Azadi Ka Amrit Mahotsav: అక్కడ 9 ఏళ్లు బాపూ రాజ్యాంగం

ఆంగ్లేయుల పాలనలో భారత సంస్థానాధీశుల పాత్ర తక్కువేమీ కాదు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని వారి అడుగులకు మడుగులొత్తుతూ తమ అధికారాన్ని కాపాడుకున్న సంస్థానాధీశులే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లోనూ ఆంగ్లేయులను తోసిరాజని... గాంధీజీ బాటలో ప్రజలకు పట్టంగట్టిన అరుదైన సంస్థానాధీశుడు రాజా భవన్‌రావు శ్రీనివాసరావు.

Updated : 15 Feb 2022 06:17 IST

ఆంగ్లేయుల పాలనలో భారత సంస్థానాధీశుల పాత్ర తక్కువేమీ కాదు. బ్రిటిష్‌ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకొని వారి అడుగులకు మడుగులొత్తుతూ తమ అధికారాన్ని కాపాడుకున్న సంస్థానాధీశులే ఎక్కువ. అలాంటి పరిస్థితుల్లోనూ ఆంగ్లేయులను తోసిరాజని... గాంధీజీ బాటలో ప్రజలకు పట్టంగట్టిన అరుదైన సంస్థానాధీశుడు రాజా భవన్‌రావు శ్రీనివాసరావు.

ప్రస్తుత మహారాష్ట్రలోని ఓ సంస్థానమే ఔంధ్‌. మరాఠా సామ్రాజ్య పతనానంతరం 1818లో ఏర్పడిందిది. మహారాష్ట్రలోని సతారా, సాంగ్లి, కర్ణాటకలోని బీజాపూర్‌ జిల్లాల్లోని గ్రామాలు ఈ సంస్థానం కిందికి వచ్చేవి. పదేపదే కరవు కాటకాలతో ఇబ్బంది పడేవి. వాటిని తట్టుకొని నిలబడటం ఎలా అని ఆలోచిస్తున్న తరుణంలో రాజా భవన్‌రావుకు పరిచయమయ్యారు మౌరిస్‌ ఫ్రిడ్‌మన్‌ ఉరఫ్‌ స్వామి భారతానంద!

పోలండ్‌కు చెందిన ఫ్రిడ్‌మన్‌ వృత్తిరీత్యా ఎలక్ట్రికల్‌ ఇంజినీర్‌. మైసూర్‌ సంస్థాన ప్రధాన మంత్రి ఆహ్వానం మేరకు 1935లో మైసూర్‌ వచ్చారు. బెంగళూరులో మైసూర్‌ రాష్ట్ర ప్రభుత్వ ఎలక్ట్రికల్‌ ఫ్యాక్టరీ స్థాపనలో సాయం చేశారు. అలా వచ్చిన ఫ్రిడ్‌మన్‌ గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులయ్యారు. అదే సమయంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షి ప్రభావంతో స్వామి భారతానందగా మారి ఆధ్యాత్మిక జీవితం ఆరంభించారు. మైసూరులో ఫ్రిడ్‌మన్‌ పనితీరును చూసిన రాజా భవన్‌రావు కుమారుడు అపా బి.పంత్‌... ఆయన్ను ఆరునెలల పాటు  తమ ప్రాంతానికి పంపించాలని కోరారు. అందుకు మైసూరు ప్రధాని నిరాకరించారు. అయినా... పరిస్థితి తెలుసుకున్న ఫ్రిడ్‌మన్‌ తనను తీసుకొచ్చిన మైసూరు సంస్థానం ఆదేశాలను కాదని ఔంధ్‌కు వచ్చారు. 

రాజా భవన్‌రావును ఫ్రిడ్‌మన్‌ పూర్తిగా మార్చేశారు. తమ సంస్థానాన్ని రాజ్యాంగ బద్ధ రిపబ్లిక్‌గా మారుస్తానని గాంధీజీకి మాటిచ్చేలా ఒప్పించారు. 1938 నవంబరులో రాజు తాను గద్దెదిగి ప్రజలకే పగ్గాలు అప్పగించబోతున్నట్లు ప్రకటించారు. యువరాజు అపా పంత్‌, ఫ్రిడ్‌మన్‌ సేవాగ్రామ్‌ ఆశ్రమానికి వెళ్లి గాంధీజీని కలిసి తమ ప్రతిపాదిత రిపబ్లిక్‌ ఔంధ్‌ గురించి చెప్పారు. రాజ్యాంగ రచనకు సాయం చేసేందుకు గాంధీజీ అంగీకరించారు. అయితే కొన్ని షరతులు విధించారు. వాటిలో ప్రధానమైనవి-  ప్రజలకు పగ్గాలు అప్పగిస్తున్నాని చెప్పి రాజు పట్టణాలకు వెళ్లి విలాసవంతంగా ఉండకూడదు. అక్కడే ఓ గుడిసెలో సామాన్యులతో కలసి పదేళ్లపాటు పనిచేస్తూ జీవించాలి. తమ రాష్ట్రంలోనే తయారైన దుస్తులు కట్టుకోవాలి. నెలకు రూ.50 కంటే ఎక్కువ ఖర్చు చేయకూడదు. ఈ షరతులకు రాజు అంగీకరించగానే... ఔంధ్‌ రిపబ్లిక్‌ రాజ్యాంగం రాసే పని మొదలైంది. 

1939 జనవరి 21న ఔంధ్‌ సంస్థానం గాంధీజీ సూచనలకు అనుగుణంగా... గ్రామ రిపబ్లిక్‌గా అవతరించింది. ఆయన సూచించిన స్వరాజ్య రాజ్యాంగాన్ని అమలు చేయటం ఆరంభించింది. ఒకవైపు రాజులంతా తమ అధికారాన్ని కాపాడుకోవటానికి, మరింత బిగించటానికి ప్రయత్నిస్తుంటే... ప్రజలకు పగ్గాలు అప్పగించటానికి ముందుకొచ్చిన ఔంధ్‌ను చూసి అంతా ఆశ్చర్యపోయారు. బ్రిటిష్‌ ప్రభుత్వం  వేచిచూసే ధోరణి అవలంబించింది.

రాజ్యాంగ బద్ధ రిపబ్లిక్‌గా అవతరించాక విద్య, ఆర్థిక, సామాజిక సామరస్యాల్లో ఔంధ్‌ ముందంజ వేసింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. విద్యపై ఖర్చుతో పాటు పాఠశాలలు, ఉపాధ్యాయుల సంఖ్య పెరిగింది. 1942లో వచ్చిన కరవును ఔంధ్‌ సమర్థంగా తట్టుకొని నిలబడగలిగింది. ఒకటి కాదు రెండు కాదు... 1948లో స్వతంత్ర భారతావనిలో విలీనమయ్యే దాకా 9 సంవత్సరాల పాటు గాంధీజీ రాజ్యాంగాన్నే పాటించింది ఔంధ్‌! 


అక్షరాస్యులకే ఓటుహక్కు 

ఔంధ్‌లో మూడంచెల ప్రభుత్వాన్ని గాంధీజీ ప్రతిపాదించారు. ప్రతి గ్రామం ఐదుగురు సభ్యుల పంచాయతీని ఎన్నుకుంటుంది. వారు తమ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. పంచాయతీ అధ్యక్షులు తాలూకాలకు అధ్యక్షులను ఎంచుకుంటారు. మొత్తం 12 మందితో లెజిస్లేటివ్‌ అసెంబ్లీ రూపొందుతుంది. వారంతా కలసి రాష్ట్ర ప్రధానిని ఎంపికచేస్తారు. కేవలం అక్షరాస్యులకే ఓటు హక్కు ఇవ్వాలని గాంధీ పట్టుబట్టారు. అలా అయితేనే త్వరగా అక్షరాస్యత సాధించగలమనేది ఆయన ఆలోచన. తొలి ఎన్నిక నాటికి అందరినీ అక్షరాస్యులను చేసేలా కార్యక్రమం చేపట్టాలని రాజుకు సూచించారు. ప్రాథమిక విద్యను అందరికీ ఉచితంగా తప్పనిసరి చేశారు. కిందిస్థాయి న్యాయస్థానాల్లో ఉచిత న్యాయసాయం అందించటమేగాకుండా... వేగంగా పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. శిక్ష పడ్డ నేరస్థులు పెరోల్‌పై ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలసి జీవించే తొలి స్వతంత్ర జైలు(ఫ్రీ ప్రిజన్‌)ను ఔంధ్‌లోనే ఆరంభించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని