ఇది గెలిస్తేనే ‘ట్రంప్‌’లకు ఫ్యూచర్‌..!

రాజకీయ వారసత్వం మన దగ్గరే కాదు అమెరికాలో కూడా ఉంది. దాదాపు వందేళ్ల నుంచి ఇక్కడ వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారు.. అధ్యక్షులుగా ఎన్నికవుతున్నారు. అంతదేనికి గత

Updated : 04 Nov 2020 15:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజకీయ వారసత్వం మన దగ్గరే కాదు అమెరికాలో కూడా ఉంది. దాదాపు వందేళ్ల నుంచి ఇక్కడ వారసులు రాజకీయాల్లోకి వస్తున్నారు.. అధ్యక్షులుగా ఎన్నికవుతున్నారు. అంతదేనికి గత ఎన్నికల్లో బిల్‌ క్లింటన్‌ వారసురాలిగా హిల్లరీ పోటీపడిన విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడన్‌ ముత్తాత ఎడ్వర్డ్‌ పెన్సిల్వేనియా సెనెట్‌లో సభ్యుడు. అయనది కూడా డెమొక్రాటిక్ పార్టీనే. అమెరికా రాజకీయాల్లో రూజ్‌వెల్ట్‌, కెన్నడీ, బుష్‌, క్లింటన్‌ల వారుసులు ఒక వెలుగు వెలిగారు. 
కుటుంబమే ట్రంప్‌ బలం..

ఇప్పుడు ట్రంప్‌ వంతు వచ్చింది. ట్రంపు  వారసులు గత నాలుగేళ్ల నుంచి రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ట్రంప్‌ అధికారం చేపట్టినప్పటి నుంచి తన వారసులను రాజకీయాల్లో ప్రోత్సహిస్తూ వచ్చారు. ముఖ్యంగా ఇవాంక ట్రంప్‌ చాలా చురుగ్గా ఉన్నారు. ఆమె భర్త జరార్డ్‌ కుష్నెర్‌ శ్వేత సౌధంలో ట్రంప్‌కు సీనియర్‌ సలహాదారుగా చేరారు. ఇక ఇవాంక కూడా అధ్యక్షుడి సలహాదారు హోదాలో తండ్రితోపాటు విదేశీ పర్యటనలకు వెళ్లి.. ప్రపంచ నేతలను కలుసుకొని కీలక చర్చల్లో పాల్గొన్నారు.  రిపబ్లిక్లన్ల విధానమైన ‘అబార్షన్లకు వ్యతిరేకత’ను సమర్థించారు. గతంలో ఆమె వైఖరి దీనికి చాలా భిన్నంగా ఉండేది.  

ఇక ట్రంపు కుమారుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ కూడా ఇటీవల కాలంలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో జోబైడెన్‌ను నేరుగా ఢీకొన్నారు. బైడన్‌, ఆయన కుమారుడు హంటర్‌పై అవినీతి ఆరోపణలు చేశారు. వీటికి కొన్ని ఆధారాలను కూడా తీసుకొచ్చారు. అసలు ప్రచారం మొదటి నుంచి చివరి వరకూ తానే బరిలో నిలిచానా అన్నట్లు జూనియర్‌ ట్రంప్‌ ప్రచారం సాగింది. ట్రంప్‌ వలే సోషల్‌ మీడియాలో ఈయన చాలా చురుగ్గా ఉన్నారు.  ఇక జూనియర్‌ ట్రంప్‌ స్నేహితురాలు కింబర్లీ గ్యూఫాయిల్‌ అధ్యక్షుడి ప్రచారం బృందంలో కీలక వ్యక్తి. ప్రచారానికి అవసరమైన నిధుల సమీకరణలో ఆమెది  కీలక పాత్ర.

మరో కుమారుడు ఎరిక్‌.. ‘ట్రంప్‌ ఆర్గనైజేషన్‌’పై వచ్చిన ఆరోపణలను సమర్థంగా ఎదుర్కొనే బాధ్యతను తీసుకొన్నారు. అదే సమయంలో ఆయన భార్య లారా ట్రంప్‌ అధ్యక్షుడి ప్రచార బృందం అధికార ప్రతినిధిగా సవాళ్లను ఎదుర్కొన్నారు. ఏదో ఒక రోజు ఈమె అధ్యక్ష పదవి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఇవాంక, జరార్డ్‌లకు ప్రపంచ స్థాయి నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయిల్‌ను గుర్తిస్తూ పలు అరబ్‌ డీల్స్‌ చేసుకోవడంలో జరార్డ్‌ పాత్ర కీలకం. ఆయనకు సౌదీ రాకుమారుడు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ అత్యంత సన్నిహితుడు.  

ఈ సారి అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధిస్తే గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ (రిపబ్లికన్‌ పార్టీ)పై పట్టు పెరిగిపోతుంది. ట్రంప్‌ కూడా ఒక సందర్భంలో ఇవాంకను అధ్యక్ష పదవిలో చూడాలన్న కోరికను వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో ఇవాంక, డొనాల్డ్‌ జూనియర్‌లలో ఎవరోఒకరు పోటీ పడవచ్చని వారి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒక వేళ ట్రంప్‌ ఓడిపోయినా.. ఇప్పటికిప్పుడు ఆయనకు రిపబ్లికన్‌ పార్టీలో వచ్చే ముప్పేమీ లేదు. మరికొంతకాలం పార్టీకి పెద్దదిక్కుగా ఆయనే ఉండే అవకాశం ఉంది. కానీ, ట్రంప్‌ వారసుల రాజకీయ జీవితం నల్లేరుమీద నడక కాబోదు.

 

భారీ విజయోత్సవానికి సిద్ధం కండి: ట్రంప్‌

సొంత రాష్ట్రంలో ఓటమి దిశగా బైడెన్‌..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని