Azadi Ka Amrit Mahotsav: తెల్లదొరలు చేతులెత్తేసిన వేళ..

స్వాతంత్య్రం కోరిన భారతీయులపై ప్రతాపం చూపించిన ఆంగ్లేయులు... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌ను చూసి గజగజలాడారు. ప్రజల్ని రక్షించలేమంటూ చేతులెత్తేసి... పారిపొమ్మన్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు...

Updated : 06 May 2022 05:55 IST

స్వాతంత్య్రం కోరిన భారతీయులపై ప్రతాపం చూపించిన ఆంగ్లేయులు... రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్‌ను చూసి గజగజలాడారు. ప్రజల్ని రక్షించలేమంటూ చేతులెత్తేసి... పారిపొమ్మన్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు... రోజుకో ఊహాగానంతో, పిరికితనంతో మద్రాసు గవర్నర్‌ పట్టణాన్ని దాదాపు ఖాళీ చేయించారు.

రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా ఆసియాలోని బ్రిటిష్‌ భూభాగాలపై జపాన్‌ కన్నేసింది. మలయా (మలేషియా), సింగపూర్‌, బర్మాలతో పాటు 1942 మార్చినాటికి అండమాన్‌ నికోబార్‌ దీవులనూ స్వాధీనం చేసుకుంది. కొలంబో, ట్రింకోమలైలపైనా బాంబులు వేసింది. ఇక తదుపరి లక్ష్యం తూర్పుతీరంలోని మద్రాసుపైనే అని ప్రచారం మొదలైంది. అప్పటికే శత్రువులు వైమానిక దాడిచేస్తే హెచ్చరించే సైరన్లు పట్టణమంతా అమర్చారు. బాంబుదాడి జరిగితే దాక్కునే షెల్టర్లను ఏర్పాటు చేశారు. జపాన్‌ సేనలు భారీస్థాయిలో వచ్చేస్తున్నాయని... ఏప్రిల్‌ 15 తర్వాత ఏ క్షణమైనా మద్రాసుపై దాడి జరుగుతుందంటూ రాష్ట్ర గవర్నర్‌ సర్‌ ఆర్థర్‌ హోప్‌ హడావుడి చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రజలంతా తక్షణమే మద్రాసును విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాడు. ఫలితంగా... పట్టణమంతా అయోమయం... గందరగోళం! ఎటు చూసినా జనాలు మూటాముళ్లె సర్దుకొని ఇతర ప్రాంతాలకు బయల్దేరిన చిత్రాలే. మద్రాసు రైల్వే స్టేషనైతే ప్రత్యేక రైళ్లతో కిటకిటలాడింది. ఆరు రోజుల్లో 75శాతం మద్రాసు ఖాళీ అయ్యింది. ఇంటితాళాలకు విపరీతమైన డిమాండ్‌. దొంగలు ఇళ్లపై పడి దోచుకోవటం మొదలెట్టారు. చాలామంది తక్కువ ధరలకు ఇళ్లను, స్థలాలను అమ్మేసుకున్నారు. ఈ సమయంలో కొనుక్కున్న వారు తర్వాతికాలంలో నక్కను తొక్కారు. సర్కారు యంత్రాంగాన్నీ తరలించారు. సచివాలయ ముఖ్య కార్యాలయాలను (ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని) మదనపల్లికి, మిగిలినవాటిని ఊటీకి, డీఐజీ కార్యాలయాన్ని వెల్లూరుకు, హైకోర్టును సగం కోయంబత్తూరుకు, మరో సగాన్ని అనంతపురానికి ఆగమేఘాలపై మార్చారు.

కొసమెరుపు: ఇంత చేస్తే జపాన్‌ సేనలు రాలేదు. బాంబు వేయలేదు. రోజూ సైరన్‌ మోగించటం ప్రజల్ని అప్రమత్తం చేయటం మామూలైపోయింది. చివరకు 1943 అక్టోబరు 11 రాత్రి జపాన్‌ విమానం వచ్చి బాంబు వేసి వెళ్లింది. పెద్దగా నష్టమేమీ జరగలేదు. బాంబు వేసిన విషయం మూడురోజుల దాకా ఎవ్వరికీ తెలియక పోవటం విశేషం. అప్పటిదాకా రోజూ ప్రజల్ని పదేపదే అప్రమత్తం చేస్తూ వచ్చిన సైరన్‌... బాంబు పడ్డ రోజు మాత్రం మోగకపోవటం అంతకంటే విశేషం. యుద్ధ సమయంలో పేలవంగా వ్యవహరించిన మద్రాస్‌ గవర్నర్‌ ఆర్థర్‌ హోప్‌పై బ్రిటన్‌ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తంజేసింది. అవినీతి ఆరోపణలు కూడా తోడవటంతో... కొద్దికాలం తర్వాత ఆర్థర్‌ రాజీనామా చేసి వెళ్లిపోయాడు.

జూలో మారణకాండ...

మనుషుల రక్షణను ఇలా గాలికొదిలేసిన ఆంగ్లేయ సర్కారు... జంతువులు, పశువులపై తుపాకులు ఎక్కుపెట్టింది. మద్రాసు జూలో ఉన్న సింహాలు, పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, ఏనుగులు, పాములను నిర్దాక్షిణ్యంగా చంపించింది. జపాన్‌ సేన జూపై బాంబులు వేస్తే క్రూర మృగాలన్నీ జనావాసాల్లోకి వస్తాయనే భయంతో... వాటిని తక్షణమే కాల్చి చంపాలంటూ అప్పటి మద్రాసు కార్పొరేషన్‌ కమిషనర్‌ ఒ.పుల్లారెడ్డికి... గవర్నర్‌ హోప్‌ సలహాదారు ఆదేశాలు జారీ చేశాడు. అత్యంత కీలకమైన మిలిటరీ ఆపరేషన్ల సమయంలో రంగంలోకి దించే మలబార్‌ స్పెషల్‌ పోలీసు (ఎమ్మెస్పీ)ని ఇందుకోసం రప్పించారు. ఆ పోలీసులు... తుపాకులు ఎక్కుపెట్టి నిమిషాల్లో మద్రాసు జూలోని అనేక జంతువులను నిర్దాక్షిణ్యంగా కాల్చిపారేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని