UP Election Results 2022: భద్రతలో నీడై.. సంక్షేమంలో తోడై!

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అద్వితీయ విజయంలో సంక్షేమ పథకాలు, సురక్ష నినాదం, రైతు ప్రయోజనకర చర్యలది కీలక పాత్ర! ప్రచార పర్వంలో ఈ అంశాలనే పదేపదే ప్రస్తావించడం ద్వారా కమలనాథులు ఓటర్లను తమవైపు తిప్పుకొన్నారు.

Updated : 11 Mar 2022 06:22 IST

యూపీ ఓటర్లను ఆకట్టుకున్న కమలదళం

ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపా అద్వితీయ విజయంలో సంక్షేమ పథకాలు, సురక్ష నినాదం, రైతు ప్రయోజనకర చర్యలది కీలక పాత్ర! ప్రచార పర్వంలో ఈ అంశాలనే పదేపదే ప్రస్తావించడం ద్వారా కమలనాథులు ఓటర్లను తమవైపు తిప్పుకొన్నారు. తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ హయాం (2012-17) నాటి పరిస్థితులను, గత ఐదేళ్లలో తమ పాలనతో పలు అంశాల్లో పోల్చిచూపుతూ ప్రజలను ఆకట్టుకున్నారు.

పథకాల అమలుతో..: 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ మోదీ సర్కారు యూపీపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. పీఎం ఆవాస్‌ యోజన, పీఎం ఉజ్వల్‌ యోజన, పీఎం కిసాన్‌ నిధి యోజన, ముద్ర రుణాలు, పీఎం జీవన్‌ సురక్షా యోజన వంటి ప్రత్యక్ష ప్రయోజన పథకాల్లో రాష్ట్రానికి పెద్దపీట వేసింది. 2017లో రాష్ట్రంలోనూ భాజపా గద్దెనెక్కాక సంక్షేమ రాగం మరింత ఊపందుకుంది. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో కేంద్రంతో చేతులు కలిపిన యోగి సర్కారు 2020 తొలినాళ్ల నుంచి పేదలకు ఉచితంగా రేషన్‌ అందిస్తోంది. ఇందులో భాగంగా పేద కుటుంబాల్లో ఒక్కో వ్యక్తికి 5 కేజీల చొప్పున గోధుమలు, 5 కిలోల చొప్పున బియ్యం నెలనెలా అందజేస్తోంది. ఒక్కో కుటుంబానికి లీటర్‌ రిఫైన్డ్‌ నూనె, కిలో చక్కెర, కిలో ఉప్పు కూడా ప్రతినెలా అందుతున్నాయి. రాష్ట్రంలో 15 కోట్లమంది రెండేళ్లుగా ఈ ప్రయోజనాలను పొందుతున్నారు. సీఎం జన్‌ ఆరోగ్య యోజనతో 41.19 లక్షల మందికి జీవిత బీమాను యోగి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛనును రూ.500 నుంచి రూ.వెయ్యికి పెంచింది. సామూహిక వివాహ పథకంలో భాగంగా 1.52 లక్షలమంది యువతులకు వివాహం జరిపించింది. పీఎం ఆవాస్‌ యోజన, సీఎం ఆవాస్‌ యోజన పథకాల్లో భాగంగా రాష్ట్రంలో మొత్తం 43 లక్షల ఇళ్లను నిర్మించారు.

సురక్ష వాతావరణం కల్పించి..: 2012-17 మధ్య ఎస్పీ పాలనలో గూండాల అరాచకాలు పెచ్చుమీరాయని ఆరోపణలున్నాయి. వాటిని అరికడతామని హామీ ఇచ్చి ఐదేళ్ల కిందట అధికార పీఠమెక్కిన భాజపా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది! సీఎం పీఠమెక్కినప్పటి నుంచి యోగి.. సంఘవిద్రోహ శక్తులపై ఉక్కుపాదం మోపారు. గత ఐదేళ్లలో రాష్ట్ర పోలీసులు గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దుబే సహా 182 మంది కరడుగట్టిన నేరగాళ్లను హతమార్చారు. 4,206 మంది కాళ్లలోకి తూటాలు దించారు. 21 వేలమందికి పైగా నేరగాళ్లను అరెస్టు చేశారు.గత ఐదేళ్లలో మాఫియా వ్యక్తులకు చెందిన దాదాపు 2 వేల నిర్మాణాలను బుల్డోజర్లతో యోగి కూల్చివేయించారు. అక్రమార్కుల అధీనం నుంచి 64 వేల హెక్టార్ల భూమిని తిరిగి ప్రభుత్వపరం చేయించారు. యూపీ జనాభాలో 18-35 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు దాదాపు 4 కోట్లమంది ఉన్నారు. భాజపా పాలనాపగ్గాలు చేపట్టాక ఆకతాయిలు, గూండాల నుంచి తమకు పూర్తి భద్రత దక్కిందని, బయట స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామని గుర్తించి.. వారిలో అత్యధికులు ఆ పార్టీవైపే మొగ్గారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని