Updated : 01 May 2022 06:21 IST

Azadi Ka Amrit Mahotsav: గాంధీ కార్మిక ధర్మయుద్ధం

దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు వచ్చిన గాంధీజీకి తొలి పరీక్ష కార్మికలోకం నుంచే ఎదురైంది. అందులో ఆయన ఉత్తీర్ణులవడంతో పాటు కార్మికులను, యజమానులను కూడా గెలిచేలా చేయడం విశేషం.

ప్పటి బొంబాయి రాష్ట్రంలో రెండో అతిపెద్ద పట్టణంగా ఎదిగిన అహ్మదాబాద్‌ ఆధునిక వస్త్ర పరిశ్రమలకు పేరొందింది. అనేక మిల్లులతో పారిశ్రామిక కేంద్రంగా కళకళలాడుతుండేది. 1915 సంవత్సరంలో భారత్‌కు వచ్చిన గాంధీజీ అహ్మదాబాద్‌నే తన స్థావరంగా మలచుకున్నారు. అయితే 1917లో వాతావరణ విపత్తులతోపాటు ప్లేగు మహమ్మారి అహ్మదాబాద్‌ను అతలాకుతలం చేసింది. పట్టణ జనాభాలో 10% ప్రజలు మృత్యువాత పడ్డారు. చాలామంది బతికితే చాలనుకొని నగరాన్ని విడిచిపెట్టసాగారు. వీరిలో వస్త్ర పరిశ్రమ కార్మికులూ ఉన్నారు. కార్మికులు వెళ్లిపోతే వ్యాపారం దెబ్బతింటుందనే ఉద్దేశంతో మిల్లు యజమానులు... జీతాలకు అదనంగా 80% మహమ్మారి పరిహారంగా చెల్లించారు. 1918 జనవరిలో ప్లేగు తగ్గుముఖం పట్టగానే ఈ పరిహారాన్ని ఉపసంహరించారు. అయితే... అప్పటికే మొదటి ప్రపంచయుద్ధం కారణంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తమై ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. తమ జీతాలను 50% పెంచాలంటూ కార్మికులు పట్టుబట్టారు. యజమానులు ససేమిరా అనడంతో కార్మికులు సమ్మెకు దిగారు. వారిని భయపెట్టేందుకు యజమానులు కొందరు కార్మికులను ఉద్యోగాల్లోంచి తీసేశారు. ఏకంగా బొంబాయి నుంచి కార్మికులను తీసుకురావడం ప్రారంభించారు.

సమ్మె కాలంలో మధ్యవర్తిత్వ చర్చలు

దిక్కుతోచని కార్మికులు సామాజిక కార్యకర్త అనసూయ సారాభాయ్‌ని సంప్రదించారు. ఆమె అహ్మదాబాద్‌ మిల్లు యజమానుల సంఘం అధ్యక్షుడు అంబాలాల్‌ సారాభాయ్‌కి స్వయనా సోదరి అవుతారు. తనకు తానుగా ఏమీ చేయలేని అనసూయ సమస్యను గాంధీజీ ముందుంచారు. మిల్లు యజమానుల్లో చాలామంది గాంధీజీకి సన్నిహితులు. అంబాలాల్‌ సారాభాయ్‌ కూడా ఆయనకు మిత్రుడే. అయినా గాంధీజీ కార్మికుల పక్షానే నిల్చున్నారు. ఇరుపక్షాలూ మధ్యవర్తిత్వ మండలి (ఆర్బిట్రేషన్‌ బోర్డు) ద్వారా చర్చించుకుని, సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. చర్చలు ప్రారంభమైనా... పరస్పర అపనమ్మకం కారణంగా ముందుకు సాగలేదు. దీంతో సమ్మె కొనసాగింది. గాంధీజీ సైతం సమ్మెకే మద్దతిచ్చారు. అయితే హింసకు తావులేకుండా అహింసా పద్ధతిలో సాగాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ కార్మికులకు గాంధీజీ ఆశ్రమంలో వివిధ పనుల్లో శిక్షణ కూడా ఇచ్చేవారు. పౌరులు ఉద్యోగాలపైనే కాకుండా అవసరమైతే తమ కాళ్లపై తాము నిలబడేలా చేయాలన్నది ఆయన ఉద్దేశం.

యాజమాన్యాల తాయిలం

జీతాలను 50% కాకుండా 20% పెంచుతామని మిల్లుల యజమానులు తాయిలం విసిరారు. కార్మికులు పనికి రాకుంటే మిల్లులను మూసేస్తామంటూ కొన్నింటికి లాకౌట్‌ ప్రకటించారు. మిల్లుల పరిస్థితిని, బయట ఆర్థిక స్థితిగతులను బేరీజు వేసిన గాంధీజీ... 35% పెంపుదల ఇవ్వాలని ప్రతిపాదించారు. యజమానులు అంగీకరించలేదు. గాంధీజీపై నమ్మకంతో కార్మికులు సమ్మెను అహింసా పద్ధతిలో కొనసాగించినా... రోజురోజుకూ పరిస్థితి దిగజారడం మొదలైంది. చాలామంది కార్మికులు ఇల్లు గడవక ఇబ్బంది పడసాగారు. ఈ దశలో కొందరు సమ్మె విరమించి యజమానులిస్తామన్న 20శాతానికే అంగీకరించి పనిలో చేరడానికి మొగ్గు చూపారు. కానీ... గాంధీజీ వారిని వారించారు.

భారత్‌లో తొలిసారి ఉపవాస దీక్ష

కార్మికుల అశక్తతను అర్థం చేసుకున్న మహాత్ముడు భారత్‌లో తొలిసారిగా తన ఉపవాస అస్త్రాన్ని ప్రయోగించారు. సమస్య పరిష్కారమయ్యే దాకా తాను ఆహారం ముట్టనంటూ ప్రతిజ్ఞ చేసి,  కఠిన నిరశన దీక్ష చేపట్టారు. దీంతో యజమానులు పునరాలోచించారు. మూడోరోజు అంబాలాల్‌ సారాభాయ్‌... కార్మికులతో చర్చలకు ముందుకొచ్చారు. అయితే భవిష్యత్‌లో మళ్లీ ఎన్నడూ కార్మికుల తరఫున పోరాడబోనని గాంధీజీ మాటివ్వాలని షరతు విధించారు. దాన్ని ఆయన నిరాకరిస్తూనే... ప్రొఫెసర్‌ ఆనంద్‌శంకర్‌ ధ్రువ మధ్యవర్తిత్వంలో పరిష్కారం జరగాలని సూచించారు. అంతా సరే అనడంతో... 1918 మార్చి 18న గాంధీజీ దీక్ష విరమించారు. ఆయన సూచించినట్లుగానే 35% జీతం పెంపుదలకు ఒప్పందం కుదిరింది. అహ్మదాబాద్‌ కార్మికుల 25 రోజుల సత్యాగ్రహ ధర్మయుద్ధం విజయవంతమైంది. కార్మికులు రాజీపడకుండా, యజమానులు ఓడిపోయామనుకోకుండా సమస్య సామరస్యంగా పరిష్కారమైంది.


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని