రక్తం గడ్డకడితే ముప్పే

కరోనా బాధితులు చాలామందిలో రక్తం గడ్డకట్టే గుణం కనిపిస్తోంది. కొవిడ్‌ నిర్ధారణ అయినప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని స్టార్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ గూడపాటి రమేష్‌ హెచ్చరించారు.

Updated : 29 Apr 2021 05:49 IST

వైద్యుల సిఫార్సు మేరకు తక్షణం మందులు వాడాలి
అవసరమైతే కొన్నిరోజులు బ్లడ్‌ థిన్నర్లు వినియోగించాలి  
‘ఈనాడు’తో కార్డియాలజిస్టు డాక్టర్‌ గూడపాటి రమేష్‌

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

రోనా బాధితులు చాలామందిలో రక్తం గడ్డకట్టే గుణం కనిపిస్తోంది. కొవిడ్‌ నిర్ధారణ అయినప్పటి నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటివారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని స్టార్‌ ఆసుపత్రికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ గూడపాటి రమేష్‌ హెచ్చరించారు. కరోనా బాధితులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మొదట ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతుందని, ఆ తరవాత గుండె మీద అధిక ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పలువురికి వైద్య చికిత్స అందించిన డాక్టర్‌ గూడపాటి రమేష్‌ ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు.

కరోనా బాధితుల్లో పలువురు రక్తం గడ్డకట్టి తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పాజిటివ్‌ వచ్చినప్పటి నుంచి అప్రమత్తంగా ఉండాలి. నెగెటివ్‌ వచ్చే వరకు డీహైడ్రేషన్‌ తలెత్తకుండా, రోజూ కనీసం 2 నుంచి 3 లీటర్ల వరకు ద్రవపదార్థాలు తీసుకోవాలి. మంచినీళ్లు, పాలు, మజ్జిగ, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే రక్తం కొంతవరకు గడ్డకట్టే పరిస్థితి ఉండదు. కరోనా బాధితుల రక్తంలో అనూహ్యంగా డీడైమర్‌ స్థాయులు పెరిగిపోతున్నాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వారు మహమ్మారి బారిన పడినా, లక్షణాల తీవ్రత అధికంగా ఉన్నా, వైద్యుల సూచనల మేరకు డీడైమర్‌ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. డీడైమర్‌ స్థాయి పెరిగితే సాధారణ కొవిడ్‌ బాధితులు వైద్యుల పర్యవేక్షణలో కొద్దిరోజుల పాటు రక్తాన్ని పలచబరిచే బ్లడ్‌ థిన్నర్లు వాడాలి. దీర్ఘకాలిక గుండె జబ్బు, రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యలున్న వారు నెల నుంచి మూడు నెలల వరకు ఈ మందులు వేసుకోవాలి.

పాజిటివ్‌ వచ్చిన వారు గుండె పనితీరును చక్కగా ఉంచుకొనేందుకు ఏం చేయాలి?
చాలామందిలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతున్నాయి. ఐసొలేషన్‌లో ఉన్నప్పుడు 24 గంటలూ పడుకుని ఉండకూడదు. తప్పనిసరిగా 5 నిమిషాలు నడవడం లేదా ఇతరత్రా చిన్నపాటి వ్యాయామాలైనా చేయాలి. తద్వారా ఆక్సిజన్‌ శాతం మెల్లమెల్లగా పెరుగుతుంది. పడక మీద ఉన్నప్పటికీ కాళ్లను చిన్నగా ఊపడం ద్వారా కండరాల్లో చురుకుదనం తీసుకురావచ్చు. నాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చూసుకోవచ్చు. ఇలాంటి చిన్నపాటి జాగ్రత్తలతో ప్రాణహాని నుంచి బయటపడవచ్చు.

కరోనా బారిన పడినవారు అంతకుముందు వాడుతున్న మందులను ఆపేయాలా?
ఎట్టిపరిస్థితుల్లో మానరాదు. ఇది మరొక రకమైన ఇబ్బందులకు దారితీస్తుంది. గుండెకు సంబంధించిన మందులు వాడేవారు, రక్తపోటు మాత్రలు మింగేవారు, ఇతరత్రా వ్యాధులకు మందులు వేసుకొనేవారు.. వైద్యుల సూచన మేరకు మోతాదుల్లో మార్పులు చేయాలి తప్ప ఆపకూడదు. అప్పటికే బ్లడ్‌ థిన్నర్స్‌ వాడుతున్న వారు డోసులు పెంచడం, తగ్గించడం అన్నది డాక్టర్‌ పర్యవేక్షణలో చేయాలి.

పాజిటివ్‌ వచ్చి, లక్షణాలు తీవ్రంగా ఉంటే ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?
ఆయాసం ఉన్నా, గుండె కొట్టుకోవడం ఎక్కువగా ఉన్నా, తక్కువగా ఉన్నా జాగ్రత్తపడాలి. సాధారణంగా ఇలాంటి రోగులకు ఈసీజీ, ఎక్మో పరీక్షలు చేయిస్తున్నాం. తద్వారా ఎలాంటి వైద్యం చేయాలో నిర్ణయిస్తున్నాం.

కరోనా బాధితుల్లో కొందరు గుండెపోటుతో చనిపోతున్నారు. అది సోకకుండానే భయంతో మరికొందరు గుండె ఆగి మరణిస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది?
చాలామందిలో కరోనా లక్షణాలు గుండె పంపింగ్‌ మీద ప్రభావాన్ని చూపిస్తున్నాయి. హృదయ స్పందనలో తేడా వస్తోంది. చాలామంది రక్త నాళాల్లో బ్లాక్‌ ఏర్పడి గుండెపోటుతో చనిపోతున్నారు. కొన్నిసార్లు కండరాలు దెబ్బతింటున్నాయి. కొంతమంది కాళ్ల నరాల్లోనూ ఇతరత్రా అవయవాల్లోనూ పూడిక ఏర్పడి గుండె ఆగి మరణిస్తున్నారు. అతిగా భయపడేవారిలో రక్త సరఫరా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి ప్రాణాల మీదకు వస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని