Vaccine: క్యాన్సర్‌ రోగులూ టీకా తీసుకోవచ్చు

వైరస్‌ ఉద్ధృతి సమయంలో ఆసుపత్రికి వెళితే ఎక్కడ కొవిడ్‌ బారినపడతామోననే భయంతో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు. పెద్దగా ఇబ్బందిలేని రోగాల విషయంలో ఆలస్యం చేసినా పర్వాలేదు గానీ క్యాన్సర్‌ లాంటి వ్యాధుల విషయంలో

Updated : 01 Jun 2021 07:49 IST

ప్రస్తుత చికిత్సలు వాయిదా వేయడం ప్రమాదకరం
వ్యాధి ముదిరితే కరోనా కంటే ముప్పు
‘ఈనాడు’తో అపోలో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ విజయానందరెడ్డి

వైరస్‌ ఉద్ధృతి సమయంలో ఆసుపత్రికి వెళితే ఎక్కడ కొవిడ్‌ బారినపడతామోననే భయంతో చాలామంది ఇతర అనారోగ్య సమస్యల చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు. పెద్దగా ఇబ్బందిలేని రోగాల విషయంలో ఆలస్యం చేసినా పర్వాలేదు గానీ క్యాన్సర్‌ లాంటి వ్యాధుల విషయంలో ఎట్టిపరిస్థితుల్లో జాప్యం తగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది క్యాన్సర్‌ బాధితులు, రేడియేషన్‌, కీమోథెరపీ చికిత్సలు తీసుకుంటున్న వారు చికిత్సలు వాయిదా వేసుకుంటున్నారని, ఇది వ్యాధి తీవ్రం కావటానికి కారణమవుతుందని అపోలో క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.విజయానందరెడ్డి హెచ్చరించారు. కరోనాతో నిమిత్తం లేకుండా క్యాన్సర్‌ లక్షణాలు బయటపడిన వెంటనే నిర్ధారిత పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇప్పటికే క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్న బాధితులు నిరభ్యంతరంగా టీకాలు తీసుకోవచ్చునని ‘ఈనాడు’తో ముఖాముఖిలో ఆయన వివరించారు.

క్యాన్సర్‌కు చికిత్సలు తీసుకుంటూ కొవిడ్‌ టీకాలు వేసుకోవచ్చా ఎలాంటి జాగ్రత్తలు అవసరం?

క్యాన్సర్‌ రోగులు నిరభ్యంతరంగా టీకాలు వేసుకోవచ్చు. ఇప్పటికే వ్యాధిని జయించిన వారు సాధారణ వ్యక్తుల మాదిరిగానే టీకా తీసుకోవచ్చు. ప్రస్తుతం చికిత్స తీసుకునే వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా కీమోథెరపీలో ఉన్న రోగులు రెండు సైకిల్స్‌ మధ్యలో సీబీపీ పరీక్ష చేయించుకోవాలి. తెల్లరక్తకణాల సంఖ్య సాధారణంగా ఉంటే టీకా వేసుకున్న వారం రోజుల తర్వాత మళ్లీ కీమోథెరపీ ప్రారంభించొచ్చు. రేడియేషన్‌ చికిత్సలో ఉన్న వారు మాత్రం మధ్యలో ఎప్పుడైనా తీసుకోవచ్చు. లుకేమియా చికిత్స పొందుతున్న వారు కూడా సీపీబీ పరీక్ష చేయించుకున్న తర్వాతే ముందుకెళ్లాలి. టార్గెట్‌థెరపీ, హార్మోనల్‌ థెరపీ, ఇమ్యూన్‌థెరపీలు తీసుకుంటున్న వారు కూడా ఎప్పుడైనా తీసుకోవచ్చు. బోన్‌మ్యారో మార్పిడి చేయించుకున్న రోగులు, చికిత్సల తర్వాత వ్యాక్సిన్‌ పొందొచ్చు. క్యాన్సర్‌ ఉన్నట్లు గుర్తించిన వెంటనే అయినా టీకా తీసుకోవచ్చు. దాని తర్వాత రెండు వారాలు ఆగి క్యాన్సర్‌ చికిత్సలు ప్రారంభించాలి.

క్యాన్సర్‌ పరీక్షలను జాప్యం చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి?

ఆసుపత్రులకు వెళ్తే కరోనా వ్యాపిస్తుందనే ఆందోళనతో చాలామంది లక్షణాలు బయటపడుతున్నా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు వెనక్కి తగ్గుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. క్యాన్సర్‌ను తొలి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు. వాయిదా వేయడం వల్ల రెండు నెలల్లోనే అది 3, 4 దశలకు చేరుతుంది. అప్పుడు చికిత్స చేసినా నయమయ్యే అవకాశాలు చాలా తక్కువ. లక్షణాలు బయటపడిన వెంటనే చికిత్స ఆరంభించడం ఎంతో ఉత్తమం.
 

కరోనా పాజిటివ్‌గా తేలిన వారు క్యాన్సర్‌ చికిత్సలు తీసుకోవచ్చా?
కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారికి రేడియేషన్‌, కీమోథెరపీ వంటి చికిత్సలు చేయకూడదు. తొలుత కరోనాకు వైద్యం అందించాలి. 14 రోజుల తర్వాత వ్యాధి తగ్గి నెగెటివ్‌గా నిర్ధారణయితే, మరో 14 రోజులు(మొత్తం 28 రోజులు) ఆగి క్యాన్సర్‌ చికిత్స ప్రారంభించాలి.
క్యాన్సర్‌ చికిత్సలను మధ్యలో నిలుపుదల చేస్తే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి?
కొవిడ్‌ భయంతో కీమోథెరపీ తీసుకునే కొందరు మధ్యలో ఒకటి రెండు సైకిల్స్‌కు రావటం లేదు. ఇలాంటి వారు 10 శాతం మంది వరకు ఉంటున్నారు. ఎప్పటికప్పుడు కౌన్సెలింగ్‌ చేస్తున్నా భయపడుతున్నారు. కొవిడ్‌ సోకితే చనిపోతాం కదా! అంటున్నారు. అలాంటి ఆందోళన అవసరం లేదు. కరోనా కంటే క్యాన్సర్‌ ఇంకా భయంకరమైంది. మధ్యలో చికిత్సలను మానేస్తే వ్యాధి ముదిరిపోతుంది. అది ప్రాణాల మీదుకు తెస్తుందని గుర్తించాలి.
ఈ వ్యాధి బాధితులకు ఏ టీకా మంచిది?
ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండూ మంచివే. త్వరలో అందుబాటులోకి రానున్నవీ వేసుకోవచ్చు. దీర్ఘకాలికంగా అలర్జీలతో బాధపడేవారు మాత్రం వైద్యులను సంప్రదించిన తర్వాతే వేయించుకోవాలి.
ఈ సమయంలో క్యాన్సర్‌ బాధితుల ఆహార అలవాట్లు ఎలా ఉండాలి?
ఎక్కువ మాంసకృత్తులు ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. గుడ్డు, మాంసం, చేపలు, ఆకుకూరలు, పండ్లు, చిరుధాన్యాలు, సలాడ్లు నిత్యం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఈ వ్యాధిగ్రస్తుల్లో వ్యాధి నిరోధకశక్తి కొంత తక్కువగా ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల, కరోనా సోకినా ఎలాంటి ఇబ్బంది లేకుండా కోలుకోవటానికి అవకాశం ఉంటుంది.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని