తప్పుడు డిజైన్లతో ‘కాళేశ్వరం’ అనుమతులు

తెలంగాణ ప్రభుత్వం తప్పుడు డిజైన్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు పొందిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆరోపించారు.

Published : 21 Nov 2023 03:40 IST
కుమారుడు, కుమార్తెకు ఉపాధి కల్పించడంపైనే కేసీఆర్‌ ధ్యాస
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ
ఈనాడు, కామారెడ్డి-కొల్లాపూర్‌, కొల్లాపూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం తప్పుడు డిజైన్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు పొందిందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆరోపించారు. సోమవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ నియోజకవర్గ కేంద్రాల్లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గతంలో తాను కేంద్ర జలవనరుల శాఖ మంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలనే ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు మంజూరు చేశానని, అయితే.. కేసీఆర్‌ ఇంజినీర్‌గా అవతారమెత్తి రూపొందించిన తప్పుడు డిజైన్ల కారణంగా ప్రాజెక్టు భవిష్యత్తు అయోమయంగా మారిందన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంపొందించడంపై దృష్టి సారించాల్సిన సీఎం కేసీఆర్‌.. తన కుమారుడు, కుమార్తెకు రాజకీయ ఉపాధి కల్పించడంపై అధిక ధ్యాస పెడుతున్నారని దుయ్యబట్టారు. తాను సాధారణ కార్యకర్త నుంచి జాతీయ స్థాయికి చేరుకోవడానికి భాజపానే కారణమని, కేసీఆర్‌ మాత్రం కుటుంబ పాలనను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రాంత వెనుకబాటుకు కుటుంబ పార్టీలే కారణమన్నారు. తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్రం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ రవాణా సౌకర్యాలను మెరుగుపరుస్తోందని వివరించారు. గోదావరిపై జలరవాణా ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 2018 ఎన్నికల హామీ మేరకు రూ.900 కోట్లతో కొల్లాపూర్‌ నుంచి జాతీయ రహదారి, సోమశిల వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, రూ.1,100 కోట్లతో సోమశిల వద్ద కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన చేపడుతున్నామని అన్నారు. రాష్ట్రంలో భాజపా ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆయా సభల్లో భాజపా ఎల్లారెడ్డి, కొల్లాపూర్‌ అభ్యర్థులు సుభాష్‌రెడ్డి, ఎల్లేని సుధాకర్‌రావు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని