Ukraine Crisis: దొనెట్స్క్‌, లుహాన్స్క్‌పై ఎందుకీ రచ్చ?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన ఒక్క ప్రకటనతో దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. కొద్దివారాలుగా రగులుతున్న ఉక్రెయిన్‌ వివాదంలో.....

Updated : 23 Feb 2022 05:23 IST

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేసిన ఒక్క ప్రకటనతో దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ ప్రాంతాలపై ప్రపంచ దేశాల దృష్టి పడింది. కొద్దివారాలుగా రగులుతున్న ఉక్రెయిన్‌ వివాదంలో ఇప్పుడు ఇవి కేంద్రబిందువుగా మారాయి. వీటిని స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించడం ద్వారా పుతిన్‌ ఒక్కసారిగా ఉద్రిక్తతలను తారస్థాయికి తీసుకెళ్లారు. ‘శాంతిసేన’ పేరుతో ఆ ప్రాంతాల్లోకి సైన్యాన్నీ పంపేందుకు సన్నద్ధమవుతున్నారు. దీంతో అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌లో భాగంగా గుర్తించిన ప్రాంతాలను తన కబ్జాలోకి తీసుకునేందుకు రష్యా ప్రయత్నిస్తోందన్న ఆందోళన అమెరికా, ఐరోపా దేశాల్లో వ్యక్తమవుతోంది.

పారిశ్రామిక హబ్‌

రష్యా సరిహద్దుల వెంబడి  తూర్పు ఉక్రెయిన్‌లో డాన్‌బాస్‌ ప్రాంతం ఉంది. అందులో దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లు అంతర్భాగాలు. పారిశ్రామిక హబ్‌గా డాన్‌బాస్‌ పేరుగాంచింది. అక్కడ మైనింగ్‌ ఎక్కువగా సాగుతోంది.

* దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లో రష్యన్‌ భాషను మాట్లాడేవారు అధికంగా ఉన్నారు.

2014లో రష్యా.. క్రిమియాను ఆక్రమించింది. అదే సమయంలో దొనెట్స్క్‌, లుహాన్స్క్‌ల్లో మూడొంతుల భూభాగాలను రష్యా మద్దతున్న వేర్పాటువాదులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. ఆ ప్రాంతాలకు దొనెట్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ (డీపీఆర్‌), లుహాన్స్క్‌ పీపుల్స్‌ రిపబ్లిక్‌ (ఎల్‌పీఆర్‌)లుగా పేర్లు పెట్టి, స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు.

అప్పటి నుంచి  తిరుగుబాటుదారులకు, ఉక్రెయిన్‌ సైన్యానికి మధ్య జరుగుతున్న పోరులో 14వేల మంది చనిపోయారు. అయితే డీపీఆర్‌, ఎల్‌పీఆర్‌లను ఇప్పటివరకూ ఏ దేశమూ స్వతంత్ర ప్రాంతాలుగా గుర్తించలేదు. ఇప్పుడు రష్యా ఆ పనిచేసింది. నిజానికి వీటికి చాలాకాలంగా ఆ దేశం ఆర్థిక, సైనిక సాయం అందిస్తోంది. అక్కడ వేల మందికి పాస్‌పోర్టులు కూడా మంజూరు చేసింది.

ఇప్పుడెందుకు వీటిపై దృష్టి?

* ఉక్రెయిన్‌లోని 4.1 కోట్ల మంది జనాభాలో ఎక్కువ మంది పశ్చిమ దేశాల వైపు మొగ్గుతున్నారు. ఇప్పుడు దొనెట్స్క్‌, లుహాన్స్క్‌లకు స్వతంత్రత కట్టబెట్టడం ద్వారా ఉక్రెయిన్‌ దృక్కోణాన్ని మార్చాలన్నది పుతిన్‌ వ్యూహం.
* ఈ ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ అది సరిగా అమలు కావడంలేదని అంతర్జాతీయ పర్యవేక్షకులు చెబుతున్నారు. అక్కడ భారీగా హింస జరుగుతోంది. వేర్పాటువాద ప్రాంతాల్లోని రష్యా పాస్ట్‌పోర్టుదారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని చెబుతూ తదుపరి చర్యకు పుతిన్‌ వ్యూహరచన చేస్తున్నట్లు భావిస్తున్నారు. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో ఇప్పటికే భారీగా రష్యా సైనికులు మోహరించారు.
* డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యాకు, ఉక్రెయిన్‌కు మధ్య సాంస్కృతిక యుద్ధం కూడా జరుగుతోంది. అక్కడ రష్యన్‌ భాష మాట్లాడేవారిని ఉక్రెయిన్‌ జాతీయవాదం నుంచి రక్షించాల్సిన అవసరం ఉందని పుతిన్‌ సర్కారు వాదిస్తోంది.

పశ్చిమ దేశాలకు ఆసక్తి ఎందుకు?

ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు దిగొచ్చన్న అమెరికా హెచ్చరికలు నిజమైతే.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో చెలరేగిన పెను భద్రత సంక్షోభంగా అది నిలుస్తుంది. 2014లో క్రిమియా ఆక్రమణ, తూర్పు ఉక్రెయిన్‌లో జరిగిన పోరుతో తలెత్తిన ఉద్రిక్తతలను మించిన స్థాయిలో ఇప్పుడు వేడి పెరుగుతుంది.
* రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌ను నిలబెట్టేందుకు పశ్చిమ దేశాలు చాలామేర పెట్టుబడులు పెట్టాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఆ దేశానికి మద్దతుగా నిలిచింది. ప్రపంచ బ్యాంకు, ఈయూ, అమెరికా నుంచి వందల కోట్ల డాలర్లు ఉక్రెయిన్‌కు అందాయి. అమెరికా భారీగా రుణ పూచీకత్తులు, సైనిక సాయం అందించింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని