Updated : 05 May 2022 06:27 IST

Azadi Ka Amrit Mahotsav: ఆ సేన కోసం అంతా ఒక్కటై..

ఉప్పు-నిప్పును తలపించిన కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌లు ఏకమయ్యాయి. కమ్యూనిస్టులు... హిందూ మహాసభ కలసి వచ్చాయి. కేంబ్రిడ్జ్‌ మజ్లిస్‌ నుంచి అమరావతి టాంగావాలాల వరకూ అంతా విరాళాలిచ్చారు. సేలం నుంచి రావల్పిండి దాకా విద్యార్థులంతా రోడ్లమీదికొచ్చారు. బ్రిటిష్‌ భారత సైనికులూ అండగా ముందుకొచ్చారు. పాతికేళ్ల కిందట విడిచిపెట్టిన నల్లకోటు వేసుకొని నెహ్రూ కోర్టుకొచ్చారు. భారతీయులందరినీ ఐక్యంగా నిలబడేలా చేసిన అరుదైన ఘట్టం.. ఐఎన్‌ఏ (ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌) విచారణ!

ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌... జపాన్‌ సేనలతో కలసి ఆంగ్లేయులపై పోరాటం చేసిన కాలంలో రాని పేరు ఆ తర్వాత వచ్చింది. అది ఐఎన్‌ఏ ఖైదీల విచారణ సందర్భంగా! రెండో ప్రపంచయుద్ధానంతరం సుమారు 23 వేల మంది ఫౌజ్‌ సైనికులను బ్రిటన్‌ బందీలుగా పట్టుకుంది. వారిపై... దేశద్రోహం, హత్యా నేరాలు మోపింది. 1945 నవంబరు నుంచి 1946 మే వరకు సాగిన విచారణలు యావద్దేశ ప్రజల దృష్టినీ ఆకర్షించాయి. వీటిలో కర్నల్‌ ప్రేమ్‌ సెహగల్‌, కర్నల్‌ గుర్‌బక్ష్‌సింగ్‌ థిల్లాన్‌, మేజర్‌ జనరల్‌ షానవాజ్‌ ఖాన్‌లపై తొలి జాయింట్‌ కోర్టు మార్షల్‌ ఎర్రకోటలో జరిగింది. ముగ్గురూ బ్రిటిష్‌ భారత సైన్యంలో పనిచేసి తర్వాత ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో చేరి... మలయా, సింగపూర్‌, బర్మాల్లో ఆంగ్లేయులపై పోరాడారు.
ప్రపంచ యుద్ధ సమయంలో ఐఎన్‌ఏ పోరాట వార్తలపై ఆంక్షలుండేవి. ఈ విచారణ సందర్భంగా సుభాష్‌చంద్రబోస్‌ సేన వీరోచిత గాథలు బయటకు వచ్చి... పత్రికల ద్వారా ప్రజలకు తెలిశాయి. దీంతో ‘ఐఎన్‌ఏ విచారణ’పై దేశం నలుమూలలా ఆసక్తి పెరిగింది. ఎక్కడ చూసినా అదే చర్చ. ఎవరు కలిసినా ఐఎన్‌ఏ గురించిన మాటే! ఐఎన్‌ఏ సిపాయిలకు మద్దతుగా ఊరేగింపులు, ధర్నాలు, సమ్మెలతో దేశమంతా అట్టుడుకిపోయింది. అప్పటికి మతకలహాలతో, దేశవిభజన డిమాండ్లతో శత్రువుల్లా కొనసాగుతున్న కాంగ్రెస్‌-ముస్లింలీగ్‌లు దేశవ్యాప్తంగా కలసి నడిచాయి. ఐఎన్‌ఏ సైనికులకు మరణశిక్ష విధిస్తే... ప్రతీకారంగా ప్రతి సైనికుడికి 25 మంది యూరోపియన్ల చొప్పున చంపుతామంటూ పోస్టర్లు వెలిశాయి. ఐఎన్‌ఏ సైనికుల కోసం నిధులు ఏర్పాటయ్యాయి. విరాళాలు మొదలయ్యాయి. చివరకు... బ్రిటన్‌కు సేవ చేస్తున్న భారత సైనికులు కూడా భయపడకుండా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించే దశకు చేరింది. అదే సమయంలో... నౌకా, వైమానిక దళాల్లో తిరుగుబాటు మొదలైంది. మద్రాసు, పుణేెల్లోని సైన్యంలో భారతీయ సిపాయిలు ఆంగ్లేయ అధికారుల ఆదేశాలు పాటించటం మానేశారు. ఐఎన్‌ఏ సైనికుల తరఫున వాదించేందుకు కాంగ్రెస్‌ ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. భులాభాయ్‌ దేశాయ్‌, తేజ్‌బహదూర్‌ సప్రూ, కైలాశ్‌నాథ్‌ కట్జు, లెఫ్టినెంట్‌ కర్నల్‌ హరిలాల్‌ వర్మ, శరత్‌చంద్రబోస్‌, అసఫ్‌అలీలతో పాటు జవహర్‌లాల్‌ నెహ్రూ స్వయంగా నల్లకోటు వేసుకొని రంగంలోకి దిగారు.

శిక్ష వేశారు.. అమలు ఆపారు
పంజాబ్‌ గవర్నర్‌ సర్‌ బెర్ట్రండ్‌ గ్లాన్సీ... విషయం పసిగట్టి ఆంగ్లేయుల గుండెల్లో తొలి బాంబు పేల్చాడు. ‘‘మీరు దేశద్రోహులనుకుంటున్నవారికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చిన్నచిన్న సైనికులను చూసి స్ఫూర్తిపొందుతున్నారు. ఇకమీదట మన సైన్యంలోని భారతీయులు మనకు విశ్వాసపాత్రులుగా ఉంటారని నమ్మలేం. ఒకవేళ వారికి మరణశిక్ష విధిస్తే పరిస్థితిని అదుపు చేయటం కష్టం. ఈ ఐఎన్‌ఏ విచారణలను తక్షణమే రద్దు చేయాలి’’ అని హెచ్చరించాడు. వాయువ్య సరిహద్దు రాష్ట్ర గవర్నర్‌ సర్‌ జార్జ్‌ కనింగ్‌హామ్‌ నుంచీ అదే హెచ్చరిక వచ్చింది. అయినా ముఖ్య సైనికాధికారి అచిన్‌లెక్‌ విచారణ కొనసాగించాలనే నిర్ణయించాడు. అనుకోని పరిస్థితి తలెత్తితే అణచివేయటానికి బ్రిటన్‌ నుంచి ఆంగ్లేయ సైనికులను పంపాలని కోరాడు. కానీ లండన్‌ ప్రభుత్వం అందుకు నిరాకరించింది. యుద్ధానంతరం అంతదూరం వచ్చి మరో పోరాటం చేయటానికి సైనికులు సిద్ధంగా లేరని తేల్చిచెప్పింది. తొలి విచారణ అనంతరం ముగ్గురిని ద్రోహులుగా తేల్చారు. మరణశిక్ష విధించకుండా... సర్వీస్‌ నుంచి తొలగించి... యావజ్జీవ కారాగారశిక్ష విధిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఆ శిక్షనూ ప్రజల ఆగ్రహానికి భయపడి అమలు చేయలేదు. దీంతో... ముగ్గురు ఐఎన్‌ఏ సైనికులూ మరిప్పుడేం చేయమంటారని అడగ్గా... ‘మీకు దిల్లీలో ఎవరైనా తెలిసినవారుంటే వెళ్లండి. లేదంటే రైల్లో లాహోర్‌ వెళ్లటానికి టికెట్‌ బుక్‌చేస్తాం’ అంటూ సైనికాధికారులు బదులిచ్చారు. మరుసటి రోజు దిల్లీలో లక్షమందితో జరిగిన భారీ ఊరేగింపులో ఐఎన్‌ఏ అధికారులను సన్మానించారు. వీరిలాగే చాలామందిని జరిమానాలతో వదిలేశారు. భారతీయ సిపాయిల్లో ఇక ఎవ్వరినీ నమ్మేలా లేం అంటూ... ఆర్మీచీఫ్‌ అచిన్‌లెక్‌ వ్యాఖ్యానించటం గమనార్హం! యుద్ధం కాగానే స్వయం ప్రతిపత్తి ఇద్దామనుకున్న ఆంగ్లేయులకు... ప్రతిపత్తి కాదు... భారత్‌ను తామిక మొత్తానికే ఖాళీ చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ‘ఐఎన్‌ఏ విచారణ’తో అర్థమైపోయింది.


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని