Telangana: ఇళ్ల స్థలాలకు టీఎస్‌ఐఐసీ భూములు

రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సాధ్యం కాని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) భూములను ఇళ్ల స్థలాల (ప్లాట్ల)కు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Updated : 13 Feb 2022 06:37 IST

పరిశ్రమలు తరలించిన చోటా విక్రయాలు

నగరాలు, పట్టణాల్లో నాలుగువేల ఎకరాల మేరకు లభ్యత

త్వరలో విధాన నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో పరిశ్రమల ఏర్పాటుకు సాధ్యం కాని తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) భూములను ఇళ్ల స్థలాల (ప్లాట్ల)కు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో పరిశ్రమలను తరలించిన భూములను సైతం విక్రయించేందుకు సిద్ధమవుతోంది. దీనిపై త్వరలోనే విధాన నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల కోసం 1.57 లక్షల ఎకరాలను సేకరించి టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇందులో 23 వేల ఎకరాలను వివిధ పరిశ్రమల కోసం కేటాయించింది. హైదరాబాద్‌, రంగారెడ్డి, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, సిద్దిపేటలలో జనావాసాలకు దగ్గరగా టీఎస్‌ఐఐసీకి నాలుగువేల ఎకరాలకు పైగా భూములున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్‌ఎంసీ పరిధిలో కాలుష్యకారక పరిశ్రమలను అనుమతించడం లేదు. ఇతర చోట్లా అదే పరిస్థితి. కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవుటర్‌రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌) బయటే భూములను కేటాయిస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లోని 15 పారిశ్రామికవాడల పరిధిలోని కాలుష్య పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటికి తరలించేందుకు సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమలకు ఇవ్వకుంటే ఆ భూములు నిరుపయోగంగా ఉండే వీలుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆదాయార్జన కోసం భూములను విక్రయిస్తోంది. టీఎస్‌ఐఐసీ వివిధ పరిశ్రమలు, స్థిరాస్తి, మౌలిక వసతుల ప్రాజెక్టుల కోసం విక్రయించింది. తాజాగా ప్రభుత్వం చిన్న, చిన్న ఖాళీ స్థలాలను ఇళ్లు, వాణిజ్య సముదాయాల కోసం విక్రయించాలని నిర్ణయించి భూముల విక్రయంలో అనుభవం ఉన్న టీఎస్‌ఐఐసీకి బాధ్యతలు అప్పగించింది. ఈ నేపథ్యంలో నగరాల్లోని చిన్నచిన్న ప్లాట్లతో పాటు పరిశ్రమలను తరలించే భూముల విక్రయాలపై టీఎస్‌ఐఐసీ దృష్టి సారించింది.

తొలుత జనావాస ప్రాంతాల్లో...

జనావాస ప్రాంతాల్లోని భూములను తొలుత విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ భూమిని ప్లాట్లుగా తయారు చేసి విక్రయిస్తుంది. తద్వారా మరింత ఆదాయం వస్తుందని అంచనా. మల్లాపూర్‌, నాచారం, చర్లపల్లి లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొన్ని అపార్ట్‌మెంట్లను నిర్మించి విక్రయిస్తున్నారు. ఎమ్మార్‌ భూముల్లోనూ అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరిగింది. దీంతో పాటు గ్రిడ్‌ విధానం కింద ఉప్పల్‌ తదితర ప్రాంతాల్లో కాలుష్య కారక పరిశ్రమలు తరలించి అక్కడ ఐటీ పార్కులు ఏర్పాటు చేసే సంస్థలకు 50శాతం భూమిని, మిగతా దాన్ని వాణిజ్య సముదాయాలు, స్థిరాస్తి ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా పరిశ్రమలు తరలించే చోట భూమి యజమానిదైతే అందులోనూ ఇలాంటి అవకాశం కల్పిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని