gutka: గుట్కా కేరాఫ్‌ బీదర్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బీదర్‌ గుట్కా గుప్పుమంటోంది. ఏటా రూ.వేల కోట్ల అక్రమ వ్యాపారం నడుస్తోంది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ శివారులోని నౌబాద్‌ ప్రతాప్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో పాన్‌మసాలా తయారీ కర్మాగారాలను నెలకొల్పారు. వీటిల్లో కొన్నిచోట్ల గుట్టుగా గుట్కా ఉత్పత్తవుతోంది. ‘ఈనాడు’ బీదర్‌ జిల్లా

Updated : 06 Mar 2022 06:29 IST

 కర్మాగారాల్లో పాన్‌మసాలా మాటున ఉత్పత్తులు

తెలుగు రాష్ట్రాల్లోకి నిత్యం 500లకుపైగా వాహనాలు

‘ఈనాడు’ క్షేత్ర స్థాయి పరిశీలనలో వెల్లడి

మల్యాల సత్యం

ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బీదర్‌ గుట్కా గుప్పుమంటోంది. ఏటా రూ.వేల కోట్ల అక్రమ వ్యాపారం నడుస్తోంది. కర్ణాటక రాష్ట్రం బీదర్‌ శివారులోని నౌబాద్‌ ప్రతాప్‌నగర్‌ ఇండస్ట్రియల్‌ ఏరియాలో పాన్‌మసాలా తయారీ కర్మాగారాలను నెలకొల్పారు. వీటిల్లో కొన్నిచోట్ల గుట్టుగా గుట్కా ఉత్పత్తవుతోంది. ‘ఈనాడు’ బీదర్‌ జిల్లా వెళ్లి పరిశీలించగా ఆసక్తికర విషయాలు దృష్టికొచ్చాయి. పొగాకు కలవకపోతే పాన్‌మసాలాగా.. కలిస్తే గుట్కా అని స్థూలంగా వ్యవహరిస్తారు. ఏపీ, తెలంగాణలలో 2013లోనే ఈ రెండింటిపై నిషేధం విధించారు. కర్ణాటకలో గుట్కాపై మాత్రమే ఉంది. అందుకని బీదర్‌ జిల్లాలో చాలాచోట్ల పాన్‌మసాలా తయారీ ముసుగులో గుట్కా ఉత్పత్తి చేస్తున్నారు. బీదర్‌లో పరిశీలించినప్పుడు అక్కడ పాన్‌మసాలా తయారుచేసే ఓ కర్మాగారం ప్రహరీని ఆనుకుని ఉన్న నాలుగు వాహనాల్లో మూడు తెలంగాణ రిజిస్ట్రేషన్‌తో ఉన్నవి కనిపించాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం అక్కడ తయారయ్యేది గుట్కా. దానిని తెచ్చేందుకు వెళ్లిన వాహనాలవి. అలాగే కొన్ని కర్మాగారాల వారు సరకును అక్కడే ఉన్న చిద్రీరోడ్‌, పాతబస్తీ చిత్తేఖానాల్లోని హోల్‌సేల్‌ దుకాణాలకు తరలిస్తున్నారు. చిత్తేఖానాలోని మెయిన్‌బజార్‌లో ఈదుకాణాలు పదుల సంఖ్యలో ఉన్నాయి.

పాత పరిచయంతో వెళితే అడిగినంత సరకు ఇస్తున్నారు. కొత్తవారు వెళితే మాత్రం నిశితంగా ఆరా తీస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర నుంచి వచ్చినట్లు అనుమానమొస్తే గుట్కా విక్రయించట్లేదని చెప్పేస్తున్నారు.

90 శాతం బీదర్‌ నుంచే...

తెలంగాణాలో దొరికే సరకులో దాదాపు 90శాతం బీదర్‌ జిల్లా నుంచే అక్రమంగా వస్తోందని అంచనా. హైదరాబాద్‌కు ఇది కేవలం 100 - 130 కి.మీ.ల దూరంలోనే ఉండటంతో తెలంగాణకు చెందిన అక్రమార్కుల కన్ను ఆ ప్రాంతంపై పడింది. నిత్యం అక్కడికి వెళ్లి గుట్టుగా సరకు తెస్తున్నారు. దీని కోసం కార్లు, వ్యాన్ల వంటి వాటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాత్రివేళ లోడ్‌ చేసుకొని తెల్లారేసరికల్లా గమ్యం చేరిపోతున్నారు. ప్రతీరోజు సుమారు 500 వాహనాలు తెలుగు రాష్ట్రాల్లోకి సరకును తీసుకెళ్తుంటాయని స్థానికులు తెలిపారు.

అక్కడ రూపాయిన్నర.. ఇక్కడ రూ.10-15

బీదర్‌లో హోల్‌సేల్‌గా గుట్కా ప్యాకెట్‌ ఒక్కోటి రూపాయిన్నరకే దొరుకుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నిషేధం ఉండటానికి తోడు డిమాండ్‌ విపరీతంగా ఉండటంతో ఒక్కోటి రూ.10-15లకు విక్రయిస్తున్నారు. పాన్‌డబ్బాలు, కిరాణాదుకాణాలు, కూరగాయల షాపులు.. ఇలా తేడా లేకుండా అమ్మేస్తున్నారు. పోలీసులు అడపాదడపా దాడులు చేసి సరకును స్వాధీనం చేసుకుంటున్నా అది నామమాత్రమే.

నిశితంగా అధ్యయనం చేస్తున్నాం: బీదర్‌ ఎస్పీ

గుట్కాపై బీదర్‌ ఎస్పీ డెక్కా కిషోర్‌బాబు వద్ద ‘ఈనాడు’ ప్రస్తావించింది. ‘నెల క్రితమే నేను విధుల్లో చేరా. బీదర్‌ నుంచి గుట్కా అక్రమ రవాణాపై పెద్దఎత్తున ప్రచారముంది. దానిపై నిశితంగా అధ్యయనం చేస్తున్నాం. నాలుగు రోజుల క్రితం బసవకళ్యాణ్‌ నుంచి గుట్కాలోడ్‌తో తెలంగాణ వెళ్తున్న లారీని పట్టుకున్నాం. రాబోయే రోజుల్లో నిఘా విస్తృతం చేస్తాం..’ అని చెప్పారు.


అడ్డదారుల్లో అక్రమరవాణా

* బీదర్‌ నుంచి తెలంగాణాకు ప్రవేశించే మార్గంలో సంగారెడ్డి జిల్లా హోసెల్లి వద్ద సరిహద్దు తనిఖీ కేంద్రముంది. ఇటీవల ఓ రోజు రాత్రి దాదాపు మూడు గంటలపాటు పరిశీలిస్తే ఎలాంటి తనిఖీలు కనిపించలేదు.

* అసలు తనిఖీల గొడవెందుకని కొందరు వేరేదారులు వెతుకుతున్నారు. హైదరాబాద్‌-ముంబయి జాతీయరహదారిని తప్పించుకునేందుకు హోసెల్లి నుంచి న్యాల్‌కల్‌.. మీదుగా కంకోల్‌ చౌరస్తా వద్దకు చేరుకొని సంగారెడ్డి, పటాన్‌చెరు మీదుగా హైదరాబాద్‌లోకి వస్తున్నారు.

* హైదరాబాద్‌ ఓఆర్‌ఆర్‌ మీదుగా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తున్నారు.

* న్యాల్‌కల్‌.. మెదక్‌.. మీదుగా సిద్దిపేట, కరీంనగర్‌, మంచిర్యాల ప్రాంతాలకు సరకు తీసుకెళ్తున్నారు.

* బీదర్‌ నుంచి జమ్గి.. సిర్గాపూర్‌.. పిట్లం మీదుగా నిజామాబాద్‌, కామారెడ్డికి దిగుమతి చేస్తున్నారు.

Read latest Eenadu exclusive News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని