కరోనా కాలమైనా.. ప్రపంచాన్ని చుట్టేశాడు

కరోనా.. లాక్‌డౌన్‌.. ఎవ్వరూ బయటకు రావొద్దు. సామాజిక దూరం పాటించండి. లేకపోతే మహమ్మారి సోకేస్తుంది. ఇదీ గత కొన్ని నెలలుగా చాలా మంది చెబుతున్న మాట. కానీ, కెనడాకు చెందిన బెర్ట్‌ టెర్‌హార్ట్స్‌కి మాత్రం అలాంటి భయమేమీ లేదు. కరోనా వస్తే నాకేంటి? పోతే నాకేంటి? అనే ధీమాతో ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ వైరస్‌ మన ప్రపంచంపై దాడి చేయక ముందే ఆయన అందరికీ దూరంగా ఉంటూ...

Published : 23 Sep 2020 01:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా.. లాక్‌డౌన్‌.. ఎవ్వరూ బయటకు రావొద్దు. సామాజిక దూరం పాటించండి. లేకపోతే మహమ్మారి సోకేస్తుంది. ఇదీ గత కొన్ని నెలలుగా చాలా మంది చెబుతున్న మాట. కానీ, కెనడాకు చెందిన బెర్ట్‌ టెర్‌హార్ట్స్‌కి మాత్రం అలాంటి భయమేమీ లేదు. కరోనా వస్తే నాకేంటి? పోతే నాకేంటి? అనే ధీమాతో ఉన్నారు. ఎందుకో తెలుసా? ఈ వైరస్‌ మన ప్రపంచంపై దాడి చేయక ముందే ఆయన అందరికీ దూరంగా ఉంటూ సామాజిక దూరం పాటిస్తున్నారు. ఒకరితో సంబంధం లేకుండా తానొక్కడే ప్రపంచాన్ని చుట్టేసే సాహస యాత్రలో ఉన్నారు. 62 ఏళ్ల వయసులో బెర్ట్‌ టెర్‌హార్ట్స్‌ ఈ సాహసానికి పూనుకోవడం ఆశ్చర్యం కలిగించేదే. అదేదో అత్యాధునిక టెక్నాలజీ వాడి ప్రపంచం చుట్టూ తిరగాడంటే అదీ పొరపాటే. పాత కాలం నాటి సెలెస్టికల్‌ నేవిగేషన్‌ సిస్టమ్‌, ఓ పెన్ను పేపర్‌ పట్టుకొని 13 అడుగుల బోటుపై తిరిగేశారు.

‘ట్రావెల్‌ లీజర్‌’ కథనం ప్రకారం ఇలాంటి నేవిగేషన్‌ సిస్టమ్ ఉపయోగించి ప్రపంచాన్ని చుట్టేసిన వ్యక్తుల్లో బెర్ట్‌ టెర్‌హార్ట్‌ ఎనిమిదో వ్యక్తి. ఉత్తర అమెరికా ఖండంలో మొదటి వ్యక్తి.
గత అక్టోబర్‌లో తన సాహస యాత్రను ప్రారంభించి ఈ ఏడాది జులైలో ముగించారట. అయితే  ఆయన యాత్ర అంతసాఫీగా సాగలేదు. యాత్రకుమందు కూడా ఆయన ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. బెర్ట్‌ టెర్‌హార్ట్‌కు సెయిలింగ్‌పై మంచి పట్టుంది. యుక్తవయస్సులోనే సెయిలింగ్‌కు సంబంధించిన టిప్స్‌ అన్నీ నేర్చుకున్నారు. ఆయన తన డిగ్రీని కూడా ఓషియానోగ్రఫీలోనే పూర్తి చేశారంటే ఆయనకు సెయిలింగ్‌పై ఎంత మక్కువ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.

‘‘చిన్నప్పటి నుంచి సముద్ర అన్వేషకులు అంటే చాలా ఆసక్తి ఉండేంది. ఎవరికీ సాధ్యం కాని అనుభూతిని వారు సొంతం చేసుకుంటారు. సముద్రంలో అలా వెళ్తూ ఉంటే ప్రతిదీ కొత్తగా అనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమయం, అలలు, వాటి మధ్య తిరుగాడుతున్న తిమింగలాలు అన్నీ ఆశ్చర్యంగా అనిపిస్తాయి. తినే తిండి, కట్టుకునే బట్టలు ఇలా ప్రతీదీ ప్రత్యేకమే. సముద్రం మధ్యలో ఎక్కడున్నామో తెలుసుకోవడం కూడా కొత్త అనుభూతినిస్తుంది. మార్గమద్యంలో భూభాగమేమైనా ఉంటే చూడాలన్న ఉత్సుకత ఉంటుంది.’’అని మేగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బెర్ట్‌ టెర్‌హార్ట్స్‌ వెల్లడించారు.

బెర్ట్‌ టెర్‌హార్ట్స్‌ యాత్ర అంతసాఫీగా సాగలేదు. మధ్యలో ఎన్నెన్నో ఆటంకాలు.. కొన్ని సార్లు నేవిగేషన్‌ సరిగా పని చేసేది కాదు. వాతావరణం గురించి తెలిసేది కాదు. హరికేన్లు ఎదుర్కోవాల్సి వచ్చేదట. సముద్రంలో ఎక్కడున్నానన్నది తెలుసుకోవడం చాలా కష్టంగా అనిపించిందని బెర్ట్‌ చెబుతున్నారు. నేవిగేషన్‌ కచ్చితంగా తెలియాలంటే స్థిరంగా ఒక చోట ఉండాలి. కానీ, ఓ చిన్న బోటులో అలల మధ్య కదలాడుతూ ఉన్నప్పుడు కచ్చితత్వం లోపిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు వేరే మార్గంలోకి వెళ్లిపోయే అవకాశమూ ఉంది. ఇన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ ఆయన వెనకడుగు వేయలేదు. రోజుకు 4 గంటలు మాత్రమే పడుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించానని బెర్ట్‌ చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని