Updated : 23 May 2022 10:14 IST

గుట్టు చెప్పిన గులకరాయి!

సౌరవ్యవస్థ ఆవిర్భావానికి ముందు  విశ్వంలో భారీ పేలుడు

ధూళితో కలిసి శిలగా ఏర్పడిన గ్యాస్‌ అణువులు

భూ వాతావరణంలోకి వేల ఏళ్ల తర్వాత ‘హైపాటియా’ శిల

ఈజిప్ట్‌లో లభించిన బుల్లి రాయిపై పరిశోధనలో వెల్లడి

తీగ లాగితే డొంక కదిలిన చందంగా, ఈజిప్టులో లభించిన ఓ గులకరాయి... విశ్వంలో చోటుచేసుకున్న ఓ భారీ పేలుడుకు సంబంధించిన రహస్యాలను బయటపెడుతోంది! ఈ రాయి అసలు మన సౌరవ్యవస్థకు చెందినదే కాదని; మన సౌరవ్యవస్థ పురుడు పోసుకోవడానికి ముందే ఇది ఏర్పడిందని పరిశోధకులు కచ్చితమైన నిర్ధారణకు వచ్చారు.

ఈజిప్ట్‌ నైరుతి భాగంలో లభించిన ఓ గులకరాయి... జొహన్నెస్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులను ఆకట్టుకుంది. విభిన్నంగా కనపడుతూ వారిలో ఆసక్తి రేకెత్తించింది. దీన్ని నిశితంగా పరీక్షించిన శాస్త్రవేత్తలు తమకు ఓ రాయి లభించిందని, ఇది భూగ్రహానికి చెందినది కాదని 2013లో ప్రకటించారు. ఆ తర్వాత రెండేళ్లకు- ఇది కనీసం ఇప్పటివరకూ అవగాహన ఉన్న ఉల్క లేదా తోకచుక్కలకు కూడా చెందినది కాదని నిర్ధారించారు. తాజాగా ఇప్పుడు... ఈ రాయి హైపాటియా అనే శిలకు చెందినదని, మన సౌరవ్యవస్థ ఆవల సంభవించిన ‘సూపర్నోవా’ మాదిరి భారీ పేలుడు కారణంగా ఇది ఏర్పడిందని నిర్ధారణకు వచ్చారు.

ఇదీ రాయి కథ...
‘‘మన సూర్యుడికి అయిదు రెట్లు అధికంగా ద్రవ్యరాశి ఉండే ఓ అంతరిస్తున్న నక్షత్రం కారణంగా కొన్ని వేల సంవత్సరాల కిందట ఓ భారీ పేలుడు సంభవించింది. విశ్వంలో చోటుచేసుకున్న భారీ పేలుళ్లలో ఇది కూడా ఒకటి. ఈ విస్ఫోటనం సద్దుమణిగిన తర్వాత... పేలుడు కారణంగా వెలువడిన గ్యాస్‌ అణువులు సమీపంలోని ధూళి కణాలకు అతుక్కోవడం ప్రారంభించాయి. మిలియన్ల సంవత్సరాల తర్వాత, మన సౌరవ్యవస్థ ఉద్భవించడానికి ముందు... ఇవి ‘హైపాటియా’ శిలగా మారాయి. కాలక్రమంలో ఈ మాతృశిల భూమివైపు దూసుకెళ్లడం ఆరంభించింది. భూ వాతావరణంలో దీని ప్రవేశ తాపానికి నైరుతి ఈజిప్ట్‌లోని ‘ద గ్రేట్‌ శాండ్‌ సీ’ ఒత్తిడి ప్రభావం తోడై... ఈ శిల విచ్ఛిన్నానికి, సూక్ష్మ పరిమాణంలో వజ్రాలు ఉద్భవించడానికి దారితీసింది.

అలా భూమికి చేరిన ఈ హైపాటియా రాయిలో... మన సౌరవ్యవస్థలో ఇప్పటివరకూ ఏ పదార్థంలోనూ కనిపించని నికెల్‌ ఫాస్పైడ్‌ను కనుగొన్నాం. ప్రోటాన్‌ మైక్రోప్రోబ్‌ను ఉపయోగించి, ఈ రాయిలో 15 రకాల విభిన్న మూలకాలు ఉన్నట్టు అత్యంత కచ్చితత్వంతో గుర్తించాం’’ అని జొహన్నెస్‌బర్గ్‌ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ జాన్‌ క్రామెర్స్‌ పేర్కొన్నారు.

- ఈనాడు ప్రత్యేక విభాగం


 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని