Heart Attack: యువ గుండెల్లో కల్లోలం

కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ 50 ఏళ్లలోపే గుండెపోటుతో కన్నుమూశారు. నిజానికి ఈయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. నిత్యం వ్యాయామానికి తగిన సమయం కేటాయించేవారు. అయినా గుండెపోటుతో మృతి చెందారు. అంటే తెలియని

Updated : 22 Feb 2022 06:44 IST

యుక్త వయసులోనే ఆకస్మిక గుండెపోటు
దెబ్బతీస్తున్న అధిక రక్తపోటు, మధుమేహం
ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లే కారణం
ఆరోగ్యకర జీవనశైలి అవసరమంటున్న నిపుణులు
ఈనాడు - హైదరాబాద్‌


కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ 50 ఏళ్లలోపే గుండెపోటుతో కన్నుమూశారు. నిజానికి ఈయనకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎక్కువ. నిత్యం వ్యాయామానికి తగిన సమయం కేటాయించేవారు. అయినా గుండెపోటుతో మృతి చెందారు. అంటే తెలియని అంశాలేవో ఈయన మరణానికి కారణమయ్యాయనే భావన వ్యక్తమవుతోంది. తాజాగా ఏపీ మంత్రి గౌతంరెడ్డిది దాదాపు అదే వయసు. ఈయనా శారీరక వ్యాయామం చేస్తారు. అయినా ఆకస్మికంగా గుండెపోటుతో మరణించారు.


మాదాపూర్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రికి గత ఆరునెలల్లో హృద్రోగ సమస్యతో 16,731 మంది చికిత్స కోసం చేరారు. వీరిలో 30-45 వయస్సు వారు 22 శాతం, 46-60 ఏళ్లున్న వారు 48 శాతం, మిగిలిన 30 శాతం 60 ఏళ్లు పైబడిన వారు ఉన్నట్లు వైద్యనిపుణులు చెప్పారు. హైదరాబాద్‌లో ఏటా 10 వేల వరకు బైపాస్‌ సర్జరీలు జరుగుతుంటే.. ఇందులో 40-50 ఏళ్లవారు అధిక శాతం ఉంటున్నారని వైద్యులు తెలిపారు.


ధునిక జీవనశైలి గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒకప్పుడు 65-70 ఏళ్ల వయసు వారిలో కనిపించే గుండె జబ్బులు.. ప్రస్తుతం 25-35 ఏళ్లలోనే దాడి చేస్తున్నాయి. గతంలో పోల్చితే యువతలో గుండె జబ్బులు పెరుగుతున్నాయనీ, ఆకస్మిక గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా ఈ ముప్పు ఎక్కువవుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఉదయం లేచింది.. మొదలు ఉరుకుల పరుగుల జీవితంతో.. చాలామంది వృత్తి.., వ్యక్తిగత జీవితంలో ఒత్తిడితో చిత్తవుతున్నారు. కొందరు తాత్కాలిక ఉపశమనం కోసం చెడు అలవాట్లకు బానిసవుతున్నారు. నిద్రలేమి కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. హృద్రోగుల్లో ఎక్కువ శాతం మందికి  పొగతాగే అలవాటు ఉండడం గమనించాల్సిన అంశమని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో చిన్న వయసులోనే బైపాస్‌ సర్జరీ అవసరమవుతోందని వైద్యులు ఆందోళన వెలిబుచ్చారు. ఒత్తిడి.. అధిక రక్తపోటు.. మధుమేహం.. అధిక బరువు.. ధూమపానం.. అతి మద్యపానం తదితరాలు గుండెపోటు ముప్పును మరింత పెంచుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రి పడుకున్నప్పుడు సాధారణంగా శ్వాసను ముక్కు నుంచి లేదా నోటి నుంచి తీసుకుంటారు. ఈ శ్వాస గొంతు నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. కొందరిలో ఏ కారణంతోనైనా ముక్కు, నోటి మార్గాలు సన్నబడితే.. ఆక్సిజన్‌ తక్కువ మోతాదులో శ్వాసకోశాల్లోకి చేరుతుంది. దీనివల్ల ఆక్సిజన్‌ స్థాయులు తగ్గుతాయి. కారణం.. ముక్కులో కండ పెరగడం, మధ్య గోడ వంకరగా ఉండడం, ముక్కు, గొంతు వెనకభాగంలో ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడం. తద్వారా శ్వాసనాళం పరిమాణం తగ్గిపోతుంది. అధిక బరువు ఉన్నవారిలో మెడ చుట్టూ కొవ్వు పేరుకుపోయిన వారిలో ఇలాంటివి ఎక్కువ. దీన్నే ‘స్లీప్‌ ఆప్నియా’ అంటారు. హఠాత్తుగా గుండెపోటు రావడానికి ఇది కూడా ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వీరు గురక పెడుతుంటారు. నిద్ర మధ్యలో శ్వాస ఆడనట్లుగా ఉలిక్కిపడి లేస్తుంటారు. వీరిలో బీపీ ఎక్కువ. ఇలాంటి వారి హృదయ స్పందనల్లో విపరీత తేడాలతో ఉన్నట్టుండి గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ.


లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు
-డా. అమరేశ్‌, హృద్రోగ శస్త్రచికిత్స నిపుణులు, నిమ్స్‌

ప్పటికప్పుడు రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం ఆకస్మిక గుండె మరణాలకు దారితీస్తుంది. చాలామందిలో హైబీపీ, మధుమేహం ఉన్నా బయటకు తెలియడం లేదు. తెలుసుకునేలోపు నష్టం జరుగుతోంది. తొలుత ముప్పు కారణాలను పరిగణిస్తూ వాటినుంచి బయటపడాలి. కొన్ని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఆయాసం, గుండెనొప్పి, ఎక్కువ చెమటపట్టడం, కళ్లు తిరగడం లాంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ధూమపానం మానేయాలి. క్రమశిక్షణతో కూడిన జీవనశైలి ముఖ్యం. అధిక కొవ్వులతో కూడిన ఆహారాలకు దూరంగా ఉండాలి.


సీపీఆర్‌పై అవగాహన పెంచాలి
-డా. వర్షా కిరణ్‌, కన్సల్టెంట్‌ కార్డియాలజిస్టు, అపోలో

యువతలో ఆకస్మిక గుండె వైఫల్యాలు పెరుగుతున్నాయి. 40శాతం మందిలో కారణాలుండటం లేదు. ఆపత్కాలంలో గుండెను తిరిగి పనిచేసేలా కార్డియో పల్మనరీ రిససిటేషన్‌(సీపీఆర్‌) వీరికి చాలా ఉపయోగపడుతుంది. గుండెపోటుకు గురై కుప్పకూలిన వారి ఛాతీపై రెండు చేతులతో గట్టిగా నొక్కాలి. తద్వారా తిరిగి గుండెను పనిచేసేలా చేయవచ్చు. సీపీఆర్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలి.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని