Omicran:పోదు కానీ.. ప్రభావం తగ్గుతుంది

కరోనా వైరస్‌ పాండమిక్‌ నుంచి ఎండెమిక్‌ దశకు చేరుకోబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అమెరికాలోని టెన్నెసీ వైద్య కళాశాలలో గౌరవ ఆచార్యుడు, వైరాలజిస్టు, శాస్త్రవేత్త రామారెడ్డి వి.గుంటక (80) అభిప్రాయపడ్డారు.

Updated : 26 Dec 2021 06:41 IST

 ఎండెమిక్‌గా మారనున్న కొవిడ్‌ 

 ఒమిక్రాన్‌ వ్యాప్తి ఎక్కువే.. అయినా ఆందోళన అక్కర్లేదు 

 ‘ఈనాడు-ఈటీవీ’ ఇంటర్వ్యూలో అమెరికాలోని టెన్నెసీ వైద్యకళాశాల గౌరవ ఆచార్యుడు రామారెడ్డి వి.గుంటక

ఇట్టా సాంబశివరావు

ఈనాడు - అమరావతి

కరోనా వైరస్‌ పాండమిక్‌ నుంచి ఎండెమిక్‌ దశకు చేరుకోబోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అమెరికాలోని టెన్నెసీ వైద్య కళాశాలలో గౌరవ ఆచార్యుడు, వైరాలజిస్టు, శాస్త్రవేత్త రామారెడ్డి వి.గుంటక (80) అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ పొందేవారు క్రమంగా పెరుగుతున్నందున కరోనా వైరస్‌లో కొత్తగా వచ్చే వేరియంట్ల ప్రభావం పరిమితంగానే ఉండబోతుందని చెప్పారు. జనాభాలో కనీసం 80% మందికి టీకా ఇవ్వగలిగితే కొవిడ్‌ వైరస్‌ పాండమిక్‌ నుంచి ఎండెమిక్‌కు చేరుకున్నట్లే అవుతుందని తెలిపారు. ఈ స్థితి నాలుగైదు నెలల్లోనే రావచ్చని చెప్పారు. గతంలో సాధారణ జలుబు కరోనా వైరస్‌ల (229ఈ, హెచ్‌కేయూ1, ఓసీ-43, ఎన్‌ఎల్‌-63 వంటివి) వల్ల శ్వాసకోశ వ్యాధులతో చాలా మంది బాధపడ్డారని.. కాలక్రమంలో ఈ వైరస్‌లు ఎండెమిక్‌కు చేరుకున్నాయని గుర్తుచేశారు. కొవిడ్‌-19 విషయంలోనూ అలాగే జరగబోతుందని భావిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని ‘ఈనాడు-ఈటీవీ’కి ఆన్‌లైన్‌ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు.

* కరోనా వైరస్‌ ప్రభావం భారత్‌లో ఒకరకంగా.. విదేశాల్లో మరోరకంగా కనిపిస్తోంది? ఎందుకలా? 

భారత్‌లో కొవిడ్‌ కేసులు గణనీయంగా తగ్గుతుంటే.. అమెరికాలో రోజురోజుకీ కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌లో పారిశుద్ధ్యం, పరిశుభ్రత పరిస్థితులు భిన్నంగా ఉంటాయి. దీనివల్ల వివిధ రకాల వ్యాధికారక సూక్ష్మజీవులకు ప్రజలు ప్రభావితమై ఉన్నారు. రోగ నిరోధక శక్తిని జన్యుపరమైన అంశాలూ ప్రభావితం చేస్తున్నాయి. ఏ వ్యాధిలోనైనా సరే.. కొంతమంది ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కోవటం, బయటపడటం సాధారణంగా జరిగే ప్రక్రియ. కొవిడ్‌ వైరస్‌కు ఇదే వర్తిస్తుంది. ఆహార అలవాట్లు, ధూమపానం, మద్యపానంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు కొవిడ్‌-19 వైరస్‌ బారినపడిన వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వయసు ఇందులో కీలకపాత్ర పోషిస్తోంది. ఈ కారణాల వల్లనే ఆయా దేశాల్లో కొవిడ్‌ ప్రభావం రకరకాలుగా కనిపిస్తోంది. అయితే ఇప్పటి వరకు చిన్నపిల్లలపై కొవిడ్‌ ప్రభావం తక్కువగానే ఉంది.

* కొవిడ్‌ వైరస్‌ మహమ్మారి పూర్తిగా అంతమయ్యేదెప్పుడు?

ఏ వైరస్‌ పూర్తిగా అంతర్ధానం కాదు. జలుబు, శ్వాసకోశ వ్యాధులను కలగజేసే కరోనా వైరస్‌లు (కొవిడ్‌-19 వైరస్‌ కుటుంబానికి చెందినవి), రైనోవైరస్‌లు, అడినో వైరస్‌ మూడు, నాలుగేళ్లకు ఎండెమిక్‌గా మారాయి. కొవిడ్‌-19 చివరికి ఇదే విధంగా మారుతుంది. ఇప్పటి వరకు ప్రపంచంలో కేవలం రెండు వైరస్‌ వ్యాధులనే నిర్మూలించారు. మనుషుల్లో వచ్చే మశూచి (స్మాల్‌ పాక్స్‌), ఆవులు, గేదెల్లో వచ్చే రిండర్‌పెస్ట్‌ వ్యాధులను టీకాలు, నియంత్రణ చర్యల ద్వారా నిర్మూలించారు. దీని వెనుక ఎన్నో ఏళ్ల కృషి దాగుంది. ఒక వైరస్‌ కొత్తగా వచ్చినప్పుడు దాని పుట్టుపూర్వోత్తరాలు, సంక్రమణ తీరు, భవిష్యత్తులో ఎలా మారబోతుందో చెప్పేందుకు తీవ్రస్థాయిలో కృషి జరగాలి.

* ఇతర వైరస్‌లతో పోలిస్తే కరోనా ఎలా ఉంది?

ఇంతకుముందు వాటి కంటే కరోనా వైరస్‌లో ఉత్పరివర్తనాలు అసాధారణ రీతిలో కనిపిస్తున్నాయి. కరోనా వైరస్‌కు ఆర్‌ఎన్‌ఏ జీనోమ్‌ ఉంటుంది. సాధారణంగా ఆర్‌ఎన్‌ఏ జన్యువులున్న వైరస్‌ల్లో ఉత్పరివర్తనాల రేటు అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ ఉత్పరివర్తనాలు వస్తున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం.. కొవిడ్‌-19 వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో వచ్చే మార్పుల వల్ల వేరియంట్లను గమనిస్తున్నాం. వీటివల్ల వ్యాధిపై ప్రభావం కనిపిస్తోంది. 

* ఒమిక్రాన్‌ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి?

ఒమిక్రాన్‌ వేరియంట్‌ సోకినవారు వెంటనే కోలుకుంటారు. వ్యాక్సిన్‌ పొందనివారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై ఒమిక్రాన్‌ ప్రభావం కనిపిస్తోంది.

* బూస్టర్‌ డోసు వల్ల ఉపయోగం ఉంటుందా?

మూడో డోసు పొందడంవల్ల ఎంత ప్రయోజనం ఉంటుందన్న దానిపై శాస్త్రీయ ఆధారాలు ఇప్పటివరకు లేవు. అయితే రోగ నిరోధక వ్యవస్థకు సంబంధించిన వ్యాధులున్నవారికి, వృద్ధులకు సహజంగానే ఇమ్యూనిటీ తక్కువగానే ఉంటుంది. ఇలాంటి వారికి అవసరం అనుకుంటే.. బూస్టర్‌ డోసులో ప్రాధాన్యం ఇవ్వచ్చు.


డాక్టర్‌ రామారెడ్డి నేపథ్యం

కృష్ణాజిల్లా ఉయ్యూరు సమీపంలోని బోళ్లపాడు గ్రామానికి చెందిన రామారెడ్డి అమెరికాలో మైక్రోబయాలజీలో పీహెచ్‌డీ చేశారు. పోస్ట్‌ డాక్టోరల్‌ రీసెర్చి చేసి, పలు విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుడిగా, శాస్త్రవేత్తగా వివిధ హోదాల్లో పని చేశారు. అమెరికాలోని టెన్నెసీ వైద్య కళాశాలలో మైక్రోబయాలజీ, ఇమ్యూనాలజీ విభాగంలో గౌరవ ఆచార్యుడిగానూ, హైదరాబాద్‌లోని సుదర్శన్‌ బయోటెక్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్‌ను కలగజేసే సార్కోమా వైరస్‌, మలేరియా జ్వరాలకు కారణమైన ప్లాస్మోడియంపైనా, హెచ్‌ఐవీకి సంబంధించిన రెట్రో వైరస్‌ తదితరాలపై పరిశోధనలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని