Azadi Ka Amrit Mahotsav: మన్నెంలో వీరబొబ్బిలి గాండ్రింపు

ఆయన బొబ్బిలిలో పుట్టారు. మన్యంలో పెరిగారు. పులులు సంచరించే ప్రాంతంలో పెద్దపులిలా ఎదిగారు. అల్లూరికి ముందే తిరుగుబావుటా ఎగరేశారు. అమాయక గిరిజనులకు

Updated : 22 Apr 2022 05:35 IST

ఆయన బొబ్బిలిలో పుట్టారు. మన్యంలో పెరిగారు. పులులు సంచరించే ప్రాంతంలో పెద్దపులిలా ఎదిగారు. అల్లూరికి ముందే తిరుగుబావుటా ఎగరేశారు. అమాయక గిరిజనులకు ఆరాధ్యుడయ్యారు. వారికి పోరాట పంథాను నేర్పించారు. ప్రకృతి ఆలంబనగా పరాక్రమించారు. బ్రిటిషర్ల పాలిట సింహస్వప్నమయ్యారు. ఆయనే... ద్వారబంధాల చంద్రయ్య.

విజయనగరం జిల్లా బొబ్బిలి... ద్వారబంధాల చంద్రయ్య జన్మస్థలం. పూర్వ తూర్పుగోదావరి ప్రస్తుత అల్లూరి సీతారామరాజు జిల్లా మన్యంలోని రేఖపల్లిలో స్థిరపడ్డారు. ఆరడుగుల నిండైన విగ్రహంతో, గుబురు మీసాలతో ఉండే చంద్రయ్య... అన్యాయాన్ని ఏమాత్రం సహించేవారు కాదు. తన ఆశ్రయం పొందిన అభాగ్యులను రక్షించే క్రమంలో బ్రిటిషర్ల దాష్టీకాన్ని అయిదేళ్లపాటు వీరోచితంగా ఎదిరించారు. ఆయన్నుంచి తప్పించుకోవడానికి వారు ఒకానొక సమయంలో నది మధ్యలో పడవల్లో తలదాచుకోవాల్సి వచ్చిందంటే చంద్రయ్య సామర్థ్యం అర్థం చేసుకోవచ్చు.

అగ్గి అంటుకుంది అక్కడే!

శబరి నదికి ఒకవైపు రేఖపల్లి, మరోవైపు కూనవరం ఉంటాయి. వీటికి కొద్దిదూరంలో ఉండే కుంట గ్రామంలో ప్రతివారం సంత జరుగుతుంది. అక్కడికి చుట్టుపక్కల గ్రామాలు, గూడేల నుంచి కోయలు వస్తారు. తమ అవసరాలకు సరిపడా వస్తువులను మార్పిడి చేసుకుని వెళతారు. అత్యంత నిరుపేదలైన కోయలకు ఒంటిపై ధరించడానికి దుస్తులు లేకపోవడంతో పెద్దపెద్ద ఆకులను చుట్టుకునే వారు. ఇలాంటి ఓ కోయ యువతిని కొందరు బ్రిటిష్‌ సైనికులు లైంగికంగా వేధించారు. కోపోద్రిక్తులైన కోయదొరలు సైనికులపై తిరగబడ్డారు. అనంతరం బ్రిటిషర్ల దాడి భయంతో కోయలు రేఖపల్లిలోని ద్వారబంధాల చంద్రయ్యను ఆశ్రయించారు. కోయలను వెంబడిస్తూ వచ్చిన సైనికులు అక్కడికి రాగా చంద్రయ్య వారందరినీ తరిమికొట్టారు. ఈ సంఘటన 1874లో జరిగింది.

శ్రీరామగిరిపై తిరుగుబావుటా

చంద్రయ్య శౌర్యసాహసాల గురించి ఆరా తీసిన బ్రిటిషర్లు... ఆయన్ని తుదముట్టించేందుకు అశ్వదళం, మందుగుండు సామగ్రితో రేఖపల్లికి సమీపంలోని రుద్రమ్మకోట అనే ప్రాంతానికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న చంద్రయ్య తన అనుచరులతో కలిసి మెరుపుదాడి చేసి, మందుగుండుకు నిప్పు అంటించడంతో సైనికులు కంగుతిన్నారు. కాళ్లకు పనిచెప్పారు. మనగడ్డపై పరాయి దేశస్థుల పెత్తనాన్ని సహించని చంద్రయ్య... మన్యం ప్రజలను ఏకం చేయడానికి పూనుకున్నారు. ఈక్రమంలోనే మధ్యమధ్యలో బ్రిటిషర్లపై మెరుపుదాడులు చేస్తూ వారిని గంగవెర్రులెత్తించారు. మరోవైపు ఆయన ప్రోద్బలంతో ప్రజలు ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం మానేశారు. ఇది చాలదన్నట్లు చంద్రయ్య ఎప్పుడు విరుచుకుపడి, ఏమి చేస్తారో తెలియని స్థితిలో ఆంగ్లేయ అధికారులు... తమ తుపాకులు, తూటాలు, రికార్డులు, ఆహార పదార్థాలు, ధనాన్ని పడవల్లో భద్రపరచుకుని, గోదావరి మధ్యలో లంగరు వేసుకుని ఉండేవారు. వడ్డెగూడెం సమీపంలోని శ్రీరామగిరిని కేంద్రంగా చేసుకుని దాడులు జరుగుతున్నట్లు నిర్ధారించుకున్న సైనికాధికారులు... ఒకరోజు గోదావరి మీదుగా పదుల సంఖ్యలో పడవల్లో చేరుకున్నారు. చంద్రయ్య దళం ఉన్న గుట్టను ఆక్రమించేందుకు అర్ధరాత్రి పూట చుట్టుముట్టారు. అప్పటికే కుట్రను పసిగట్టిన చంద్రయ్య, ఆయన అనుచరులు... సిద్ధంగా ఉన్నారు. ఆంగ్లేయ సైనికులు గుట్టను ఎక్కడం మొదలు పెట్టగానే పెద్దపెద్ద బండరాళ్లను కిందికి దొర్లించడం ప్రారంభించారు. ఊహించని ఈ పరిణామంతో చాలామంది సైనికులు గాయపడ్డారు. వారి పడవలూ విరిగిపోవడంతో బతుకుజీవుడా అంటూ మరోసారి పారిపోయారు.

చంద్రయ్యను ఎలాగైనా హతమార్చాలని కసితో ఉన్న తెల్లదొరలు... వేగుల సమాచారంతో 1879లో అడ్డతీగలలో చుట్టుముట్టారు. అక్కడ ఏకంగా మూడు రోజులపాటు సాగిన సంకుల సమరంలో అనుచరులు ఒక్కొక్కరుగా ఒరిగిపోతున్నా ఆయన మాత్రం ధైర్యం వీడలేదు. చిట్టచివరికి బ్రిటిషర్ల తుపాకీ గుళ్లకు నేలకొరిగిన చంద్రయ్య వీరమరణం పొందారు. భవిష్యత్‌ తరాల విప్లవయోధులకు దారిచూపే వేగుచుక్కగా నింగికెగశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని