Andhra news: ప్రజలపై మరో వడ్డన!

రాష్ట్రప్రభుత్వం మరో వడ్డనకు సిద్ధమవుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న స్థలాల మార్కెట్‌ విలువలు పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ సమయాత్తమవుతోంది. ఈ శాఖ నుంచి వెళ్లిన

Updated : 30 Jul 2022 06:51 IST

రహదారుల వెంబడి ఖాళీ స్థలాల మార్కెట్‌ విలువల పెంపు?

సంప్రదాయానికి భిన్నంగా ‘ప్రత్యేక రివిజన్ల’ పేరుతో ప్రజలపై భారం!

ఈనాడు - అమరావతి

రాష్ట్రప్రభుత్వం మరో వడ్డనకు సిద్ధమవుతోంది. జాతీయ, రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న స్థలాల మార్కెట్‌ విలువలు పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ సమయాత్తమవుతోంది. ఈ శాఖ నుంచి వెళ్లిన ఆదేశాల మేరకు జాతీయ, రాష్ట్ర రహదారుల శాఖలు, మండల తహసీల్దార్‌ కార్యాలయాల నుంచి జిల్లా స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. వీరి ప్రతిపాదనల ఆధారంగా ఉన్నతాధికారులు ఎప్పటి నుంచి అమలుచేయాలన్న దానిపై నిర్ణయాన్ని తీసుకుంటారు. ప్రజలపై ఆర్థికభారం పెంచడంపైనే రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ ప్రత్యేకదృష్టిని కేంద్రీకరించింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మూడుసార్లు మార్కెట్‌ విలువలను సవరించింది. ఇప్పుడు నాలుగోసారీ సిద్ధమైంది. రాష్ట్రంలో జాతీయ రహదారులు 7,300 కిలోమీటర్లు, రాష్ట్ర రహదారులు 13,500 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. ఈ మార్గాల్లోని ప్రధాన కూడళ్లు, పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు, అభివృద్ధి ఆధారంగా సర్వే నంబర్లను గుర్తించి ప్రస్తుత మార్కెట్‌ విలువలు ఎలా ఉన్నాయి? రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి? బహిరంగ మార్కెట్‌ విలువలు ఎలా ఉన్నాయి? భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు పెరిగితే ఎంత మొత్తం రావొచ్చన్న దానిపై అంచనాలు సిద్ధమవుతున్నాయి. మార్కెట్‌ విలువలు పెరిగేకొద్దీ.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగి రాష్ట్ర ఖజానా నిండుతుంది.

సంప్రదాయానికి తిలోదకాలు
ప్రతియేటా ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి పట్టణాల్లో మార్కెట్‌ విలువలను సవరిస్తారు. 2020లో చివరిగా మార్కెట్‌ విలువలను సవరించారు. కొవిడ్‌ కారణంగా 2021లో సవరించలేదు. రెండేళ్లకోసారి ఆగస్టు ఒకటి నుంచే గ్రామీణ ప్రాంతాల్లోని మార్కెట్‌ విలువలనూ సవరిస్తారు. ఈ సంప్రదాయానికి తిలోదకాలిచ్చి.. డిమాండు ఆధారంగా, ఖజానా అవసరాల ప్రాతిపదికన విలువలను పెంచేస్తున్నారు. జిల్లాలకు తాజాగా జారీచేసిన ఉత్తర్వుల్లో... రహదారుల వెంబడి మార్కెట్‌ విలువలు ఓపెన్‌ మార్కెట్‌ కంటే చాలా తక్కువగా ఉన్నాయని, దీనివల్ల రాష్ట్రానికి ఆదాయం రాకుండా పోతోందని, దీన్ని సవరించేందుకు ప్రతిపాదనలు పంపాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ సూచించింది.

నిర్దిష్టమైన విధానం లేదు
మార్కెట్‌ విలువల ఖరారులో స్టాంపులు, రిజిస్ట్రేషన్‌ శాఖ తొలి నుంచీ నిర్దిష్టమైన విధానాన్ని అనుసరించడంలేదు. ఆగస్టు 1కి ముందు హడావుడిగా మార్కెట్‌ విలువలు పెంచేసి, ప్రజలపై భారం పెంచుతున్నారు. 2021లో స్పష్టత తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా రెవెన్యూ, ఇరిగేషన్‌, వ్యవసాయ, పంచాయతీరాజ్‌, పరిశ్రమలు, గృహనిర్మాణ, మత్స్యశాఖ, పట్టణ ప్రణాళిక, ఇతర శాఖల నుంచి వివరాలు సేకరించారు. లేఅవుట్లు, జాతీయ రహదారికి అనుకుని ఉన్న రోడ్లు, వ్యవసాయ భూములు, వీటికి ఉన్న నీటిపారుదల, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకొని విభజించిన గ్రిడ్స్‌ ఆధారంగా మార్కెట్‌ విలువల సవరణకు ప్రయత్నాలు జరిగాయి. కొద్దికాలానికే ఈ చర్యలు మరుగున పడ్డాయి.


ఎప్పుడంటే... అప్పుడే

* ఈ ఏడాది ఫిబ్రవరి 1న కొత్త జిల్లాల విభజనకు ముందే గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ విలువలను పెంచారు.

* ఏప్రిల్‌లో రాష్ట్రంలోని 11 కొత్త జిల్లా కేంద్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలను జాతీయ రహదారులు, దుకాణాలు, సమీపంలో ఉన్న పరిశ్రమలు, ఇతర అంశాల ఆధారంగా మార్కెట్‌ విలువలను సవరించారు. కొత్త జిల్లా కేంద్రాల్లో అక్కడి డిమాండును బట్టి మార్కెట్‌ విలువల్లో 13% నుంచి 75% వరకు పెంచారు.

* ఆకాశహర్మ్యాల వరకు అన్నిరకాల నిర్మాణాల మార్కెట్‌ విలువలను రాష్ట్ర ప్రభుత్వం జూన్‌ 1 నుంచి పెంచింది. సినిమాహాళ్లు, మిల్లులు, కర్మాగారాలు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపైనా వడ్డించింది. తాటాకు, కొబ్బరాకులు,  గుడిసెలపైనా చదరపు అడుగుకు అదనంగా రూ.10 చొప్పున బాదేసింది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా.. ప్రస్తుత విలువలపై సగటున 5% చొప్పున ప్రభుత్వం పెంచింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని