Telangana assembly elections: ఇందూరులో పోరు బహు పసందు

పసుపు, చెరకు, వరి పంటలకు, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకూ నిలయమైన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయం ఎలా ఉంది? గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల జెండా ఎగరేసిన భారాస మరోసారి అదే పట్టు చూపనుందా? కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపడుతుండడం...

Updated : 21 Nov 2023 13:41 IST

కేసీఆర్‌, రేవంత్‌ల పోటీతో ఉమ్మడి జిల్లాలో కాక
పలు స్థానాల్లో కీలకంగా మారిన భాజపా
జయాపజయాలను నిర్ణయించనున్న మైనారిటీలు

పసుపు, చెరకు, వరి పంటలకు, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకూ నిలయమైన ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రాజకీయం ఎలా ఉంది? గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి మినహా మిగిలిన ఎనిమిది చోట్ల జెండా ఎగరేసిన భారాస మరోసారి అదే పట్టు చూపనుందా? కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తలపడుతుండడం... చుట్టుపక్కల స్థానాలపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్థానాల్లో పోటీ ఎలా ఉంది? కల్వకుంట్ల కవిత ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఉన్న బోధన్‌, మిగతా నియోజక వర్గాల్లో పరిస్థితులపై పరిశీలన కథనం...


కామారెడ్డి... కదనరంగమే

ఇక్కడ అయిదుసార్లు (1994, 2009, 2012 ఉప ఎన్నిక, 2014, 2018) ఎమ్మెల్యేగా గంప గోవర్ధన్‌ విజయం సాధించారు. అనూహ్యంగా కేసీఆర్‌ పోటీ చేస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నియోజకవర్గంలోని బీబీపేట మండలం కోనాపూర్‌.. కేసీఆర్‌ తల్లిగారి ఊరు. కామారెడ్డి నియోజకవర్గం హైదరాబాద్‌కు సమీపంలో ఉండటంతో వాణిజ్యపరంగా కీలకంగా మారింది. కేసీఆర్‌ గెలిస్తే... పారిశ్రామికంగా, సాగునీటి పరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయన్న చర్చ వినిపిస్తోంది. ఇక్కడ కేసీఆర్‌ పోటీలో ఉండడంతో నిజామాబాద్‌ అర్బన్‌, రూరల్‌, ఎల్లారెడ్డి, బాల్కొండ, ఆర్మూర్‌, మెదక్‌, సిరిసిల్ల, వేములవాడ, దుబ్బాక నియోజకవర్గాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోందని భారాస వర్గాలు చెబుతున్నాయి. మండలాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్‌ నాయకులు రోజుకొకరు చొప్పున ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి వరుసగా పోటీ చేస్తూ వచ్చిన షబ్బీర్‌అలీ మరో నియోజకవర్గానికి తరలిపోవడంతో మైనారిటీల మద్దతు కూడగట్టేందుకు భారాస ప్రయత్నిస్తోంది. మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట మండలాల్లో పూర్తి పట్టు సాధించే లక్ష్యంతో నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు.

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలవడంతో ప్రతి మండలంలో ఒక సీనియర్‌ నేత ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌పై వివాదం, భూములు కోల్పోనున్న రైతుల సమస్యలను వారు ప్రస్తావిస్తున్నారు. భూములను లాక్కోవడానికే కేసీఆర్‌ ఇక్కడ పోటీకి దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. యువతకు ఉపాధి కల్పనలో ప్రభుత్వం విఫలమైందనీ ప్రచారం చేస్తున్నారు. తటస్థులను ఆకర్షించేందుకు కృషి చేస్తున్నారు.

భాజపా నుంచి బరిలో ఉన్న జడ్పీ మాజీ అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి... ధార్మిక, సామాజిక కార్యక్రమాలతో స్థానికంగా గుర్తింపు పొందారు. తానెప్పటికీ ఇక్కడే, ప్రజల మధ్యలో ఉంటానని, ‘లోకల్‌’నని ప్రచారంలో చెబుతున్నారు. ‘‘రమణన్నను ఎవరు అడిగినా సాయం చేస్తారు. ఎప్పటి నుంచో సేవ చేస్తున్నారు. రాజకీయంగా అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలియదు’’ అని కామారెడ్డి పట్టణానికి చెందిన పలువురు తెలిపారు.

‘కేసీఆర్‌ వస్తుండటంపై మేం ఆలోచన చేస్తున్నాం. గజ్వేల్‌ మాదిరే మా ప్రాంతం మారుతుందా... అనే చర్చ ఊర్లో నడుస్తోంది..’ అని భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన కొందరు రైతులు తెలిపారు. 

‘మార్పు రావాలని కోరుకుంటున్నాం. ఎవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదు. పార్టీల తీరును గమనిస్తున్నాం. అంతా ఒకే తరహా హామీలే ఇస్తున్నారు’ అని బీబీపేట మండలంలో కొందరు యువకులు తెలిపారు.


ఎల్లారెడ్డి... ఎవరిదో గురి?

ఎల్లారెడ్డిలో బీసీ వర్గాల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్‌ నుంచి గెలుపొంది భారాసలో చేరిన ఎమ్మెల్యే జాజాల సురేందర్‌... మరోసారి బరిలో ఉన్నారు. రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చానని, రైతుబంధు లబ్ధిదారులు, పోడు పట్టాలు పొందిన రైతులు మద్దతుగా నిలుస్తారని నమ్మకంగా ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి మదన్‌మోహన్‌రావు ఆరు గ్యారంటీలను ఆధారంగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించిన వి.సుభాష్‌రెడ్డి... భాజపా అభ్యర్థిగా నిలిచారు. బీసీ సీఎం హామీ తదితరాలను ప్రచారం చేస్తున్నారు.


నిజామాబాద్‌ అర్బన్‌లో త్రిముఖ పోటీ

భారాస అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తా హ్యాట్రిక్‌ విజయానికి కృషి చేస్తున్నారు. భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, సమీకృత మార్కెట్లు, నగర సుందరీకరణ, కళాభారతి నిర్మాణంతోపాటు నగరంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, అధునాతన శ్మశాన వాటికలపై ప్రచారం చేస్తున్నారు. స్థానిక మరాఠీ కుటుంబాలు, మైనారిటీల ఓట్లు తనకే పడతాయనే ధీమాతో ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ బరిలో ఉండటం ఆసక్తికరంగా మారింది. 2018లో కాంగ్రెస్‌ అభ్యర్థి తాహెర్‌బిన్‌ హందాన్‌కు 30.6% ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం షబ్బీర్‌ రాకతో మైనారిటీల మద్దతు మరింత పెరుగుతుందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటూ కలిసి వస్తుందని హస్తం శ్రేణులు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే ఇక్కడ తమ పార్టీ బలోపేతమైందని భాజపా అభ్యర్థి ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్తా అంటున్నారు. పార్టీలో యువత భాగస్వామ్యం అధికంగా కనిపిస్తోంది. 2009 ఎన్నికల్లో 42.52% ఓట్లతో భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ ఇక్కడ విజయం సాధించారు. ఆ ఓటుబ్యాంకు ఇప్పటికీ పార్టీకి పదిలంగా ఉందని భావిస్తున్నారు.


నిజామాబాద్‌ రూరల్‌లో ద్విముఖ పోరు

బాజిరెడ్డి గోవర్ధన్‌ ఇక్కడ హ్యాట్రిక్‌ విజయంపై దృష్టి పెట్టారు. కాళేశ్వరం ద్వారా సాగునీరు.. వంతెనలు, రహదారుల నిర్మాణం, పోడు భూములకు  పట్టాల పంపిణీని ప్రస్తావిస్తున్నారు. తాను ఆర్టీసీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలోనే సంస్థ కార్మికులను ప్రభుత్వంలో విలీనం జరిగిందని చెబుతున్నారు. ఆయన కుమారుడు, దర్పల్లి జడ్పీటీసీ సభ్యుడు జగన్‌ జోరుగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి భారాస మాజీ ఎమ్మెల్సీ ఆర్‌.భూపతిరెడ్డి బరిలో ఉన్నారు. రైతు రుణమాఫీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ప్రచారంలో ఆరోపిస్తున్నారు. భాజపా అభ్యర్థి దినేశ్‌ కులాచారి యువత అండతో ప్రచారం సాగిస్తున్నారు.


బాల్కొండ... బరిలో  గెలిచేది ఎవరో?

మూడోసారి విజయానికి రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. కొత్తగా నిర్మించిన రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సౌకర్యాలు, చెక్‌డ్యాంలు, వంతెనలు, శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవం పనులు, భారాస సంక్షేమ కార్యక్రమాలపై బూత్‌స్థాయిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీ తరఫున పోటీ చేసిన ప్రముఖ ప్రైవేటు బస్సుల సంస్థ యజమాని ముత్యాల సునీల్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఎస్పీకి 41,254 ఓట్లు వచ్చాయని, కాంగ్రెస్‌ ఓట్లూ కలిసి... విజయం ఖాయమనే ధీమాతో ఉన్నారు. భాజపా నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నపూర్ణమ్మ పోటీలో ఉన్నారు. పసుపు బోర్డు హామీని ప్రస్తావిస్తున్నారు. పార్టీకి యువత మద్దతు పెరిగిందని చెబుతున్నారు.


ఆర్మూర్‌లో ముక్కోణపు పోటీ

హ్యాట్రిక్‌ విజయం సాధించాలని భారాస ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. వంద పడకల ఆస్పత్రి, గోదావరిపై వంతెన, సిద్ధుల గుట్ట అభివృద్ధి తనకు కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. రైతులు, బీసీ వర్గాల మద్దతు తనకే ఉందని విశ్వసిస్తున్నారు. గత ఎన్నికల్లో భాజపా నుంచి పోటీ చేసిన పి.వినయ్‌కుమార్‌రెడ్డి... ఈసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగారు. నాలుగున్నరేళ్లుగా భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఉన్న ఆయన ఆ పార్టీ ఓట్లను ఎంతమేర చీలుస్తారనేది ఆసక్తిగా మారింది. భాజపా నుంచి పి.రాకేశ్‌రెడ్డి బరిలో ఉన్నారు. నిజామాబాద్‌ ఎంపీ డి.అర్వింద్‌ ఇక్కడ పార్టీని బలోపేతం చేయడం కలిసి వస్తుందని అంటున్నారు.


బోధన్‌లో ధనాధన్‌

బోధన్‌లో మూడోసారి జెండా ఎగరేసేందుకు భారాస ఎమ్మెల్యే షకీల్‌ కృషి చేస్తున్నారు. మైనారిటీల కంచుకోట కావడం కలిసి వస్తుందని, నిజాంసాగర్‌ ఆధునికీకరణతో లబ్ధి పొందిన రైతుల ఓట్లు తమకే పడతాయని నమ్మకంగా ఉన్నారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్‌ఛార్జిగా కల్వకుంట్ల కవిత ఉండటం కలిసివస్తుందంటున్నారు. మైనారిటీలు ఈ దఫా తనకే మద్దతు ఇస్తారని కాంగ్రెస్‌ అభ్యర్థి పి.సుదర్శన్‌రెడ్డి భావిస్తున్నారు. రైతు రుణమాఫీ హామీ, భారాస వ్యతిరేక ఓటుపై నమ్మకంతో ఉన్నారు. భాజపా నుంచి రైస్‌ మిల్లర్ల సంఘం నాయకుడు వడ్డి మోహన్‌రెడ్డి బరిలో ఉన్నారు. పార్టీ మ్యానిఫెస్టో, మోదీ ఆకర్షణ పనిచేస్తాయని విశ్వసిస్తున్నారు.


బాన్సువాడ... ప్రగతి పనులు X 6 గ్యారంటీలు

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇక్కడ ప్రచారంలో ముందున్నారు. 11 వేల రెండు పడక గదుల ఇళ్ల పంపిణీని ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. సిద్దాపూర్‌, జాకోరా ఎత్తిపోతల పథకాల నిర్మాణం, నిజాంసాగర్‌ కాలువల అనుసంధానంతో ప్రయోజనం పొందిన బాన్సువాడ, వర్ని మండలాల్లో రైతుల మద్దతు తనకే ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆరు గ్యారంటీలను ప్రచారం చేస్తున్నారు. భాజపా అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ.. రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర వాటాను ప్రచారాస్త్రంగా చేసుకున్నారు. యువత తమవైపే మొగ్గు చూపుతుందని చెబుతున్నారు.


జుక్కల్‌(ఎస్సీ)... ముగ్గురి మధ్య గట్టి పోటీ

కర్ణాటక, మహారాష్ట్రలతో సరిహద్దు ఉన్న జుక్కల్‌ నియోజకవర్గం.. మూడు భాషలు మాట్లాడే ప్రజలతోపాటు మత పీఠాలు, ధార్మిక కేంద్రాలకు నిలయంగా ఉంది. ఇక్కడ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హన్మంతు షిండేే... నాలుగోసారి భారాస అభ్యర్థిగా బరిలో నిలిచారు. ప్రచారంలో సాగునీటి పథకాల నిర్మాణాలు, చెరువుల పునరుద్ధరణ, సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తున్నారు. ఆశావహుడైన మాజీ ఎమ్మెల్యే గంగారాంను కాదని... లక్ష్మీకాంతరావుకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తనను గెలిపిస్తుందనే నమ్మకంతో ఆయన ప్రచారం చేస్తున్నారు. తెదేపా మాజీ ఎమ్మెల్యే అరుణతార భాజపా నుంచి బరిలో ఉన్నారు. నియోజకవర్గంపై పట్టున్న అరుణతార విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో

మొత్తం నియోజకవర్గాలు: 9
రిజర్వుడు స్థానం: 1 (ఎస్సీ)

గత ఎన్నికల్లో ఫలితాలు

భారాస: 8  
కాంగ్రెస్‌: 1

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా నుంచి ‘ఈనాడు’ ప్రత్యేక ప్రతినిధి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు