొనసాగింది.


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని