Published : 07 Sep 2020 10:17 IST

ఆడుతూ పాడుతూ ఇంగ్లీషు నేర్చుకోండిలా..!

సారథి తన క్రెడిట్‌ కార్డు పోగొట్టుకున్నాడు. దాన్ని బ్లాక్‌ చేయిద్దామని బ్యాంక్‌ కస్టమర్‌ కేర్‌కి కాల్‌ చేశాడు. అవతలి వ్యక్తి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నాడు. తనకొచ్చిన కొద్దిపాటి ఇంగ్లీషు ముక్కలతో కిందా మీదా పడి.. ఎలాగో తన గోడు వెళ్లబోసుకున్నాడు. చివరికి సమస్య పరిష్కరించుకున్నాడు.

విక్రమ్‌ తొలిసారి విమానాశ్రయానికి వెళ్లాడు. అంతంత మాత్రం చదువుకున్న అతడికి విమాన ప్రయాణం భారంగా తోచింది. కారణం ఇంగ్లీష్‌ రాక అక్కడ అతడు పడిన పాట్లే.

వీరిద్దరే కాదు.. చాలా మందిదీ సమస్య. ఉన్నత చదువులు చదువుకున్నప్పటికీ ఇంగ్లీష్‌పై పట్టులేక చాలామంది ఇలా ఇబ్బంది పడుతుంటారు. ఒక వేళ అవగాహన ఉన్నా.. మాట్లాడదామనే సరికి పదాలు దొరక్క వెనకడుగు వేస్తుంటారు. వీటన్నింటికీ సమాధానం ఇంగ్లీష్‌ నేర్చుకోవడం. ఈ బిజీ లైఫ్‌లో కొత్తగా నేర్చుకోవడం జరిగే పని కాదులే అనుకుంటే ఎప్పటికీ సాధించలేరు. రోజువారీ కార్యకలాపాల్లో భాగంగానే ఆడుతూ పాడుతూ ఆ ప్రయత్నాలు చేస్తే ఇంగ్లీష్‌ దానంతట అదే వస్తుంది. మరి పదండి ఆ టిప్స్‌ ఏంటో తెలుసుకుందాం..


పుస్తకాలు/ పేపర్లు

‘పుస్తకాలు చదవడమా? జరిగే పని కాదులెండి’ అని అప్పుడే నిరాశ పడొద్దు. ఆంగ్ల పరిజ్ఞానాన్ని, పదజాలన్ని పెంచుకోవడం పుస్తకాలతోనే సాధ్యం. మంచి నవలలు, కథలు ఉన్న పుస్తకాలు చదవడమంటూ మొదలు పెడితే ముందు ఇంగ్లీషు పుస్తకాలు చదవాలన్న కోరిక బలపడుతుంది. అలాగే, మీకు వార్తలంటే ఇష్టముంటే రోజూ ఆంగ్ల దినపత్రికలను తిరగేయండి. మీ చుట్టూ జరిగే సంఘటనల గురించి చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు అవే వచ్చేస్తాయి.


సినిమాలు చూడండి..

చాలా మందికి ఇంగ్లీషు సినిమాలు అనగానే ‘స్పైడర్‌ మ్యాన్‌’, ‘సూపర్‌మ్యాన్‌’, ‘అవెంజర్స్‌’ వంటి సూపర్‌ హీరోల చిత్రాలే గుర్తొస్తాయి. అవి చూసేది కేవలం అందులోని యాక్షన్‌ సీన్ల కోసం మాత్రమే. కానీ అంతకంటే ఎన్నో మంచి సినిమాలు ఉన్నా చాలా మంది వాటి జోలికి పోరు. కారణం పూర్తిగా అవి ఆంగ్లంలో ఉండటమే. అంతమాత్రన చూడటం మానేయాల్సిన అవసరం లేదు. ‘తినగ తినగ వేము తియ్యనుండు’లా చూస్తూ ఉంటే అదే వస్తుంది. వారు పలికేది అర్థం కాకపోతే సబ్‌టైటిల్స్‌ పెట్టుకుని చూస్తే ఉపయోగముంటుంది. తెలుగు సినిమాలకు కూడా ఈ మధ్య ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌ వస్తున్నాయి. వాటిని ఆన్‌లో పెట్టుకుని చూడడం మేలు.


చాట్‌ చేయండి.. మాట్లాడండి..

ఇప్పుడు అందరి ఫోన్లలో వాట్సాప్‌ ఉంది. ఏదో ఒక గ్రూపులో మీరూ సభ్యులుగా ఉండే ఉంటారు. అప్పుడప్పుడూ అందులో ఇంగ్లీషులో మీ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉండండి. అలాగని గ్రూపులో ఎవరో మీ తప్పుల్ని ఎత్తి చూపుతారని భయపడకండి. చాలా మంది ఇలా భయపడే ముందడుగు వేయరు. అంతేకాదు మీలా ఇంగ్లీషు నేర్చుకోవాలనుకునేవారి కోసం చాలా చాట్‌ రూమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిపైనా ఓ లుక్కేయండి. అప్పుడప్పుడూ కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడుతుండండి. మనకు ఉచితంగా లభించే సర్వీసు ఇది. మీరు మాట్లాడే వ్యక్తి ఎవరో తెలీదు కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారన్న మీమాంస ఉండదు.


పాటలే కాదూ.. పాడ్‌కాస్ట్‌లూ వినండి..

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌, ఇయర్‌ఫోన్స్‌ కామన్‌గా ఉంటున్నాయి. తీరిక దొరికినప్పుడు చాలా మందికి సంగీతం వినడం అలవాటు. అయితే, వినోదంలో కొంత భాగం విజ్ఞానానికి (ఆంగ్లం) ఉయోగిస్తే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని మ్యూజిక్‌ ప్లేయర్లలో పాడ్‌కాస్ట్‌లు అందుబాటులో ఉంటున్నాయి. అప్పుడప్పుడూ మీకిష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించిన అంశాలను వింటూ ఉండండి. అలానే వీలైతే ఆడియో బుక్స్‌ కూడా వినండి. దీని వల్ల ఇంగ్లీష్‌ పదాలు పలికే విధానం తెలుస్తుంది. చాలా మందికి తాము పదాలు తప్పుగా పలుకుతామోనన్న భయం ఉంటుంది. వినడం ద్వారా ఆ శంఖ తొలగిపోతుంది.


అప్పుడప్పుడూ రాత..

మీరు వినడం, చూడడం, చదవడమే కాదు.. అప్పుడప్పుడూ రాయడమూ అలవాటు చేసుకోవాలి. వీలు దొరికినప్పుడల్లా మీ గురించో.. చిన్నప్పుడు విన్న కథలకో అక్షర రూపం ఇవ్వండి. ఏది తోచితే అది ఇంగ్లీషులో రాయండి. అలా రాసినవి మీకు ఇంగ్లీషు నేర్చుకునేందుకు సహాయపడతారనుకునే వారికి చూపించండి.. తప్పొప్పుల్ని సవరించమని చెప్పండి. నిత్యం ఇలా చేస్తూ ఉంటే ఇంగ్లీషు దానంతట అదే వస్తుంది.


ఇది చాలా ముఖ్యం..

ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని మీరు భారంగా భావించకూడదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. అలాగే ప్రారంభించి ఆగిపోవడమూ అంత మంచిది కాదు. నేర్చుకోవాలన్న తపన నిత్యం కొనసాగాలి. ప్రారంభంలో కష్టం అనిపించినా కొన్నాళ్లకు కొద్దికొద్దిగా మాట్లాడడం నేర్చుకున్నప్పుడు వచ్చే ఆ కిక్కు మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ప్రారంభించండి..

-ఇంటర్నెట్‌ డెస్క్‌

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని