TS News: చెట్టుకు గొడ్డలి పెట్టు

అడవితల్లి గుండెలపై గొడ్డలి పోట్లు పడుతున్నాయి.. శేషాచలం ప్రాంతంలో ఎర్రచందనం చెట్ల నరికివేత నేపథ్యంలో ఇటీవల విడుదలైన పుష్ప సినిమా.. స్మగ్లర్ల తెగింపు ఏ రీతిలో ఉంటుందో చూపింది.

Updated : 02 Jan 2022 05:03 IST

అడవి తల్లికి గుండెకోత

గోదావరి, ప్రాణహిత నదీ తీర ప్రాంతాల్లో కలప స్మగ్లర్ల దందా

పోడు, మైనింగ్‌ కోసమూ గుట్టల్ని కరిగిస్తున్న వైనం

‘ఈనాడు’ క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడి

సుతారపు సోమశేఖర్‌

ఈనాడు - హైదరాబాద్‌

వాయిపేట అటవీ ప్రాంతంలో టేకుచెట్టుపై గొడ్డలి వేటు

అడవితల్లి గుండెలపై గొడ్డలి పోట్లు పడుతున్నాయి.. శేషాచలం ప్రాంతంలో ఎర్రచందనం చెట్ల నరికివేత నేపథ్యంలో ఇటీవల విడుదలైన పుష్ప సినిమా.. స్మగ్లర్ల తెగింపు ఏ రీతిలో ఉంటుందో చూపింది. రాష్ట్రంలోని అడవుల్లోనూ అలాంటి స్మగ్లర్లు కొందరు తిష్ఠ వేశారు. అరణ్యాల మధ్యలో మంచెలపైనే మకాం వేసి..  కనిపించిన చెట్టునల్లా నరికేస్తున్నారు.. అడవి ఆనుపానులపై పట్టు.. అధికారుల కళ్లుగప్పగల చాకచక్యం ఉండడంతో వారి దందాకు అడ్డు లేకుండా పోతోంది.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు, మారుమూల అటవీప్రాంతాల్లో కలప స్మగ్లర్లు చెలరేగిపోతున్నారు. గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదీతీరాల నుంచి విలువైన కలపను సరిహద్దులు దాటిస్తున్నారు. మరికొన్ని చోట్ల పోడుసాగు కోసం కూడా అడవిని నరికేస్తున్నారు. వరంగల్‌ అర్బన్‌, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ‘ఈనాడు’ ప్రతినిధి పర్యటించగా ఇలాంటి విధ్వంసాలెన్నో కన్పించాయి.

ఆగని అటవీ విధ్వంసం

రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం హరితహారం పేరుతో రూ.వేల కోట్లు ఖర్చు పెడుతోంది. కోట్లాది మొక్కల్ని నాటిస్తోంది. మరోవైపు దశాబ్దాల క్రితం నాటి అడవులు అక్రమార్కుల స్వార్థంతో క్షీణించిపోతున్నాయి. ఉదాహరణకు రాష్ట్రంలోని భౌగోళిక విస్తీర్ణంలో అటవీప్రాంతం 24 శాతం (దస్త్రాల ప్రకారం)గా ఉంటే, వరంగల్‌ అర్బన్‌లో అది 2.3 శాతమే. అయినప్పటికీ ఈ జిల్లాలోని నాలుగు మండలాల పరిధిలో 4,800 ఎకరాల్లో విస్తరించిన ధర్మసాగర్‌(దేవనూరు) అడవులపై కన్నేసిన మైనింగ్‌ మాఫియా ధ్వంసానికి పాల్పడుతోంది. నేలవేము, నేల ఉసిరి వంటి ఔషధ మొక్కలు, టేకు చెట్లున్న గుట్టల్లో ఇనుప ఖనిజం, గ్రానైట్‌ కోసం వాటిని వేళ్లతో సహా పెకలిస్తోంది. రైళ్ల పట్టాల కింద స్లీపర్లుగా గతంలో వాడిన గట్టి కలప నార వేప చెట్లు అంతరించే దశకు చేరాయక్కడ.

సిరికొండ మండలంలో టేకు చెట్లను నరకడంతో పాటు ఓ చెట్టుపై స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న మంచె

మూడు రాష్ట్రాల సరిహద్దులో

భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం దమ్మూరు అంతర్రాష్ట్ర సరిహద్దు. గ్రామానికి పక్కనే ఓవైపు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో  సరిహద్దు. గోదావరి, ఇంద్రావతి నదుల సంగమం. దట్టమైన అటవీప్రాంతం కావడంతో పెద్దఎత్తున కలప దందా సాగుతోంది. దమ్మూరు, లెంకలగడ్డ, సర్వాయిపేటల నుంచి ఎక్కువగా తరలుతోంది. ‘ఈనాడు’ ప్రతినిధి క్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు దమ్మూరులో నది ఒడ్డున అటవీ ప్రాంతంలో దాచిపెట్టిన టేకు దుంగలు పెద్దసంఖ్యలో కనిపించాయి. ‘స్మగ్లర్లు వర్షాకాలంలో తెప్పలు కట్టి సరిహద్దు దాటిస్తారు. గోదావరిలో నీరు లేనప్పుడు ఎడ్లబండ్లలో, వాహనాల్లో రవాణా చేస్తారు. మంథని, కరీంనగర్‌, భూపాలపల్లి, ఏటూరునాగారం, వరంగల్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాలకు తరలిస్తారని’ స్థానిక గిరిజనులు తెలిపారు. పలిమెల, సర్వాయిపేటలో దుంగల్ని ముక్కలుగా మార్చే కలపకోత మిషన్లను అధికారులు మూయించడంతో దందా కొంత తగ్గినా రహస్యంగా సాగుతోంది.

వేగంగా క్షీణిస్తున్న అడవి

ఆదిలాబాద్‌ జిల్లా సిరికొండ మండలంలో 20 ఏళ్లలో 15 వేల ఎకరాలకుపైగా అటవీభూమి అన్యాక్రాంతమైంది. కలపను అమ్ముకోవడం, పోడు సాగుతో అధికనష్టం వాటిల్లుతోంది. వాయిపేట అటవీ సెక్షన్‌లో మూడేళ్లలో ఐదుగురు అటవీ అధికారులపై వేటు పడింది. గతేడాది నుంచి సిరిచెల్మ రేంజ్‌లోనే రూ.9 లక్షల విలువైన కలప పట్టుబడింది. భీంపూర్‌ వెళ్లే మార్గంలో భారీ ఎత్తున టేకు చెట్లు నేలకొరుగుతున్నాయి. అధికారులు, నేతల సహకారంతో టేకు ఫర్నిచర్‌గా మారి పట్టణాలు, నగరాలకు తరలి పోతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.

పట్టుబడుతున్నా.. పదేపదే

లారీలు, జీపులు, ట్రాక్టర్ల వంటి వాహనాలను స్మగ్లర్లు కలప అక్రమ రవాణాకు వాడుతున్నారు. మూడేళ్లలోనే 4,289 వాహనాలు అక్రమ కలపను తరలిస్తూ పట్టుబడ్డాయి. 23,772 కేసుల్లో కలపను అక్రమంగా తరలిస్తున్నవారిని గుర్తించి కేసులు పెట్టారు. 8,786 కేసుల్లో ముద్దాయిలు ఎవరో గుర్తించలేదు.

వాయిపేట అటవీ ప్రాంతంలో నేలవాలిన టేకు చెట్లు


మందేసి.. అడ్డంగా నరికేసి..

నిర్మల్‌ జిల్లా కడెం మండలంలో టేకు, నల్లమద్ది, నెమలినార వంటి వృక్షాలతో దట్టంగా ఉండే అల్లంపల్లి అటవీప్రాంతం ప్రస్తుతం బక్కచిక్కుతోంది. గ్రామంలోకి వెళ్లే రహదారి పక్కనే విధ్వంసం కనిపిస్తోంది. అక్కడే మద్యం సీసాలు పడి ఉండటం, ఎత్తుగా మంచెలు నిర్మించి ఉండటాన్ని బట్టి స్మగ్లర్లు అక్కడే తిష్ఠవేసినట్టు అర్థంచేసుకోవచ్చు.


‘మహా’ తరలింపు

దమ్మూరు, సర్వాయిపేట అడవుల నుంచి రాత్రివేళ వాహనంలో తరలిస్తున్న టేకు దుంగలు

ప్రాణహిత నది మీదుగా మహారాష్ట్ర సరిహద్దు మండలాలైన కోటపల్లి, చెన్నూరు మీదుగా గోదావరిఖని నుంచి హైదరాబాద్‌కు కలప అక్రమంగా తరలివస్తోంది. కొద్దిరోజుల క్రితమే రూ.4 లక్షల విలువైన కలపను పట్టుకున్నారు. మంచిర్యాల జిల్లా భీమారం కలప డిపోలోనే స్వాధీనం చేసుకున్న కోటిన్నర విలువైన కలప దుంగలు, పదుల సంఖ్యలో వాహనాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని