కొవ్వు కరిగించు.. పొట్ట తగ్గించు!

ఎలాగైన పొట్ట కొవ్వును తగ్గించేయాలని జిమ్‌ బయలుదేరుతారు. కోచ్‌ చెప్పిన డైట్‌ పాటించేస్తారు. తీరా కొవ్వు తగ్గాక డైట్‌ మానేస్తే షరామామూలే. అందుకే ఇంటి డైట్‌ని పాటిస్తూ, సింపుల్‌ వ్యాయామాలు చేస్తే చాలు.

Published : 03 Nov 2020 12:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాగైన పొట్ట కొవ్వును తగ్గించేయాలని జిమ్‌ బయలుదేరుతారు. కోచ్‌ చెప్పిన డైట్‌ పాటించేస్తారు. తీరా కొవ్వు తగ్గాక డైట్‌ మానేస్తే షరామామూలే. అందుకే ఇంటి డైట్‌ని పాటిస్తూ, సింపుల్‌ వ్యాయామాలు చేస్తే చాలు. త్వరగా  కొవ్వును తగ్గించుకోవచ్చు. మరి ఆ ఇంటి డైట్‌ చిట్కాలేంటో తెలుసుకుందాం. కుదిరితే పాటించేద్దాం.

ఈ టీ ప్రయత్నించండి
మీ రోజుని గ్రీన్‌ టీతో ప్రారంభించండి. ఇందులో ఉండే ప్లెవనాయిడ్‌, కాటెచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్‌లు, కెఫెన్‌ మీ జీవక్రియను పెంచుతాయి. ఇది మీ శరీరానికి అవసరమైన పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్‌లతో అనవసరపు కొవ్వును త్వరగా తగ్గిస్తుంది. వీలైతే రోజులో రెండు నుంచి మూడు సార్లు ఈ టీని ప్రయత్నించొచ్చు. రోజూ గ్రీన్‌ టీని తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా క్యాన్సర్‌ బారిన పడకుండా ఉండొచ్చని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. దీనితోపాటు సమతుల్య ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తే మంచి ఫలితాలుంటాయి.

ఆ నూనె వాడండి
కొబ్బరినూనె మీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది మీ శరీరంలో ఉన్న అనవసరపు కొవ్వును తగ్గించి అవసరమైన కొవ్వును వృద్ధి చేస్తుంది. ఈ నూనెలో కొవ్వు శాతం ఎక్కువ కానీ, అది శరీరానికి అవసరమైనదే. ఇది కొవ్వును త్వరగా కరిగించి తక్షణ శక్తిగా మార్చుతుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రిస్తుంది. జీవక్రియ వేగవంతమవడానికి సాయపడుతుంది. నిజానికి మీ డైట్‌ నుంచి కొవ్వు పదార్థాలను పూర్తిగా తొలగించడం మంచిది కాదు. మీరు తినే కొవ్వు పదార్థాల్లో అవసరమైన కొవ్వు ఉన్న ఆహారపదార్థాలని ఎంచుకోవడం ఉత్తమం. అందుకే వంటలో ఓ టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనెని ప్రయత్నించండి.

ఇది ప్రయత్నించండి
కొన్నెళ్ల క్రితం గొంతు, కండర నరాల నొప్పులకు యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌ని వినియోగించేవారు. ప్రస్తుతం పొట్ట కొవ్వు తగ్గేందుకు దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇది యాంటి మైక్రోబయల్‌, యాంటీ ఆక్సిడెంట్‌, ఫ్యాటీ ఆమ్లాలను కలిగిఉండటంలో త్వరగా కొవ్వును కరిగించి, చక్కెర స్థాయిలను తగ్గించి బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. తినాలనే కోరికను తగ్గిస్తూ ఆకలిని అదుపులో ఉంచుతుంది. దీన్ని మీ వంటలో వాడొచ్చు. లేదా ఓ గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టేబుల్‌ స్పూన్‌ ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌ వేసి రోజులో ఒకటీ, రెండు సార్లు తీసుకోవచ్చు. 

ఈ ఆహారం ముఖ్యం 
ప్రొటీన్‌ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యం అవుతాయి. దీంతో మీ నడుము చుట్టూ ఉన్న కొవ్వు సులభంగా తగ్గించొచ్చు. పిండి పదార్థాలు, కొవ్వులతో పోల్చితే ప్రొటీన్‌ ఆహారం తీసుకోవడంతో శక్తి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. దీంతో మాటిమాటికి తినలేరు. ప్రొటీన్‌ ఆహారం మీ కండరాలను నిర్మించడంతో పాటు కాలక్రమేణా బరువును నియంత్రించడానికి సహాయపడుతుంది. గుడ్లు సులభంగా లభించే అధిక ప్రొటీన్‌లున్న ఆహారం. దీంతోపాటు ఓట్స్‌, పాలు, గింజలు, మాసం తదితర పదార్థాలు ఎంచుకోవచ్చు.

కడుపు నిండుగా.. 
ఇక అత్యధిక సమయం మీకు ఆకలి అనే భావన కలగకుండా ఉండాలంటే చియా విత్తనాలను ఎంచుకోవచ్చు. ఈ విత్తనాలు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలని కలిగి ఉంటాయి. మధ్యాహ్నం పెరుగులో చియా గింజలను కలిపి తీసుకోవడం ద్వారా కడుపు నిండుగా అనిపించడంతో ఆహారం తీసుకోవడం తగ్గిస్తారు. కెలరీలు తక్కువగా ఉండటంతో త్వరగా బరువు తగ్గొచ్చు. పెరుగు సైతం బరువు తగ్గేందుకు ఉత్తమమైన ఆహారం. ఇందులో ప్రొటీన్‌లు అధికంగా ఉంటాయి. వీటితో పాటు కారం ఎక్కువగా ఉన్న ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. మిరపకాయలు, మిరియాలు వంటి పదార్థాలను మీ డైట్‌లో చేర్చండి.
ఇతరేతరాలు
ఇక మీరెంత డైట్‌ పాటించినా.. అధిక ఒత్తిడి మీ పొట్టకొవ్వు తగ్గించాలన్న లక్ష్యాన్ని దూరం చేస్తుంది. ఎక్కువగా ఒత్తిడికి లోనవడంతో మీ ఆకలి పెరుగుతుంది. దీంతో అధిక కెలరీలు గల ఆహారం అవసరమవుతుంది. జీవక్రియను తగ్గిస్తుంది. ఒత్తిడితో బరువు తగ్గడం సులభంకాదు. వ్యాయామం, నిద్ర, నడక ద్వారా ఒత్తిడిని తగ్గించొచ్చు. రోజులో 7నుంచి8 గంటల నిద్ర అవసరం. తాజా కూరగాయలు, విటమిన్‌ సి, ఇ ఎక్కువగా ఉన్న ఆల్‌ బుకారా తదితర పండ్లను మీ బరువు తగ్గాలన్నా డైట్‌కి జోడించండి. వీలైనంత వరకూ చక్కెర పదార్థాలు తీసుకోవడం తగ్గించండి. రోజులో శరీరానికి అవసరమైనంత నీరు తీసుకోండి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు