‘తెలంగాణపై’ నిఘా నేత్రం

అయిదు టవర్లు.. ఒకేసారి లక్ష సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు భారీ వీడియోవాల్‌.. 30 పెటాబైట్ల సామర్థ్యం ఉన్న సర్వర్లు.. కృత్రిమ మేధ వినియోగం.. డీజీపీ, కమిషనర్‌ ఛాంబర్లు.. ఓ టవర్‌పైన హెలిప్యాడ్‌.. హైదరాబాద్‌ నగర

Updated : 31 Jul 2022 06:21 IST

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం

అయిదు టవర్లుగా నిర్మాణం

తెరపై ఏకకాలంలో లక్ష కెమెరాల దృశ్యాలు

30 పెటాబైట్స్‌ సామర్థ్యమున్న సర్వర్లు

ఈనాడు, హైదరాబాద్‌

అయిదు టవర్లు.. ఒకేసారి లక్ష సీసీ కెమెరాల దృశ్యాలను వీక్షించేందుకు భారీ వీడియోవాల్‌.. 30 పెటాబైట్ల సామర్థ్యం ఉన్న సర్వర్లు.. కృత్రిమ మేధ వినియోగం.. డీజీపీ, కమిషనర్‌ ఛాంబర్లు.. ఓ టవర్‌పైన హెలిప్యాడ్‌.. హైదరాబాద్‌ నగర నడిబొడ్డున నిర్మించిన పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రత్యేకతలివి. రాష్ట్రంలో ఏ మూలన ఉన్న సీసీ కెమెరాలో నిక్షిప్తమైన దృశ్యాలనైనా ఇక్కడ వీక్షించవచ్చు. శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా.. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడూ కీలక శాఖలను ఇక్కడి నుంచి అప్రమత్తం చెయ్యొచ్చు. ఈ కేంద్రంలో ఏర్పాటుచేసిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తే పోలీసింగ్‌లో దేశానికే తలమానికంగా నిలవనుంది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ మరిన్ని విశేషాలపై ప్రత్యేక కథనం..


* హైదరాబాద్‌లో బ్యాంకు దోపిడీకి పాల్పడ్డ అంతర్రాష్ట్ర ముఠా వాహనంలో ముంబయి వైపు పారిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. ముంబయి మార్గంలోని రహదారుల్ని జల్లెడపట్టి సదాశివపేట దాటి వెళ్తున్న దొంగల వాహనాన్ని హైదరాబాద్‌లోని యంత్రాంగం గుర్తించింది. జహీరాబాద్‌ పోలీసులను అప్రమత్తం చేయడంతో ఆ మార్గంలో బారికేడ్లను ఏర్పాటు చేసి దొంగల్ని పట్టుకున్నారు.


* గోదావరి పొంగిపొర్లుతోంది. పరీవాహక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వరదలో ఓ కుటుంబం చిక్కుకుపోయింది. హైదరాబాద్‌లోని యంత్రాంగం దీన్ని గుర్తించి.. స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేసింది. రెస్క్యూ బృందం హుటాహుటిన అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని కాపాడింది..

-కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం అందుబాటులోకి వచ్చాక భవిష్యత్తులో పోలీసింగ్‌లో రానున్న మార్పులివి.


హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12లో ఏడెకరాల్లో నిర్మించిన కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఈ కేంద్రం అందుబాటులోకి రావడంతో తెలంగాణ పోలీసింగ్‌లో సాంకేతిక వినియోగం కొత్త పుంతలు తొక్కనుంది. ఈ సెంటర్‌ ఏర్పాటు పనులకు 2016లో శ్రీకారం చుట్టారు. సుమారు రూ.600 కోట్లతో నిర్మించారు. తెలంగాణ పోలీసులకు మూడో నేత్రంలా ఉపయోగపడనుంది. 


ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌.. అనలిటికల్‌ సాఫ్ట్‌వేర్‌

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(కృత్రిమ మేధ) సాంకేతికత వినియోగించి దృశ్యాలను విశ్లేషించనున్నారు. ఉదాహరణకు ఎవరైనా అనుమానితుడు రాష్ట్రంలోకి వచ్చినట్లు సమాచారముంటే చాలు.. అతడి ఫొటోను డేటాతో అనుసంధానం చేస్తారు. అతడు రాష్ట్రంలోని ఏ సీసీ కెమెరా పరిధిలోకి వచ్చినా కృత్రిమ మేధ పరిజ్ఞానం ద్వారా సమీపంలోని పోలీసులను కంప్యూటరే అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి అనలిటికల్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కెమెరాల్ని గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఎక్కువగా ఏర్పాటు చేసి.. సెంటర్‌కు అనుసంధానించనున్నారు. ఆటోమేటిక్‌ వెహికిల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌తో కూడిన కెమెరాలను మరింత నిశితంగా విశ్లేషించి ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడేవారిని గుర్తించనున్నారు. పీటీజడ్‌(360 డిగ్రీల కోణంలో తిరిగే) కెమెరాల ఫీడ్‌నూ సమర్థంగా విశ్లేషించనున్నారు.

లక్ష కెమెరాల బాహుబలి వీక్షణం

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఒకేసారి లక్ష సీసీ కెమెరాల్లో నమోదయ్యే దృశ్యాలు చూడగలిగే సామర్థ్యం గల భారీ వీడియోవాల్‌ అందుబాటులోకి రానుంది. 100 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు కానున్న 10 లక్షల సీసీ కెమెరాల్ని(ఇప్పటికే 9.21 లక్షలున్నాయి) ఈ కేంద్రానికి అనుసంధానించనున్నారు. అన్ని కెమెరాల ఫీడ్‌ను ప్రత్యేక ఐపీ అడ్రస్‌ ద్వారా లాగినై ఆన్‌లైన్‌లో ఈ కేంద్రంలో వీక్షించనున్నారు.

డేటా సెంటర్‌లో బెల్జియం సర్వర్లు

డిజిటల్‌ స్టోరేజీ అంటే మనకు మెగా బైట్లు(ఎంబీ), గిగా బైట్ల(జీబీ)ల్లోనే తెలుసు. సాధారణంగా ఒక సినిమాను నిక్షిప్తం చేసేందుకు ఒక జీబీ స్టోరేజీ అవసరం పడుతుంది. దాదాపు 10 లక్షల సీసీ కెమెరాల ఫీడ్‌ను నిక్షిప్తం చేయడమంటే సాధారణ విషయం కాదు. ఇందుకోసం నాలుగో అంతస్తులో భారీ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేశారు. బెల్జియం, జర్మనీ దేశాల నుంచి భారీ సర్వర్లను తెప్పిస్తున్నారు. ఇవి సుమారు 30 పెటాబైట్ల సామర్థ్యంతో కూడినవి. అంటే సుమారు అర కోటి సినిమాలను భద్రపరిచే సామర్థ్యం ఉన్నవి. సీసీ కెమెరాల ఫీడ్‌ ఈ డేటాసెంటర్‌లో దాదాపు నెల రోజులపాటు అందుబాటులో ఉండనుంది.


అయిదు టవర్లు

కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో అయిదు టవర్లున్నాయి. వీటి గోడలను 3 లక్షల చదరపు అడుగుల మేర గాజు పలకలతో తీర్చిదిద్దారు. ఇందుకోసం 5,200 గాజు ప్యానళ్లను వినియోగించారు.

* టవర్‌ ‘ఎ’ 20, టవర్‌ ‘బి’ 16, టవర్‌ ‘సి’ 3, టవర్‌ ‘డి’ 2 అంతస్తుల్లో ఉన్నాయి. టవర్‌ ‘ఈ’లోని 4-7 అంతస్తుల్లో కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ఉంది.

టవర్‌ ‘ఎ’:  అన్ని టవర్లలో ఇదే ఎత్తైనది. 20 అంతస్తుల్లో 1.4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. దీనిలోని 4వ అంతస్తులో డీజీపీ ఛాంబర్‌, 7వ అంతస్తులో ప్రముఖుల ఛాంబర్‌, 18వ అంతస్తులో హైదరాబాద్‌ కమిషనర్‌ ఛాంబర్‌ ఉంటాయి. ఈ టవర్‌లోనే 550 వర్క్‌స్టేషన్లలో నగర పోలీస్‌ విభాగాలుంటాయి. టవర్‌ పైభాగంలో 15 సీట్ల సామర్థ్యం ఉండే అగస్టా వెస్ట్‌ల్యాండ్‌- ఏడబ్ల్యూ139 దిగేందుకు అనువుగా హెలిప్యాడ్‌ను నిర్మించారు.

టవర్‌ ‘బి’:  ఇందులో 580 వర్క్‌స్టేషన్లున్నాయి. పోలీస్‌శాఖలో కీలకమైన ఐటీ విభాగం ఇక్కడ కొలువుదీరనుంది. ఇతర శాఖల ఉన్నతాధికారులకూ కార్యాలయాలు ఉంటాయి. అత్యవసర సమయాల్లో ఇక్కడి వార్‌ రూంలోనే ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తారు. 14వ అంతస్తులో తెలంగాణ ప్రాశస్త్యాన్ని చాటేలా మ్యూజియం ఏర్పాటుచేస్తారు.

టవర్‌ ‘సి’:  సమావేశాలు, సమీక్షల నిర్వహణకు 480 సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం నిర్మించారు.

టవర్‌ ‘డి’:  125 సీట్ల సామర్థ్యం గల మీడియా సమావేశ మందిరముంది. ఇందులో ఆధునిక  సాంకేతికతతో, విద్యుద్దీపాలతో కూడిన ఆడియో విజువల్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్రాడ్‌కాస్టర్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా లైవ్‌స్ట్రీమింగ్‌ సదుపాయం కల్పించారు.

* ఎ, బి టవర్లను 14వ అంతస్తులో దేశంలోనే అత్యంత బరువైన స్కైవాక్‌ వంతెన(400 మెట్రిక్‌ టన్నులు)తో అనుసంధానించారు. 60 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ వంతెన పైభాగంలో సోలార్‌ ఫొటోవోల్టాయిక్‌ ప్యానెళ్లతో కూడిన కప్పు ఏర్పాటు చేశారు. ఇది 0.55 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది.

6.42 లక్షల చదరపు అడుగులు

మొత్తం ప్రాజెక్టు నిర్మాణం 6.42 లక్షల చదరపు అడుగుల్లో ఉంది. బేస్‌మెంట్‌ ఏరియా 2.16 లక్షలు, సూపర్‌ స్ట్రక్చర్‌ ఏరియా 4.26 లక్షల చదరపు అడుగుల్లో ఉంది. 10 ప్యాసింజర్‌ లిఫ్ట్‌లు, 2 సర్వీస్‌ లిఫ్ట్‌లున్నాయి.

మురుగునీటి శుద్ధి కేంద్రం

నిత్యం 180 కిలోలీటర్ల మురుగునీటిని శుద్ధిచేసే ఎస్టీపీ అందుబాటులో ఉంది. ఈ నీటిని ల్యాండ్‌స్కేప్‌ కోసం వినియోగించనున్నారు. మొత్తం ప్రాజెక్టులో 35 శాతం ప్రాంతాన్ని పచ్చదనం కోసం కేటాయించారు.

299 కార్లు పార్కింగ్‌ చేయొచ్చు

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో భారీ స్థాయిలో వాహనాల పార్కింగ్‌ సదుపాయం ఉంది. ఇక్కడ 299 కార్లు, 316 ద్విచక్ర వాహనాలను నిలపవచ్చు. బేస్‌మెంట్లలో మరో 300 వాహనాల కోసం పార్కింగ్‌ సదుపాయాన్ని విస్తరించేందుకు అవకాశముంది.

* టవర్లలోని కింద అంతస్తులను ప్రజాప్రయోజనార్థం వినియోగించనున్నారు. వీటిలో ఆడిటోరియం, కెఫే, మల్టీపర్పస్‌ హాల్‌, మీడియా సెంటర్‌, రిసెప్షన్‌ లాబీలున్నాయి.

Read latest Eenadu exclusive News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts