లంకను ముంచిన అప్పులు!

మునుపెన్నడూ ఎరుగని తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. తినడానికి సరిగా తిండి కూడా లేక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఇంధనం, కరెంటు వంటివీ అందుబాటులో లేకపోవడంతో అల్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో కదంతొక్కుతున్నారు. దీంతో ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లంకలో ఇంతటి ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలను ఓసారి పరిశీలిస్తే..

Updated : 10 May 2022 06:44 IST

మునుపెన్నడూ ఎరుగని తీవ్రస్థాయి ఆర్థిక సంక్షోభంతో శ్రీలంక ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతోంది. తినడానికి సరిగా తిండి కూడా లేక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఇంధనం, కరెంటు వంటివీ అందుబాటులో లేకపోవడంతో అల్లాడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలతో కదంతొక్కుతున్నారు. దీంతో ప్రధాని మహీంద రాజపక్స తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో లంకలో ఇంతటి ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలను ఓసారి పరిశీలిస్తే..

రుణాల ఊబి

గత రెండు దశాబ్దాల్లో శ్రీలంక క్రమంగా విదేశీ అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 2005లో ఆ దేశం అప్పు 1,130 కోట్ల డాలర్లుగా ఉండగా.. ఆ మొత్తం 2010 నాటికి 2,170 కోట్ల డాలర్లకు, 2015లో 4,390 కోట్ల డాలర్లకు, 2020లో 5,630 కోట్ల డాలర్లకు పెరిగింది. ఈ రుణాల్లో చైనా వాటా 10% కాగా, భారత్‌ వాటా 2%. దేశ జీడీపీ కంటే వేగంగా అప్పుల భారం పెరిగిపోవడం లంకను తీవ్రంగా దెబ్బకొట్టింది.

విదేశీ మారక నిల్వల కొరత

లంకలో ప్రస్తుత సర్కారుతో పాటు గత ప్రభుత్వమూ ఆర్థిక క్రమశిక్షణ పాటించడంలో విఫలమయ్యాయి. ఫలితంగా ఆ దేశం వద్ద విదేశీ మారక నిల్వలు వేగంగా క్షీణించాయి. ప్రస్తుతం శ్రీలంక ఖజానాలో ఉన్న విదేశీ మారక నిల్వల విలువ కేవలం 231 కోట్ల డాలర్లు. ఫలితంగా- చక్కెర, పప్పుధాన్యాలు, చమురు వంటి ఉత్పత్తుల దిగుమతులకు సొమ్ము చెల్లించలేకపోయింది. ఇది దేశంలో నిత్యావసరాల కొరతకు కారణమైంది.

బలహీనపడ్డ కరెన్సీ

అమెరికా డాలరుతో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ ఈ ఏడాదే 50% పైగా క్షీణించింది. ఒక డాలరును కొనుగోలు చేసేందుకు జనవరిలో 200 శ్రీలంక రూపాయలు అవసరం కాగా.. ఇప్పుడు అందుకు 300 రూపాయలు చెల్లించాల్సి వస్తోంది. లంక సెంట్రల్‌ బ్యాంకు లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 31 మధ్య వరకు శ్రీలంక రూపాయి విలువ భారత రూపాయితో పోలిస్తే 31.6%, యూరోతో పోలిస్తే 31.5%, పౌండ్‌తో పోలిస్తే 31.1% తగ్గింది.

ధరల పెరుగుదల

ఆర్థిక వ్యవస్థ తీవ్ర కుదుపులకు లోనవడంతో ఆ ప్రభావం లంకలో నిత్యావసరాల ధరలపైనా పడింది. ఏడాది క్రితంతో పోలిస్తే దేశంలో బియ్యం ధర 60%, ఉల్లి రేటు 79%, బంగాళాదుంప ధర 66%, కోడిగుడ్డు ధర 93% పెరిగింది. 2022 ఫిబ్రవరిలో 15.1%గా ఉన్న ద్రవ్యోల్బణం నెల తిరిగేసరికి 18.7 శాతానికి పెరిగింది.

పర్యాటక రంగం కుదేలు

లంక ప్రధాన ఆర్థిక వనరుల్లో పర్యాటక రంగం ఒకటి. దేశ జీడీపీలో 10% పైగా వాటా దానిదే. 2019లో చోటుచేసుకున్న వరుస బాంబు పేలుళ్లు ఆ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. అనంతరం కొవిడ్‌ మహమ్మారి విజృంభణతో పరిస్థితులు మరింత క్షీణించాయి. పర్యాటకం పూర్తిగా కుదేలైంది.

వ్యవసాయ సంక్షోభం

వ్యవసాయాన్ని పూర్తిగా సేంద్రియ బాట పట్టించాలన్న లక్ష్యంతో గత ఏడాది లంక ప్రభుత్వం రసాయనిక ఎరువులను నిషేధించింది. ఫలితంగా దేశంలో పంటల దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా వరి, చక్కెర దిగుబడులు ఘోరంగా పడిపోవడంతో రసాయనిక ఎరువులపై తమ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.

పడిపోయిన విదేశీ పెట్టుబడులు

గత మూడేళ్లలో లంకకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల  రాక గణనీయంగా తగ్గుముఖం పట్టింది. దేశంలో ఎఫ్‌డీఐలు 2018లో 1,600 కోట్ల డాలర్లుగా ఉండగా.. అది 2019లో కేవలం 79.3 కోట్ల డాలర్లుగా, 2020లో మరింత తగ్గి 54.8 కోట్ల డాలర్లుగా నమోదైంది.

దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌ సంక్షోభం

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడిచమురు, పొద్దుతిరుగుడు నూనె, గోధుమల వంటి ఉత్పత్తుల ధర భారీగా పెరిగింది. వాటిని కొనుగోలు చేయలేక లంక చేతులెత్తేసింది.

- ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని