Updated : 23 Feb 2022 05:10 IST

Ukraine Crisis: ‘జీవరేఖ’ ఆగినా.. జంకేది లేదు

ప్రతిచర్యగా రష్యా పైప్‌లైన్‌ నిలిపివేసిన ఐరోపా దేశాలు

బెర్లిన్‌: ఉక్రెయిన్‌ నుంచి విడిపోయిన రెండు తూర్పు ప్రాంతాలను స్వతంత్ర భూభాగాలుగా గుర్తించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అక్కడకు సైనిక దళాలను పంపడంతో అమెరికా, నాటో కూటమి దేశాలు రష్యాపై ప్రతిచర్యలకు దిగాయి. ముఖ్యంగా రష్యా సహజవాయు పరిశ్రమపై ఇవి తమ గురిని ఎక్కుపెట్టాయి. రష్యా నుంచి సహజ వాయువు దిగుమతులను నిలిపివేస్తే 27 ఐరోపా దేశాలు ఆర్థికంగా నష్టపోవలసి వస్తుంది. తమ ‘జీవరేఖ’ ఆగినా సరే.. వెనక్కుతగ్గేది లేదని ఈయూ దేశాలు అంటున్నాయి. ఇందులో భాగంగా రష్యన్‌ సహజ వాయువును జర్మనీకి తీసుకొచ్చే నార్డ్‌ స్ట్రీమ్‌-2 గ్యాస్‌ పైపులైన్‌ను ఎక్కడికక్కడ నిలిపివేయాలని జర్మనీ నిశ్చయించింది.

ప్రత్యామ్నాయం ఏమిటి?

రష్యా బదులు అమెరికా, ఆస్ట్రేలియా, అల్జీరియా, ఖతర్‌ తదితర దేశాల నుంచి ద్రవరూప సహజవాయువు (ఎల్‌ఎన్జీ)ని దిగుమతి చేసుకొని ఇంధన కొరతను అధిగమించడమొక్కటే 27 దేశాల ఐరోపా సమాఖ్య (ఈయూ) ముందున్న తక్షణ ప్రత్యామ్నాయం. రష్యాపై ఆధారపడటం మానేసి అమెరికాను నమ్ముకోవటం సమస్యకు పరిష్కారం కాబోదని వాతావరణ మార్పుల నిరోధక ఉద్యమకారిణి ఎలిఫ్‌ గుండజ్యెలి వ్యాఖ్యానించారు. ముఖ్యంగా కర్బన ఉద్గారాల తక్షణ కట్టడికి ఇది తోడ్పడబోదన్నారు. ఐరోపాలో విద్యుదుత్పాదనకు, శీతాకాలంలో ఇళ్లను వెచ్చగా ఉంచడానికీ సహజవాయువే ఆధారం. రానున్న వసంతకాలంలో సహజ వాయువు అవసరాలు తగ్గుతాయి. అమెరికా, ఖతర్‌ తదితర దేశాల నుంచి తెచ్చి నిల్వ చేసుకున్న ఎల్‌ఎన్జీతో ఐరోపా సమాఖ్య దేశాలు వసంతంలో గట్టెక్కుతాయి.

మొదట హడావుడి.. తర్వాత హేండ్సప్‌

రష్యాపై ఆధారపడవలసిన అగత్యాన్ని పూర్తిగా అధిగమించాలంటే ఈయూ దేశాలు మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. క్రిమియాను 2014లో రష్యా ఆక్రమించినప్పుడు ఈయూ దేశాలు గ్యాస్‌ విషయంలో హడావుడి చేసి, తరవాత చప్పబడిపోయాయి. వాటి ప్రాధాన్యం ఇంధన భద్రత నుంచి కర్బన ఉద్గారాల నిర్మూలన తద్వారా వాతావరణ మార్పుల నిరోధానికి మారింది. తదనుగుణంగా బొగ్గు, చమురు వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గిస్తూ సౌర, పవన విద్యుదుత్పాదన సామర్థ్యాన్ని పెంచుకోసాగాయి. తమ ఇంధన అవసరాలను పూర్తిగా పునరుత్పాదక ఇంధన వనరులే తీర్చే రోజు వచ్చేవరకు రష్యా నుంచి సహజ వాయువును దిగుమతి చేసుకోక తప్పదని ఈయూ గ్రహించింది. ఈయూ ఇంధన అవసరాల్లో మూడోవంతుకు రష్యాయే ఆధారం.

* పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం పూర్తిస్థాయిలో జరిగే వరకు ఈయూ దేశాల మధ్య సహజవాయువు, విద్యుచ్ఛక్తి స్వేచ్ఛగా, చౌకగా రవాణా కావడానికి సమగ్ర ఇంధన యంత్రాంగాన్ని (ఇంధన యూనియన్‌) నెలకొల్పాలని 2015లో దార్శనిక పత్రం వెలువరించారు. ప్రస్తుతం ఈయూ దేశాల మధ్య గ్యాస్‌ రవాణాకు ఏకరూప సుంకాల వ్యవస్థ లేదు. ఇంధన రవాణా కంపెనీలు ఒకటికి రెండు దేశాల్లో సుంకాలు చెల్లించాల్సి వస్తోంది. ఇంధన యూనియన్‌ వల్ల సుంకాల బెడద తొలగి గ్యాస్‌ చవకగా, స్వేచ్ఛగా రవాణా అవుతుంది. ఇంధన యూనియన్‌లో భాగంగా స్పెయిన్‌ నుంచి ఫ్రాన్స్‌కు గ్యాస్‌ రవాణా పైపులైను నిర్మించాలని గతంలో ప్రతిపాదించినా, తరవాత దాన్ని పక్కన పడేశారు. తాజా ఉక్రెయిన్‌ పరిణామాలతో ఆ పైపులైను మళ్లీ పట్టాలకెక్కవచ్చు.
* 2023 నుంచి నార్వే సహజ వాయువును డెన్మార్క్‌కు తీసుకొచ్చే బాల్టిక్‌ పైపులైన్‌ను తానూ ఉపయోగించుకోవాలని పోలెండ్‌ సన్నాహాలు చేస్తోంది. అజర్‌ బైజాన్‌ నుంచి సరికొత్త పైపులైను గ్రీస్‌, టర్కీల మీదుగా పశ్చిమ యూరప్‌ దేశాలకు గ్యాస్‌ తీసుకొస్తోంది. ప్రస్తుతం గ్యాస్‌ కోసం పూర్తిగా రష్యా మీద ఆధారపడుతున్న బల్గేరియాకూ గ్రీస్‌ నుంచి పైపులైనును పొడింగించే ప్రతిపాదన ఉంది. సముద్రమార్గం గుండా వచ్చే ఎల్‌ఎన్జీని నిల్వ చేయడానికి గ్రీస్‌ ఓ కొత్త గిడ్డంగిని నిర్మించనుంది. 1970లలో చమురు సంక్షోభం ఏర్పడినప్పుడు ఐరోపా, అమెరికాలు చమురు నిల్వకు బృహత్తర భూగర్భకేంద్రాలను నిర్మించాయి. ఇపుడు ఉక్రెయిన్‌ సంక్షోభంతో గ్యాస్‌ గిడ్డంగుల నిర్మాణ ప్రతిపాదనా ముందుకొస్తోంది.


750 మైళ్ల పైపులైను

రష్యా నుంచి బాల్టిక్‌ సముద్రగర్భం ద్వారా జర్మనీ వరకు వేసిన 750 మైళ్ల పైపులైను నిర్మాణం గత సెప్టెంబరులోనే పూర్తయింది. ఉక్రెయిన్‌పై పుతిన్‌ తాజాచర్యతో ఈ పైపులైను నిరుపయోగంగా మారనుంది. జర్మనీ ఇంధన అవసరాల్లో నాలుగోవంతును సహజవాయువే తీరుస్తోంది. అందులో సగం రష్యా నుంచి వస్తోంది. తమ దేశంలో మిగిలిన మూడు అణు విద్యుత్కేంద్రాలతోపాటు బొగ్గు ఆధారిత థర్మల్‌ విద్యుత్కేంద్రాలనూ క్రమంగా మూసివేస్తున్న జర్మనీ 2045కల్లా శిలాజ ఇంధనాల వాడకానికి పూర్తిగా స్వస్తిచెప్పి.. సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధన వనరులకు మారాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతవరకు కాలుష్యరహిత సహజవాయువు వినియోగాన్ని కొనసాగించాలని భావించింది. ఇంతలో ఉక్రెయిన్‌ సంక్షోభం వచ్చిపడటంతో జర్మనీ ప్రణాళికకు విఘాతం కలగనుంది.


- ఈనాడు ప్రత్యేక విభాగం


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని