Telangana assembly elections: అతడు.. ఒక సైన్యం

భారాస, కాంగ్రెస్‌ల నుంచి అగ్రనాయకులు పోటీపడుతుండడంతో కామారెడ్డి నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. భారాస నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పోటీలో నిలిచారు.

Updated : 21 Nov 2023 13:41 IST
రాష్ట్ర ప్రచార బాధ్యతల్లో కేసీఆర్‌, రేవంత్‌
వీలు చిక్కినప్పుడల్లా స్థానికంగా పర్యటన
కామారెడ్డి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే
భారాస, కాంగ్రెస్‌ల నుంచి అగ్రనాయకులు పోటీపడుతుండడంతో కామారెడ్డి నియోజకవర్గంపైనే అందరి దృష్టి ఉంది. భారాస నుంచి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్‌ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్‌రెడ్డి పోటీలో నిలిచారు. వీరితో పాటు భాజపా నుంచి కాటిపల్లి వెంకటరమణారెడ్డి బరిలో ఉన్నాడు. అగ్రనాయకులు ప్రధాన పార్టీల రథసారథులు కావడంతో వారు తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ ఇతర అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ప్రచారం నిర్వహించే సమయం వారికి లభించడం లేదు. వారి తరఫున ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్‌ నాయకులు అభ్యర్థుల బాధ్యతలను మోస్తున్నారు.
భారాస తరఫున సమన్వయ కమిటీ
కేసీఆర్‌ తరఫున ప్రచార బాధ్యతలు నిర్వర్తించడానికి 12 మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వామ్యం చేశారు. ఈ కమిటీలో భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు, ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, ఎంజీ వేణుగోపాల్‌గౌడ్‌ నియోజకవర్గాన్ని సమన్వయం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో భారాస జిల్లా అధ్యక్షుడు ముజీబొద్దిన్‌, సీనియర్‌ నాయకుడు నిట్టు వేణుగోపాల్‌రావు, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ పున్న రాజేశ్వర్‌ ప్రచార బాధ్యతలు మోస్తున్నారు. మాచారెడ్డి మండలంలో ఎంపీపీ నర్సింగ్‌రావు, భిక్కనూరు మండలం బాధ్యతలను ఆహార కమిషన్‌ రాష్ట్ర మాజీ ఛైర్మన్‌ కొమ్ముల తిర్మల్‌రెడ్డి చూసుకుంటున్నారు. రాజంపేట మండలంలో విండో ఛైర్మన్‌ నల్లవెల్లి అశోక్‌, దోమకొండ, బీబీపేట బాధ్యతలను సీనియర్‌ నాయకుడు సుభాష్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి గ్రామీణం, రామారెడ్డి మండలాల బాధ్యతలను సీనియర్‌ నాయకుడు మామిండ్ల అంజయ్య తీసుకున్నారు. వీరే కాకుండా మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవి, పట్టణాధ్యక్షుడు జూకంటి ప్రభాకర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారు.
సోదరుడు భుజాన వేసుకొని..
కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు షబ్బీర్‌అలీ నిజామాబాద్‌ అర్బన్‌లో పోటీ చేస్తున్నా తరచుగా కామారెడ్డికి వచ్చి రేవంత్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేసి వెళ్తున్నారు. స్థానిక నాయకులను సమన్వయం చేస్తున్నారు. ఇక రేవంత్‌రెడ్డి సోదరుడు కొండల్‌రెడ్డి ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. డీసీసీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌రావుతో కలిసి అన్ని మండలాల నాయకులను సమన్వయం చేస్తున్నాడు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ దోమకొండ, బీబీపేట మండలాల బాధ్యతలు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి కామారెడ్డి గ్రామీణం, పట్టణం బాధ్యలు పర్యవేక్షిస్తున్నారు. భిక్కనూరు మండల బాధ్యతలను మహిళా  కాంగ్రెస్‌ రాష్ట్ర మాజీ అధ్యక్షురాలు నేరేళ్ల శారద, టీపీసీసీ కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు మద్ది చంద్రకాంత్‌రెడ్డి నిర్వహిస్తున్నారు. మాచారెడ్డి మండలం బాధ్యతలను నిజామాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. కామారెడ్డి పట్టణ బాధ్యతలను గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి పంచుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే యుసూఫ్‌అలీ కూడా రేవంత్‌రెడ్డితో ప్రచారం చేస్తున్నారు.
రమణారెడ్డితో కార్యకర్తలు
కామారెడ్డి భాజపా అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డికి కార్యకర్తలే ముందుంటున్నారు. బూత్‌లుగా విడిపోయి ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ సీనియర్లు వస్తున్నా అందుబాటులో ఉన్న కొద్ది మంది నాయకులతో ముందుకు సాగుతున్నారు. కామారెడ్డి భాజపా అసెంబ్లీ కన్వీనర్‌ కుంట లక్ష్మారెడ్డి, భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్‌, నరేందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల భరత్‌, కౌన్సిలర్లు నరేందర్‌, శ్రీకాంత్‌ ప్రచారం చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని