క్యాన్సర్ సైనికులం మనమే కావాలి!
క్యాన్సర్ నివారణ మన బాధ్యతే. ఇప్పుడంతా ఇలాంటి సంకల్పమే తీసుకోవాలి. ప్రపంచ క్యాన్సర్ దినం సందేశం ఇదే. క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది మరి.............
నేడు (ఫిబ్రవరి 4) ప్రపంచ క్యాన్సర్ దినం
క్యాన్సర్ నివారణ మన బాధ్యతే. ఇప్పుడంతా ఇలాంటి సంకల్పమే తీసుకోవాలి. ప్రపంచ క్యాన్సర్ దినం సందేశం ఇదే. క్యాన్సర్ బారినపడకుండా చూసుకోవటం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది మరి. జన్యుమార్పులతో క్యాన్సర్ రావటం నిజమే అయినా.. వీటి పాత్ర 5-10 శాతమే. పొగాకు, మద్యం అలవాట్లతో ముడిపడిన క్యాన్సర్లు 27 శాతానికి పైగా ఉన్నాయంటే వీటి నివారణకు మనం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయటం లేదనే అర్థం. ఆహార విహారాల్లో జాగ్రత్త వహిస్తే క్యాన్సర్ దరిజేరకుండా కాపాడుకోవటం పెద్ద కష్టమేమీ కాదు. కాబట్టి క్యాన్సర్ అంటే ఏంటి? దీనికి దోహదం చేస్తున్నవేంటి? నివారణ మార్గాలేంటి? అనేవి ఒకసారి తెలుసుకుందాం.
క్యాన్సర్ అంటే?
కణజాలం అనవసరంగా, ఆగకుండా విపరీతంగా వృద్ధి చెందటమే క్యాన్సర్. సాధారణంగా మన శరీరంలోని కణాలు అవసరమైనప్పుడు విభజన చెందుతుంటాయి. అవసరం తీరాక విభజన ఆపేస్తాయి. ఈ ప్రక్రియకు అవసరమైన సంకేతాలను.. అంటే ఒక ‘మీట’లాంటిదాన్ని కణాలే రూపొందించుకుంటాయి. క్యాన్సర్ కణాల్లోనే కాదు.. వీటి నుంచి పుట్టుకొచ్చిన కణాల్లోనూ ఈ ‘మీట’ ఉండదు. ఫలితంగా కణాలు తామరతంపరగా వృద్ధి చెందుతూ వస్తుంటాయి. పక్కనున్న కణాలన్నింటినీ ఛేదించుకుంటూ విస్తరిస్తుంటాయి. ఇదే క్యాన్సర్ కణితి.
క్యాన్సర్‌కు దారితీసే అంశాలేంటి?
జన్యుమార్పులే కాదు.. జన్యు వ్యక్తీకరణను దెబ్బతీసేవన్నీ క్యాన్సర్ కారకాలుగా పరిణమిస్తాయి. ఇందులో మన జీవనశైలే కీలకపాత్ర పోషిస్తుంది. మూడింట రెండొంతుల క్యాన్సర్లు మన గతి తప్పిన ఆహార విహారాలు, పరిసరాల ప్రభావంతో ముడిపడినవే.
అధిక బరువు: ఊబకాయం గలవారి శరీరంలో నిరంతరం కణస్థాయిలో స్వల్పంగా వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) కొనసాగుతుంది. అలాగే రక్తంలో ఇన్సులిన్, ఇన్సులిన్ మాదిరి గ్రోత్ హార్మోన్ల మోతాదులూ ఎక్కువగానే ఉంటాయి. అంతేకాదు, కొవ్వు మూలంగా ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగానూ ఉత్పత్తి అవుతుంటుంది. ఇవన్నీ పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ, అండాశయ, క్లోమ, కాలేయ, అన్నవాహిక, కిడ్నీ, ప్రోస్టేట్, పిత్తాశయ క్యాన్సర్ల ముప్పు పెరిగేలా చేస్తాయి.
- బరువు నియంత్రణలో ఉంచుకోవటం, అధికంగా పెరుగుతున్నట్టయితే తగ్గించుకోవటం మంచిది.
పొగాకు వాడకం: పొగాకులో సుమారు 7వేల రకాల విషతుల్య రసాయనాలుంటాయి. వీటిల్లో 400 రకాలు క్యాన్సర్‌కు దారితీసేవే. మొత్తం క్యాన్సర్లలో 22% పొగాకు మూలంగా తలెత్తుతున్నవే. పొగాకుతో నోరు, ఊపిరితిత్తుల క్యాన్సర్లే కాదు.. మెడ, గొంతు, అన్నవాహిక, జీర్ణాశయ, క్లోమ, కిడ్నీ, మూత్రాశయ క్యాన్సర్లూ పుట్టుకొస్తాయి.
- సిగరెట్లు, బీడీలు, చుట్టల వంటివి కాల్చకపోవటం.. ఇతరులు వదిలిన పొగను పీల్చకపోవటం.. గుట్కా, జర్దా వంటివి నమలకపోవటం వంటి జాగ్రత్తలతో వీటిని నివారించుకోవచ్చు.
మద్యం తాగటం: మద్యం ఒంట్లోకి చేరుకున్నాక అసిటల్‌డిహైడ్‌గా మారుతుంది. ఇది డీఎన్‌ఏను, కణాల మరమ్మతు ప్రక్రియను దెబ్బతీస్తుంది. మద్యం తాగటం వల్ల నోరు, మధ్య గొంతులోని కణాలు దెబ్బతిని, క్యాన్సర్ కారకాలు తేలికగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఫలితంగా క్యాన్సర్ల ముప్పు పెరుగుతుంది. మద్యంతో నోరు, గొంతు, స్వరపేటిక, అన్నవాహిక, పెద్దపేగు, కాలేయ, రొమ్ము క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ.
- మద్యం జోలికి వెళ్లకపోవటం ఉత్తమం. ఒకవేళ మద్యం అలవాటుంటే మితిమీరకుండా చూసుకోవాలి.
వైరల్ ఇన్‌ఫెక్షన్లు: హెపటైటిస్ బి, హెపటైటిస్ సి ఇన్‌ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్‌కు దారితీయొచ్చు. హెచ్‌పీవీ వైరస్‌తో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రావొచ్చు. ఇది జననాంగ, మలద్వార, నోరు, గొంతు క్యాన్సర్లకూ కారణమవుతుంది.
- ఒకరు వాడిన బ్లేడ్లు, సిరంజీల వంటివి వాడకుండా చూసుకోవటం, సురక్షిత శృంగారం వంటి జాగ్రత్తలతో హెపటైటిస్ బి, సి బారినపడకుండా చూసుకోవచ్చు. జననాంగ శుభ్రత, విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండటం ద్వారా హెచ్‌పీవీని అడ్డుకోవచ్చు. హెపటైటిస్ బి, హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ల నివారణకు టీకాలు అందుబాటులో ఉన్నాయి.
ఆహార అలవాట్లు: మాంసాహారం, కొవ్వు పదార్థాలు అతిగా తింటే క్యాన్సర్లు తలెత్తే ప్రమాదముంది. శాకాహారుల్లో ప్రతి వెయ్యిమందిలో 15-35 మందికి.. శాకాహారం, మాంసాహారం రెండూ తినేవారిలో 35-75 మందికి క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుండగా.. పూర్తిగా మాంసాహారమే తినేవారిలో 195-210 మందికి క్యాన్సర్ వచ్చే అవకాశముంది. కొవ్వు, ఉప్పు, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా క్యాన్సర్ ముప్పు పెరిగేలా చేస్తాయి.
- వీలైనంత వరకు శాకాహారం తినటం మేలు. మాంసాహారులైతే మితం పాటించాలి.
హెచ్చరిక సంకేతాలపై కన్నేయండి
* మలమూత్ర విసర్జనలో మార్పులు
* పుండ్లు మానకుండా దీర్ఘకాలంగా వేధిస్తుండటం
* ఒంట్లో ఎక్కడైనా అసహజ రక్తస్రావం
* అకారణంగా బరువు, ఆకలి తగ్గటం
* ముద్ద మింగటంలో ఇబ్బంది పడటం
* అదే పనిగా అజీర్ణంతో బాధపడుతుండటం
* పుట్టుమచ్చలు, పులిపిర్లలో కొత్తగా అసహజ మార్పులు
* దగ్గు, గొంతు బొంగురుపోవటం ఎంతకీ తగ్గకపోవటం
* ఒంట్లో ఎక్కడైనా గడ్డలు ఏర్పడటం. ముఖ్యంగా నొప్పి లేకుండా గడ్డల సైజు పెరుగుతుండటం
* నిస్సత్తువ, తీవ్రమైన అలసల, బలహీనత
* రొమ్ముల ఆకారంలో మార్పులు, గడ్డలు, నొప్పి
* రాత్రిపూట తీవ్రంగా చెమట్లు పట్టటం
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Couple Suicide: నిస్సహాయ స్థితిలో దంపతుల ఆత్మహత్య!
-
Politics News
EC: వయనాడ్ ఖర్చులు సమర్పించని ‘రాహుల్’పై ఈసీ వేటు!
-
India News
Ram Ramapati Bank: శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
Ts-top-news News
Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
-
Crime News
Andhra News: సీఎం జగన్‌పై పోస్టులు పెట్టారని ప్రవాసాంధ్రుడి అరెస్టు
-
Crime News
Vijayawada: వేడినీళ్ల బకెట్లో పడి 8 నెలల శిశువు మృతి