డ్రాగన్‌పై ‘నిర్భయ’ గురి..! 

చైనా సరుకు ఎంత నాణ్యమైందో.. చైనా ఒప్పందాలు కూడా అంతే నమ్మకమైనవి. చైనాతో ఏ ఒప్పందం చేసుకొన్నా.. కళ్లుమూసుకొని నమ్మేయకూడదు. దానిపై వెయ్యికళ్లతో నిఘాపెట్టాలి. గత కొన్నేళ్లుగా భారత్‌ సరిహద్దుల్లో వాయుసేన స్థావరాలను చైనా  క్రమంగా పెంచేసింది. ఇప్పుడు తాపీగా ఇక బలగాలను పంపకూడదని ఒప్పందానికి వచ్చింది.

Updated : 29 Sep 2020 12:12 IST

* ఎల్‌ఏసీకి తరలింపు..
* అక్టోబర్‌లో మరో ఐదు రఫేల్స్‌.. 

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా సరుకు ఎంత నాణ్యమైందో.. చైనా ఒప్పందాలు కూడా అంతే నమ్మకమైనవి. చైనాతో ఏ ఒప్పందం చేసుకున్నా.. కళ్లు మూసుకొని నమ్మేయకూడదు. దానిపై వెయ్యికళ్లతో నిఘాపెట్టాలి. గత కొన్నేళ్లుగా భారత్‌ సరిహద్దుల్లో వాయుసేన స్థావరాలను చైనా  క్రమంగా పెంచేసింది. ఇప్పుడు తాపీగా ఇక బలగాలను పంపకూడదని ఒప్పందానికి వచ్చింది. పైకి చెప్పకపోయినా.. భారత్‌ కూడా ఎక్కడా రాజీపడకుండా ముందుజాగ్రత్త చర్యలను తీసుకుంటోంది. తన కీలక ఆయుధాలను సరిహద్దులకు తరలిస్తోంది.

1000కి.మీ లక్ష్యం.. 

దీర్ఘశ్రేణి సబ్‌సానిక్‌ క్రూజ్‌ క్షిపణి ‘నిర్భయ’ను వాస్తవాధీన రేఖ వద్ద మోహరించినట్లు సమాచారం. ఇది దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను 0.6మాక్‌ స్పీడ్‌తో వెళ్లి ఛేదిస్తుంది. కేవలం 100 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ రాడార్ల కళ్లుగప్పగలదు. అసలే హిమాలయాల వంటి ప్రాంతాల్లోని అత్యధిక ఎత్తైన టిబెట్‌‌ పీఠభూమిపై ఉన్న చైనా దళాల రాడార్లు ఇంత తక్కువ ఎత్తులో వచ్చే క్షిపణులను అంత తేలిగ్గా గుర్తించలేవు.

రెండుసార్లు విఫలమైనా..

ఇప్పటికే ఆరుసార్లు దీనిని పరీక్షించగా.. రెండుసార్లు విఫలమైంది. చివరి పరీక్షలో అద్భుతంగా లక్ష్యాన్ని ఛేదించింది. దీనికి పూర్తిస్థాయి ఆపరేషనల్‌ క్లియరెన్స్‌ రాలేదు. కానీ, కచ్చితత్వం, ప్రదర్శన ఆధారంగా దీనిని ఎల్‌ఏసీ వద్దకు పంపారు. ‘నిర్భయ’ను మోహరించడం ఇదే తొలిసారి. దీనికి త్వరలోనే ఆపరేషనల్‌ క్లియరెన్స్‌ కూడా రానుంది. దీంతోపాటు బ్రహ్మోస్‌, ఆకాశ్‌ క్షిపణలను కూడా ఎల్‌ఏసీ వద్దకు తరలించినట్లు సమాచారం.

భారీగా చైనా ఆయుధాలు..

భారత్‌తో‌ సరిహద్దు పంచుకొనే షిన్‌ జియాంగ్‌, టిబెట్‌లో 2,000 కిలోమీటర్ల పరిధిలో లాంగ్‌ రేంజి క్షిపణులను చైనా మోహరించింది. దీంతోపాటు ఆక్సాయిచిన్‌, కష్ఘర్‌, హోటన్‌, లాసా, నైయింగ్చీ ప్రాంతాల్లో కూడా భారీగా ఆయుధాలను తరలించి సిద్ధంగా ఉంచింది. ముఖ్యంగా 2017 సంవత్సరంలో డోక్లాం ట్రైజంక్షన్‌ వద్ద భారత్‌ ఎదురొడ్డి నిలిచిన తర్వాత నుంచి ఏర్పాట్లు చేసుకోవడం మొదలుపెట్టింది. సరికొత్తగా దాదాపు 13 సైనిక స్థావరాలను ఏర్పాటు చేసింది. వీటిల్లో 3 సరికొత్త ఎయిర్‌బేస్‌లు.. ఐదు సరికొత్త ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు.. మరో ఐదు హెలిపోర్టులు శరవేగంగా ఏర్పాటు చేస్తోంది. ఇక్కడ జే11, జే16, సుఖోయ్‌ 30, జే20 వంటి విమానాలను మోహరిస్తోంది.    

వచ్చేనెల మరో ఐదు రఫేల్‌ విమానాలు..

ఫ్రాన్స్‌ మరో 5 రఫేల్‌ విమానాలను వచ్చేనెల భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. ఇవన్నీ ఇప్పుడు ఫ్రాన్స్‌లో వివిధ రకాల పరీక్షలను ఎదుర్కొంటున్నాయి. ఇవి వస్తే వీటిని పశ్చిమబెంగాల్‌లోని కలికుండా ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌లో మోహరించే అవకాశం ఉంది. చైనా వైపు సరిహద్దులను రక్షించడంలో ఈ వాయుసేన స్థావరానిది కీలకపాత్ర.  భారత్‌లోని ఫ్రాన్స్‌ రాయబారి ఇమ్మానియేల్‌ లెనిన్‌ ఓ వార్తసంస్థతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన భారత పైలట్లకు అద్భుతమైన సామర్థ్యం ఉందన్నారు. ఇప్పటికే అంబాలాలోని గోల్డెన్‌ యారోస్‌ చేతికొచ్చిన విమానాలు లద్దాఖ్‌లో సార్టీలు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 

గ్లోబల్‌ టైమ్స్ ట్వీట్‌లో జే20 డప్పు..!

అమెరికా నుంచి అపహరించిన టెక్నాలజీతో చైనా జే20 పేరుతో  ఒక స్టెల్త్‌ జెట్‌ను తయారు చేసింది. ఇది ఇటీవల జరిగిన ఓ డాగ్‌ఫైట్‌ యుద్ధవిన్యాసంలో (విమానాలు ముఖాముఖీ తలబడటం) భాగంగా ఒకే సారి వేర్వేరు దిశల్లో వచ్చే 17 విమనాలను కూల్చేసిందని పేర్కొంది. సు30 విమానాలతో ఇవి పోటీపడినట్లు పేర్కొంది. భారత్‌ దగ్గరున్న ఏ ఫైటర్‌ జెట్‌ దీనికి సమానం కాదని గ్లోబల్‌టైమ్స్‌ పేర్కొంది. జే20లో 8 హార్డ్‌పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అప్పుడు కేవలం 8 లక్ష్యాలనే చేధించగలదు. మిగిలిన లక్ష్యాలను ఎలా కూల్చగలదు?. ఒక వేళ ఇంటర్నల్‌ గన్‌తో కూల్చాలి అంటే విమానాలు దగ్గరగా వచ్చి ఉండాలి. ఇన్ని విమానాలను ఒకేసారి ఎదుర్కొనేటప్పుడు ఏదో ఒక విమానం గురిలోకి కూడా జే20 వచ్చి ఉండాలి. మొత్తంగా చూస్తే గ్లోబల్‌ టైమ్స్‌ అబద్ధం చెప్పిందనే ఈ ట్వీట్‌తో తెలిసిపోతుంది. భారత్‌కు రఫేల్స్‌ అందడంతో.. భయపెట్టేందుకు మైండ్‌గేమ్‌ ఆడదామనుకొని అడ్డంగా దొరికిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని