CM KCR: కాంగ్రెస్‌ వస్తే జరిగేది భూమాతనా? భూ‘మేత’నా?: సీఎం కేసీఆర్‌

వచ్చే ఎన్నికల్లో భారాస గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. మానకొండూరు సభ అనంతరం స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు.

Updated : 20 Nov 2023 17:56 IST

నల్గొండ, స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌: వచ్చే ఎన్నికల్లో భారాస గెలుపును ఎవరూ ఆపలేరని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రజాశక్తి ముందు ఎవరూ నిలువలేరన్నారు. మానకొండూరు సభ అనంతరం స్టేషన్‌ ఘన్‌పూర్‌, నకిరేకల్‌, నల్గొండ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ధరణిని బంగాళాఖాతంలో కలిపి, భూమాత తెస్తామని కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్‌ వస్తే జరిగేది భూమాతనా? భూ‘మేత’నా?అని ప్రశ్నించారు. ధరణిని బంద్‌ చేస్తే రైతు బంధు నిధులు ఎలా వస్తాయన్నారు.

కాంగ్రెస్‌ పాలన బాగుంటే తెదేపా పుట్టేదా?: కేసీఆర్‌

నకిరేకల్‌లో ఏ ఎమ్మెల్యే గెలుస్తారో.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వం బాగోలేకపోతే ఐదేళ్లు బాధపడాల్సి వస్తుందన్నారు. అభ్యర్థి వ్యక్తిత్వంతో పాటు పార్టీల చరిత్ర, నడవడిక చూసి ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. ‘‘ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణ సాధన కోసమే భారాస పుట్టింది. స్వరాష్ట్రం కోసం 15 ఏళ్లు పోరాటం చేసి అనేక మంది జైలు పాలయ్యారు. 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో 400 మందిని కాల్చి చంపారు. 2001లో మళ్లీ తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ఇస్తామని చెప్పి 2004లో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణ ఇవ్వకుండా 15 ఏళ్లు బాధపెట్టారు’’ అని కేసీఆర్‌ అన్నారు. 

కాంగ్రెస్‌ జమానాలో రైతు బంధు అనేది విన్నామా?

అవకాశం ఇచ్చిన వారు ఏం చేశారు? మరోసారి అవకాశం ఇస్తే ఇంకేం చేస్తారనే విషయాలను ఆలోచించి ప్రజలు ఓటు వేయాలని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సభలో సీఎం కేసీఆర్‌ అన్నారు. ‘‘పదేళ్ల పాటు భారాస అధికారంలో ఉంది. ఈ పదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఏం చేసింది? స్టేషన్‌ ఘన్‌పూర్‌కు ఏం చేశాం? అనేది ప్రజలు ఆలోచించాలి. స్టేషన్‌ ఘన్‌పూర్ అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉంది? మీరే ఆలోచించండి. కాంగ్రెస్‌ రాజ్యంలో మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇవాళ మళ్లీ వచ్చి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్‌ జమానాలో రైతు బంధు అనేది విన్నామా? రైతుల కోసం కాంగ్రెస్‌ ఏనాడూ పనిచేయలేదు. తెలంగాణలో మరోసారి ఇందిరమ్మ రాజ్యం రావాలని ఎవరు కోరుకుంటున్నారు? ఇందిరమ్మ రాజ్యంలో ధనికుడు మరింత సంపాదించుకున్నాడు. లేనోడు మరింత పేదోదయ్యాడు’’ అని కేసీఆర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని