Updated : 10 May 2022 06:44 IST

Azadi Ka Amrit Mahotsav: నాగ్‌పుర్‌ టు లండన్‌... జెండా టెన్షన్‌!

అప్పగించిన పనిని చాకచక్యంగా పూర్తి చేస్తూ... గాంధీజీకి నమ్మినబంటుగా ఎదిగిన సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు నాగ్‌పుర్‌లో జెండా సత్యాగ్రహం రూపంలో పరీక్ష ఎదురైంది. చివరకు కాంగ్రెస్‌ కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేయకుంటే తన రాజీనామా తప్పదంటూ బ్రిటిష్‌ గవర్నరే స్వయంగా లండన్‌ను బెదిరించే అనూహ్య పరిస్థితి సృష్టించి, సత్యాగ్రహాన్ని విజయవంతం చేశారు సర్దార్‌ పటేల్‌!

జెండా ఎగరేసే హక్కును వినియోగించుకునే ఉద్దేశంతో కాంగ్రెస్‌ ఆరంభించిన ఉద్యమం జెండా సత్యాగ్రహం! దీనికి మూలాలు జబల్‌పుర్‌లో ఉన్నాయి. 1922 మార్చిలో అక్కడ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టౌన్‌హాల్‌పై జాతీయ పతాకం ఎగరేయాలని జబల్‌పుర్‌ మున్సిపాలిటీ తీర్మానించింది. కానీ జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతి ఇవ్వలేదు. అయినా కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండా ఎగరేశారు. ఆంగ్లేయ పోలీసులు దాన్ని తొలగించటమేగాకుండా కాలితో తొక్కి అవమాన పర్చారు. దీంతో సత్యాగ్రహాన్ని ఉద్ధృతం చేయాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. ఇంతలో విషయం తెలిసిన నాగ్‌పుర్‌ జిల్లా కాంగ్రెస్‌ చొరవ తీసుకుంది. జెండాను సివిల్‌ లైన్స్‌ (యూరోపియన్లు ఉండే ప్రాంతం) నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి బహిరంగ సభ పెడతామని ప్రకటించింది. ఏప్రిల్‌ 13న ఊరేగింపు మొదలైంది. సివిల్‌ లైన్స్‌ వద్దకు వచ్చేసరికి పోలీసులు ఆపేశారు. జెండా పట్టుకున్న పది మందిని దారుణంగా కొట్టి... రోడ్లపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పక్కనున్న నాలాలోకి తోసేశారు. యావత్‌ కాంగ్రెస్‌ దృష్టి నాగ్‌పుర్‌వైపు మళ్లింది. సత్యాగ్రహానికి సారథ్యం వహించిన జమ్నాలాల్‌ బజాజ్‌ను అరెస్టు చేయటంతో సర్దార్‌పటేల్‌ రంగంలోకి దిగారు. అన్ని రాష్ట్రాల నుంచి ఉద్యమకారులు నాగ్‌పుర్‌ చేరుకోవటం... వారిని పోలీసులు అరెస్టు చేయటం సాధారణమైంది. నెలలు గడిచినా ఇదే పరిస్థితి.  నాగ్‌పుర్‌ జైలుతో పాటు చుట్టుపక్కల జైళ్లు కూడా జెండా సత్యాగ్రహులతో నిండిపోయాయి.  సర్దార్‌ పట్టు వీడేలా లేరని గుర్తించిన సెంట్రల్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సర్‌ ఫ్రాంక్‌ స్లై, ఆయన కౌన్సిల్‌ హోం సభ్యులు ... చర్చలకు పిలిచారు. ఈ చర్చలకు ముందే సర్దార్‌ పటేల్‌ వ్యూహాత్మకంగా ఓ ప్రకటన చేశారు. ‘శాంతియుతంగా జెండా ప్రదర్శన చేసుకుంటాం. ఆగస్టు 17న జెండా సత్యాగ్రహంపై నిషేధం ఎత్తేయకుంటే ఉద్యమం కొత్త రూపుదాలుస్తుంద’న్నది ఆ ప్రకటన సారాంశం. పటేల్‌ చెప్పినట్లు చేస్తే ప్రభుత్వం ఓడిపోయినట్లవుతుంది. దీంతో... ఊరేగింపును అనుమతించేలా... వెంటనే ఉద్యమాన్ని ఆపేసేలా ఇరు పక్షాలకూ ఇబ్బంది లేని ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఉద్యమకారులందరినీ విడుదల చేయాలని పటేల్‌ మరో షరతు విధించారు. దానికీ గవర్నర్‌ అంగీకరించారు. కానీ స్థానిక ఎస్పీ, నాగ్‌పుర్‌ కమిషనర్లకు ఇది నచ్చలేదు. అయినా... పటేల్‌ శాంతియుతంగా సివిల్‌ లైన్స్‌ నుంచి జెండా ఊరేగింపు తీసుకొచ్చి... ఉద్యమం విజయవంతమైందని ప్రకటించారు. ఇక అరెస్టు చేసిన వారిని విడుదల చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మిగిలింది.

గవర్నర్‌ ఒప్పందం నచ్చని నాగ్‌పుర్‌ డివిజన్‌ బ్రిటిష్‌ ఐసీఎస్‌ అధికారులు ఉద్యమకారుల విడుదలకు అడ్డుపుల్లలు వేయటం మొదలెట్టారు.  ఏకంగా దీనిపై లండన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. నాగ్‌పుర్‌ కమిషనర్‌ తానే స్వయంగా ఆంగ్లేయ అనుకూల పత్రికల్లో పటేల్‌కు, ఉద్యమకారులకు వ్యతిరేకంగా వార్తలు రాయటం మొదలెట్టాడు. ఇది గవర్నర్‌కు ఇబ్బందికరంగా తయారైంది. చాలా ఓపిక పట్టిన పటేల్‌... బ్రిటిష్‌ ప్రభుత్వం (గవర్నర్‌ ) తన మాట నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. అరెస్టు చేసినవారిని 24 గంటల్లో విడుదల చేయకుంటే ఉద్యమాన్ని మళ్లీ ఆరంభిస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. దీంతో గవర్నర్‌ ఫ్రాంక్‌ ఇరకాటంలో పడి... నేరుగా లండన్‌లో భారత వ్యవహారాల మంత్రితో మాట్లాడారు. ఒప్పందం ప్రకారం ఉద్యమకారులను విడుదల చేయకుంటే తానే రాజీనామా చేస్తానంటూ గవర్నర్‌ లండన్‌కు స్పష్టం చేశారు. ఆంగ్లేయ సర్కారుకు ఇదో అనూహ్య పరిస్థితి! వెంటనే లండన్‌ నుంచి ఉద్యమకారుల విడుదలకు అనుమతి రావటంతోపాటు... అడ్డుపుల్లలు వేసిన నాగ్‌పుర్‌ కమిషనర్‌ను ముందస్తు పదవీ విరమణ దిశగా సాగనంపారు. సెప్టెంబరు 3న ఉద్యమకారులందరినీ విడుదల చేశారు. పటేల్‌ సారథ్యంలో వారంతా... మళ్లీ సివిల్‌ లైన్స్‌ మీదుగా జాతీయ జెండాను  సగర్వంగా ఎగరేసుకుంటూ ఊరేగింపుగా రావటం కొసమెరుపు!


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని