Published : 20/05/2021 17:58 IST

Summer: మట్టికుండలో నీరు..ఎంతో హుషారు!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇప్పుడైతే నీటిని నిల్వ చేసుకోవడానికి రకరకాల గాజు పాత్రలు, స్టీలు బిందెలు వచ్చేశాయ్‌ గానీ, ఒకప్పుడు అందరూ మట్టికుండలోనే నీటిని నిల్వచేసే వారనీ, ఆ నీటినే తాగే వారని తెలిసే ఉంటుంది.ఇప్పుడు ఎక్కడోగానీ మట్టికుండలు దర్శనమివ్వడం లేదు.అయితే, మట్టికుండలో నీటిని తాగితే చాలా మంచిదని, శరీరంలో రక్తప్రసరణ బాగా జరిగి ఉత్సహంగా  ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు మట్టికుండలో నీటివల్ల ఉపయోగాలేంటో చూద్దామా?

సజహ రిఫ్రిజిరేటర్‌

ఇప్పుడైతే ఫ్రిజ్‌లు అందుబాటులోకి వచ్చేశాయి గానీ, గతంలో చల్లనినీరు కావాలంటే మట్టికుండలే. ఇందులో నిల్వచేసుకుంటే నీరు చల్లగా ఉండటంతోపాటు, పోషకాలు, ఖనిజలవణాలు కూడా వృథా కాకుండా ఉంటాయి. చాలామంది నీటిని ప్యూరిఫై చేసి తాగుతుంటారు. ఇది మంచిదే కానీ, ప్యూరిఫై చేసే సమయంలో శరీరానికి అవసరమైన కొన్ని ఖనిజలవణాలు కోల్పోయే అవకాశముంది. మట్టికుండలతో ఆ సమస్య ఉండదు. వీటికి సూక్ష్మ రంద్రాలు ఉంటాయి. మట్టికుండలో నీటిని పోస్తే అందులోని వెచ్చదనం సూక్ష్మ రంద్రాల ద్వారా బయటకు పోతుంది. నీరు చల్లగా ఉంటాయి.

ఆల్కలీన్‌..

మనం తీసుకునే ఆహారదార్థాలు పొట్టలో కొన్ని రకాల ఆమ్లాలతో కలుస్తాయి. వీటివల్ల టాక్సీన్లు ఉత్పత్తి అయ్యి శరీరానికి హాని కలిగించే అవకాశముంది. మట్టికుండలోని నీటిలో సహజసిద్ధమైన ఆల్కలీన్‌లు ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసి టాక్సీన్లను బయటకు నెట్టివేస్తాయి. అంతేకాకుండా శరీరంలోని పీహెచ్‌ విలువను స్థిరంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.  ఫలితంగా ఎసిడిటీ, గ్యాస్ట్రిక్‌ సంబంధిత వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

జీవక్రియను మెరుగు

మట్టికుండ శరీరానికి హాని కలిగించే రసాయనాలను వడపోస్తుంది. ప్రతి రోజూ మట్టికుండలో నీటిని తాగడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. సాధారణంగా నీటిని శుద్ధి చేసినప్పుడు కొన్ని రకాల సహజ ఖనిజలవణాలు కోల్పోతాము. కానీ, మట్టికుండలో నీటిని తాగడం వల్ల నీటిలోని ఖనిజలవణాలను పూర్తిగా శరీరానికి అందుతాయి. అందువల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

వడదెబ్బ నుంచి రక్షణ

వేసవి కాలంలో చాలా మంది ఎదుర్కొనే సమస్య వడదెబ్బ. శరీరంలో సరైన నీటిస్థాయులు లేనప్పుడు ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోతారు. కొన్ని సార్లు దీనివల్ల ప్రాణాపాయం కూడా కలగవచ్చు. మట్టి కుండలో నీటిని తాగేవారిపై వడదెబ్బ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మట్టికుండ నీటిలోని పోషకాలు, ఖనిజలవణాలు శరీరాన్ని ఎప్పటికప్పుడు రీహైడ్రేషన్‌ చేయడంలో సహాయపడతాయని అంటున్నారు.

గొంతు సమస్యలుండవు

వేసవికాలం వచ్చిందంటే చాలు చల్లని నీటికోసం ప్రిజ్‌వైపు పరిగెడతాం.కానీ, ఫ్రిజ్‌ నీరు కొందరికి అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుంది. గొంతులోపల దురదపెట్టడం, దగ్గు, జలుబు తదితర సమస్యలు వచ్చే అవకాశముంది. కానీ, మట్టికుండలో నీటితో ఎలాంటి బాధా లేదు..వెచ్చగా కాకుండా.. అలా అని మరీ చల్లగా కాకుండా తాగేందుకు వీలుగా ఉంటాయి.

సహజ ప్యూరిఫయర్‌

మట్టికుండలు కేవలం నీటిని చల్లబరచడానికే కాదు. నీటిని శుద్ధి చేయడానికి కూడా ఉపయోగపడతాయి. బయటి వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కుండలోని నీరు సూక్ష్మ రంద్రాల ద్వారా బయటకు వస్తుంది. దీంతోపాటు కలుషితాలు కూడా కుండ గోడలకు, అడుగుభాగానికి చేరుకుంటాయి. అందువల్ల పరిశుభ్రమైన నీరు మాత్రమే మిగులుతుంది. అందువల్ల ఫ్రిజ్‌లో నీటినితాగే బదులు మట్టికుండలో నీటిని తాగడమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్