భరణం లేక.. బతికేదెలా!

జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారి తీసున్నాయి. ఇలాంటి అత్యధిక కేసుల్లో భరణం ఇవ్వడానికి భర్తలు నిరాకరిస్తుండడం మహిళలకు

Updated : 27 Jul 2022 09:02 IST

భారీగా పెరుగుతున్న విడాకుల కేసులు

భార్యలకు భరణమివ్వడానికి ముఖం చాటేస్తున్న మాజీ భర్తలు

సమిధలుగా మారుతున్న పిల్లలు

ఈనాడు, విశాఖపట్నం: జీవితాంతం కలిసి ఉండాల్సిన భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి విడాకులకు దారి తీసున్నాయి. ఇలాంటి అత్యధిక కేసుల్లో భరణం ఇవ్వడానికి భర్తలు నిరాకరిస్తుండడం మహిళలకు శాపంలా మారుతోంది. అత్యధిక విడాకుల కేసుల్లో మహిళలే ఆర్థికంగా చితికిపోతున్నారు. పిల్లల భారాన్ని వారే మోస్తుండడంతో వారి పోషణకు నానా అవస్థలు పడుతున్నారు. విజయవాడ కేంద్రంగా మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్న ‘వాసవ్య మహిళా మండలి’ చేసిన అధ్యయనంలో పలు విషయాలు వెలుగు చూశాయి. వివిధ న్యాయస్థానాల నుంచి వారు సేకరించిన సమాచారం ప్రకారం 2018 నుంచి 2020 వరకు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే దేశ వ్యాప్తంగా 3,70,801 భరణం కేసులు దాఖలయ్యాయి. వాటిలో 41,934 కేసుల్లో బాధిత మహిళలకు అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. అభిప్రాయ బేధాలతో విడిపోయినప్పటికీ చాలా కేసుల్లో మహిళలు పిల్లల్ని పోషించుకుంటూ మరో వివాహం చేసుకోకుండా జీవించడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో పాటు, పిల్లల పోషణకు అవసరమైన ఖర్చులను చట్టప్రకారం భర్త ఇవ్వకతప్పదు. ‘భరణం’ పేరుతో ఇవ్వాల్సిన ఆ మొత్తం ఇవ్వకుండా.. రకరకాల కారణాలు చెప్పి చాలా మంది కాలయాపన చేస్తున్నారు. దీంతో మళ్లీ బాధిత మహిళలు న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఇలా తప్పించుకుంటున్నారు..

* మాజీ భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో కొందరు ఉద్యోగాలు మానేసి తనకు ఆదాయం లేదని న్యాయస్థానాలకు పత్రాలు సమర్పిస్తున్నారు.

* స్థిరాస్తుల జోలికి రాకుండా.. విడాకులు ఇవ్వగానే వారి పేరుతో ఉన్న ఆస్తులను ఇతర కుటుంబ సభ్యుల పేరున మార్చేస్తున్నారు.

* కొందరైతే వారి చిరునామా తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. వారి ఆచూకీ కోసం మళ్లీ పోలీసులను ఆశ్రయించాల్సి వస్తోంది.

* కొందరు భర్తలు భార్యలకు తెలియకుండానే తప్పుడు చిరునామాతో విడాకుల నోటీసులు పంపి... అనంతరం ఆమె న్యాయస్థానానికి రావడంలేదన్న సాకుతో ఎక్స్‌పార్టీ డిక్రీ పొందుతున్న ఉదంతాలూ ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో బాధిత మహిళలు భరణం పొందే హక్కునూ కోల్పోతున్నారని అధ్యయనం గుర్తించారు.


దయనీయంగా బాధిత మహిళల పరిస్థితి

‘‘న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులను చాలా మంది మాజీ భర్తలు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. విడాకులు మంజూరైన తరువాత ఆర్థికంగా చితికిపోయి, తిండికీ ఇబ్బందులుపడుతూ... తల్లులతో పాటు వారి పిల్లలూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. పిల్లలు చదువులకు కూడా దూరం కావాల్సి వస్తోంది. లోక్‌అదాలత్‌ తరహాలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి వారి సమస్యను పరిష్కరించాలి. వంద మంది బాధిత మహిళలతో పాటు పలువురు న్యాయ నిపుణులతో మాట్లాడి తయారు చేసిన అధ్యయన నివేదికను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపాం’’

- డాక్టర్‌ కీర్తి బొల్లినేని, అధ్యక్షురాలు, వాసవ్య మహిళా మండలి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని