Buddhavanam: కనుల ముందే బుద్ధ చరితం

అది బౌద్ధ దార్శనికుడు, రెండో బుద్ధుడిగా పేరొందిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అని మారుమోగిన ప్రాంతం. ఆగ్నేయాసియాకు బౌద్ధాన్ని విస్తరింపజేసిన ముఖద్వారం.

Updated : 28 Dec 2021 05:14 IST

 నాగార్జునుడు నడయాడిన నేల.. ఉట్టిపడే బౌద్ధ శిల్పకళ

ఆధ్యాత్మికతకు తోడుగా ప్రకృతి సౌందర్యం

ప్రారంభానికి సిద్ధమైన బుద్ధవనం ప్రాజెక్టు

నాగార్జునసాగర్‌ నుంచి ‘ఈనాడు’ ప్రతినిధి

బుద్ధవనం ప్రాజెక్టు

అది బౌద్ధ దార్శనికుడు, రెండో బుద్ధుడిగా పేరొందిన ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేల. ‘బుద్ధం శరణం గచ్ఛామి’ అని మారుమోగిన ప్రాంతం. ఆగ్నేయాసియాకు బౌద్ధాన్ని విస్తరింపజేసిన ముఖద్వారం. అంతటి విశిష్ట, చారిత్రక నేపథ్యమున్న ప్రాంతంలో చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. కృష్ణమ్మ ఒడ్డున.. ఎత్తైన కొండల పక్కన.. చుట్టూ పచ్చదనంతో.. ఆహ్లాదకర వాతావరణంతో ఆకట్టుకుంటోంది. నాగార్జునసాగర్‌లోని హిల్‌ కాలనీలో అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకున్న ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేయనుంది. ఇక్కడి బుద్ధుడి శిల్పాలు, బౌద్ధ చిహ్నాలు ధ్యానాన్ని ప్రేరేపించిన అనుభూతి కలిగిస్తాయి.

274 ఎకరాల విస్తీర్ణంలో..

బుద్ధవనం ప్రాజెక్టును 274.28 ఎకరాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. ఒకవైపు బుద్ధుని జీవిత ఘట్టాల శిల్పాలతో అలంకరించిన బుద్ధ చరితవనం.. మరోవైపు సిద్ధార్థుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు పరిపూర్ణతను సాధించడానికి ఆచరించిన 10 పారమితలను ప్రతిబింబించే జాతకవనం.. ఇంకొంచెం ముందుకు వెళితే ధ్యానవనం.. అందులో శ్రీలంక ప్రభుత్వం బహూకరించిన 27 అడుగుల బుద్ధుని శిల్పం.. దమ్మభూషణ వినిపించే గంట.. సందర్శకులను మైమరపింపజేస్తాయి. బుద్ధుడు బోధించిన జీవన విధానాన్ని తెలిపే శిల్పాలు చూపు మరల్చనివ్వవు. బుద్ధవనంలోని మహాస్తూపం.. దేశంలోనే అరుదైన బౌద్ధ వారసత్వ కట్టడంగా కీర్తి గడించింది. కింది అంతస్తులో ప్రాచీన బౌద్ధ శిల్ప కళాఖండాలున్న ప్రదర్శనశాల, సమావేశ మందిరం, ఆచార్య నాగార్జునుడి పంచలోహ విగ్రహం ఉన్నాయి. మొదటి అంతస్తులో అష్టమంగళ చిహ్నాలు, సిద్ధార్థ గౌతముని అయిదు ప్రధాన జీవిత ఘట్టాలను సూచించే ఆయక స్తంభాలు.. వేదిక, అండం చుట్టూ అలంకరించిన అద్వితీయ బౌద్ధ శిల్ప కళాఖండాలు.. వాటిలో ఆచార్య నాగార్జునుడు, ధర్మచక్ర పరివర్తన ముద్రలో బుద్ధుడు.. తార, మైత్రేయనాథ, భవచక్ర శిల్పాలను ఆళ్లగడ్డ శిల్పులు తీర్చిదిద్దారు.

చరిత వనంలో బుద్ధుడు

* బుద్ధవనం ఆధ్యాత్మికంగానే కాదు ప్రకృతి పర్యాటకుల్నీ ఆకర్షించనుంది. చెట్ల మధ్యలోంచి ఇటీవల నడకబాట వేశారు. దాని వెంట ఒకటిన్నర కి.మీ. నడుచుకుంటూ వెళ్తే.. మధ్యమధ్యలో చిన్నపాటి దీవుల్ని తలపించే కొండలు, చుట్టూ నీలి రంగు జలాలతో కృష్ణా నది అలరిస్తుంది. ఎత్తైన ప్రదేశం.. రాతి బండలపై నుంచి ఎటుచూసినా కృష్ణా జలాలే. దీన్ని ‘రివర్‌ వ్యూ టీ పాయింట్‌’గా అభివృద్ధి చేయాలని అధికారులు నిర్ణయించారు. బుద్ధవనం ప్రాంతంలో సంచరించే మనుబోతులు, దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు మరో ప్రత్యేక ఆకర్షణ.

మహాస్తూపం లోపలి భాగం


ముఖ్యమంత్రి సంకల్పంతో..

2001లో అప్పటి పర్యాటక అభివృద్ధి సంస్థ చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు అసంపూర్తిగా నిలిచిపోవడంతో దీన్ని పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరేళ్ల క్రితం సంకల్పించారు. మల్లేపల్లి  లక్ష్మయ్యకు బాధ్యతలు అప్పగించారు. నిధులు విడుదల చేశారు. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకట్టుకునేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం తీర్చిదిద్దింది.


అంతర్జాతీయ చిత్రపటంలోకి తీసుకెళ్తుంది

క్రీ.శ. 1-3వ శతాబ్దం వరకు బౌద్ధం విలసిల్లిన ప్రాంతమిది. మహాయానం విలసిల్లిన స్థలం. ఇక్కడికి సమీపంలోనే అప్పట్లో విశ్వవిద్యాలయం ఉండేది. బుద్ధవనం ప్రాజెక్టు తెలంగాణను అంతర్జాతీయ చిత్రపటంలోకి తీసుకెళుతుంది.

-మల్ల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి


తెలంగాణకే తలమానికం

300కిపైగా ప్రాచీన బౌద్ధ స్థావరాలతో నిండిన తెలుగునేలపై అప్పటి వైభవ ప్రాభవాలను, బౌద్ధ నైతిక విలువలను ఈ తరానికి అందించడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు తెలంగాణకు గర్వకారణం.

-డాక్టర్‌ ఈమని శివనాగిరెడ్డి, పురావస్తు పరిశోధకుడు, బుద్ధవనం కన్సల్టెంట్‌


రాష్ట్రానికి మరో మణిహారం

చిన్న చిన్న పనులు మినహా బుద్ధవనం పూర్తయింది. ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో ప్రారంభిస్తాం. తెలంగాణకు మరో మణిహారం కానుంది. విదేశీ పర్యాటకులను ఆకర్షించి ప్రాజెక్టుకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువస్తాం.

-శ్రీనివాస్‌గౌడ్‌, పర్యాటక శాఖ మంత్రి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని