Updated : 08/12/2020 13:52 IST

మీ ఆర్థిక ప్రణాళికలో ఈ పొరపాట్లు చేయకండి

పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం వంటి వాటి గురించి మనలో చాలా మంది ఆలోచిస్తుంటారు. అవి ఎంత ముఖ్యమో ఆర్థిక ప్రణాళికలో అసలు చేయకూడని కొన్ని పొరపాట్ల గురించి అవగాహన కలిగి ఉండటం అంతే ముఖ్యం! 

ఆర్భాటాలకు పోవద్దు

ఇంట్లో ఒక్కరే సంపాదిస్తూ.. అతడిపైనే ఆధారపడిన కుటుంబాలెన్నో. వచ్చిన ఆదాయమంతా కుటుంబ ఖర్చులకే సరిపోతోంది. ఇంకా మిగల్చడమెలా అంటూ చాలా మంది వాపోతుంటారు. మరికొందరు కుటుంబానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ.. భవిష్యత్తు అవసరాలను మర్చిపోతుంటారు. కుటుంబంపై ప్రేమతో చిన్న చిన్న కార్యక్రమాలను కూడా ఆర్భాటంగా చేయాలని బ్యాంకుల నుంచి అప్పులు చేయడం, స్నేహితుల దగ్గర చేబదులు తీసుకొని మరీ ఖర్చు పెడుతుంటారు. ఇది చాలా ప్రమాదం. కొన్ని సందర్భాల్లో కుటుంబంలోని ప్రతి ఒక్కరి కోర్కెలు తీర్చడం సాధ్యం కాకపోవచ్చు. మీ పరిస్థితిని వాళ్లకు సున్నితంగా తెలియజెప్పే ప్రయత్నం చేయండి. అప్పులు చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పండి. కచ్చితంగా అర్థం చేసుకుంటారు.

వాయిదా వేయొద్దు

వాయిదా వేయడం మనలో చాలా మందికి ఓ అలవాటుగా మారిపోతోంది. కొత్తగా ఉద్యోగం వచ్చింది కదా.. కొన్ని రోజులు ఎంజాయ్‌ చేద్దాం. ఆ తర్వాత సంపాదన గురించి ఆలోచిద్దాం అనుకుంటారు కొందరు. వచ్చిందే తక్కువ అందులో మళ్లీ పొదుపు చేస్తే ఇంకేం మిగులుతుందని ఇంకొందరి వాదన. ఏం చేయాలో తెలుసు కానీ, అది ఆచరించడం కుదరడం లేదని మరికొందరు చెబుతుంటారు. ఇలాంటి వారందరూ ఎంత తక్కువ వయస్సులో కచ్చితమైన ఆర్థిక ప్రణాళిక వేసుకుంటారో భవిష్యత్తులో అంత నిశ్చింతగా ఉండొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆదాయం, ఖర్చు, పొదుపులను ఓ కాగితంపై రాయడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీనివల్ల ఎంత ఖర్చు చేస్తున్నాం?ఎంత పొదుపు చేస్తున్నామన్నది సులభంగా అర్థమవుతుంది. అంతేకాకుండా మనకు తెలియకుండానే ఖర్చులు తగ్గించుకుంటాం.

అవసరానికి కోరికకు తేడా గమనించండి

అవసరానికి, కోరికకు మధ్య ఉన్న చిన్నగీతను ఆర్థిక ప్రణాళికను తారుమారు చేస్తుంది. అనవసర కోరికలకు పోయి అప్పుల పాలవ్వడం వల్ల ఆందోళన తప్ప ఇంకేం ప్రయోజనం ఉండదు. అదే చక్కని ఆర్థిక ప్రణాళిక వేసుకుంటే దేనికెంత ఖర్చు చేయాలో ఓ అవగాహనకు రాగలుగుతారు. భవిష్యత్‌లో రమారమి ఎంత డబ్బు అవసరమవుతుందో అంచనా వేయగలుగుతాం. సరైన సమయానికి హైరానా పడకుండా ఉండేందుకు ఆర్థిక ప్రణాళిక ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందువల్ల కొన్ని కోరికలు చంపుకునైనా కొంతమొత్తాన్ని పొదుపు చేయమని నిపుణులు చెతున్నారు.

ఇతరుల్ని అనుకరించొద్దు

ఒక్కొక్కరి అలవాట్లు, ఆలోచనలు ఒక్కోలా ఉంటాయి. కొందరు పొదుపు చేయడానికి మొగ్గు చూపితే, మరికొందరు ఎక్కువగా ఖర్చు చేయాలని చూస్తారు. మన స్నేహితుల్లోనో, బంధువుల్లోనో కొందరు విలాసవంతంగా బతుకుతున్నారని మనమూ వాళ్లని అనుకరిస్తే పరిస్థితులు అస్తవ్యస్తమవుతాయి. వారి స్థితిగతులు, ఆదాయ వ్యయాలు వేరై ఉండొచ్చు. కొండను పొట్టేలు ఢీ కొన్న చందంగా మారకూడదు. మనకొచ్చే ఆదాయమెంత? ఎంత ఖర్చు చేయాలి? ఎంత పొదుపు చేయాలి? తదితర విషయాలతో ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకొని, కచ్చితంగా ఆచరించాలి. అలాంటప్పుడే ఆర్థిక సుస్థిరత సాధ్యమవుతుంది.

ఇన్సూరెన్స్‌ వేరు..ఇన్వెస్ట్‌మెంట్‌ వేరు..

చాలా మంది ఇన్సూరెన్స్‌(బీమా), ఇన్వెస్ట్‌మెంట్‌(పెట్టుబడి/మదుపు) ఒకటే అనుకుంటారు. ఇది తప్పుడు అభిప్రాయం. అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆర్థికంగా గట్టెక్కించడానికి బీమా సాయం చేస్తే... మిమ్మల్ని ఆర్థికంగా స్థితిమంతుల్ని చేసి, సంపద సృష్టించడానికి మదుపు సహకరిస్తుంది. ఓ నాలుగైదు లక్షల ఇన్సూరెన్స్‌ చేశాం కదా ఇక  ఏ సమస్యా ఉండదులే అనుకుంటే పొరపాటే. మీ ఇన్సూరెన్స్‌ సొమ్ము, ఇన్వెస్ట్‌మెంట్‌లో కలవదు. అలాగని ఇన్సూరెన్స్‌ తీసుకోకుండా ఆ మొత్తాన్ని పెట్టుబడులకు ఉపయోగించడం కూడా తప్పేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు మీరు మెడికల్ ఇన్సూరెన్స్‌ తీసుకోకుండా ఆ సొమ్మును వేరేచోట పెట్టుబడి పెట్టారనుకుందాం. అనుకోకుండా మీరు ఆస్పత్రిలో చేరితే ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావొచ్చు. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితులు మొత్తం తారుమారయ్యే అవకాశముంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనే దేనికి కేటాయించిన మొత్తాన్ని దానికే ఉపయోగించడం మంచిది.

అవగాహన లేకుండా పెట్టుబడులొద్దు

చాలా మంది ఉన్నంతలో ఎక్కడో ఒక చోట పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. కానీ, సరైన మార్గం తెలియదు. ఎక్కడో ప్రకటనలు చూసో, లేదా ఎవరో చెప్పారనో అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టేస్తారు. ఇది కొన్ని సందర్భాల్లో ఫర్వాలేదనిపించినప్పటికీ అంత మంచిపద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సార్లు నష్టపోయే పరిస్థితులు కూడా రావొచ్చు. అందువల్ల మనకు అవగాహన ఉన్న రంగంలోనే పెట్టుబడులు పెట్టడం ఉత్తమం. కొందరు నష్టమొచ్చినా భరించే స్థితిలో ఉంటారు. మరి కొందరికి అది సాధ్యం కాకపోవచ్చు.  మనకొచ్చే ఆదాయ వ్యయాలు, రిస్కును భరించే సత్తాను బట్టి ఎక్కడ పెట్టుబడులు పెడితే బాగుంటుందో స్వయంగా తెలుసుకోవాలి. అంతేగానీ, ఎవరో చెప్పారని చేస్తే కష్టాల ఊబిలో కూరుకుపోయే అవకాశముంది.

భారమంతా వారి పైనే వద్దు
మనకు పెట్టుబడులు పెట్టే విధానం తెలియకపోతే కొంతమంది ఆర్థిక నిపుణులు కొత్త మొత్తం తీసుకొని సేవలు అందిస్తుంటారు. ఎలా పెట్టుబడులు పెట్టాలి? ఎక్కడ పెడితే ఎక్కువ ప్రయోజనముంటుంది తదితర విషయాలు వారికి బాగా తెలుస్తాయి. అయితే భారమంతా కేవలం వారిపైనేనే నెట్టేయడం అంత మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో అసలేం జరుగుతుందో నిత్యం గమనిస్తూ ఉండాలి. ఒక వేళ ఆర్థిక నిపుణుల ద్వారా మీరు పెట్టుబడులు పెడితే.. ఆయనతో తరచూ మాట్లాడుతూ ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో అడిగి తెలుసుకోండి. దీనివల్ల మీకు మరింత అవగాహన పెరుగుతుంది. అంతేకాకుండా అవతలి వాళ్లు కూడా మీ ఆర్థిక పరిస్థితులను బట్టి కొత్త లక్ష్యాలను గురించి చెప్పే అవకాశముంటుంది.

ఉద్యోగవిరమణ తర్వాతేంటి?

చాలా మంది ఉద్యోగవిరమణ తర్వాత పరిస్థితుల గురించి ముందే ఆలోచించరు. కాస్త ఉన్నతంగా బతకాలనే ఉద్దేశంతోనో, పిల్లలకు మంచి భవిష్యత్‌ను ఇవ్వాలన్న కోరికతోనో సంపాదించినన్నాళ్లూ ఖర్చులకు పోతారు. వేరే ఆర్థిక వనరులు ఉంటే సరే.. కానీ, కేవలం ఉద్యోగమే ఆధారంగా జీవించేవాళ్లు ఉద్యోగవిరమణ తర్వాత ఏంటి? అనే విషయాన్ని ముందుగానే గుర్తించాలి. ఉద్యోగ విరమణ తర్వాత ఆదాయమార్గం మూసుకుపోతుంది. కానీ, ఖర్చులు మాత్రం ఎప్పటిలాగే ఉంటాయి. అందువల్ల అప్పటికి అవసరమైన ఆర్థిక నిధులను ఇప్పటి నుంచే సమకూర్చుకోవడం ఉత్తమం. బ్యాంకులోన్లు, ఇతర అప్పులు లేమైనా ఉంటే రిటైర్‌మెంట్‌కు ముందే పూర్తిగా చెల్లించేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ముందు నుంచి పొదుపు చేయడం వల్ల దానిపై వచ్చే వడ్డీ కూడా ఈ నిధికి అదనంగా వచ్చి చేరుతుంది.

-ఇంటర్నెట్‌డెస్క్‌

Read latest Explained News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్