ఆటస్థలాల్లో ‘ఆనందం’ సృష్టిస్తోంది!

ఇప్పుడంతా స్మార్ట్‌ ప్రపంచం.. తరగతులు వినాలన్నా, నచ్చింది చదవాలన్నా, ఆటలు ఆడాలన్నా అన్నింటికీ స్మార్ట్‌ఫోన్‌ ఉంది. కానీ ఆరు బయట ఆడే ఆటలు చిన్నారులని శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలవంతుల్ని చేస్తాయి. చదువులోనూ చురుకుగా మారుస్తాయి.

Published : 07 Nov 2021 15:51 IST

చిత్రాలు: ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడంతా స్మార్ట్‌ ప్రపంచం.. తరగతులు వినాలన్నా, నచ్చింది చదవాలన్నా, ఆటలు ఆడాలన్నా అన్నింటికీ స్మార్ట్‌ఫోన్‌ ఉంది. కానీ ఆరు బయట ఆడే ఆటలు చిన్నారులని శారీరకంగానే కాకుండా మానసికంగానూ బలవంతుల్ని చేస్తాయి. చదువులోనూ చురుకుగా మారుస్తాయి. అందుకే పిల్లలను ఆడించేందుకు ఏదైనా చేయాలనుకుంది ఓ యువతి. దానికోసం ఆటస్థలాలను నిర్మించింది. అందుకోసం ఏకంగా ఓ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. పనికిరాని వస్తువులను క్రీడా సామగ్రిగా తీర్చిదిద్దుతోంది. ఆమే 29 ఏళ్ల పూజా రాయ్‌. తనకలాంటి ఆలోచన ఎలా వచ్చింది?క్రీడా వస్తువులను ఎలా తయారు చేస్తుంది?ఇంతకీ ఏంటా సంస్థ? తెలుసుకుందాం.

సంస్థ ఏర్పాటుకు కారణం!
పూజ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఆర్కిటెక్చర్‌ విద్యను అభ్యసిస్తున్న రోజులవి. అక్కడికి దగ్గరలోనే ఓ పాఠశాల ఉండేది. సుమారు 250మంది చిన్నారులు అందులో చదివేవారు. దగ్గరలో స్థలం ఉన్నా చిన్నారులు ఆడుకునేందుకు ప్లేగ్రౌండ్‌ లేదు. ఎలాగైనా వారికోసం ఓ ఆటస్థలం నిర్మించి, వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలనుకుంది. ఆ ఆలోచనను తన మిత్రులతో పంచుకుంది. అందరూ కలిసి ఆట స్థలాన్ని నిర్మించేందుకు పనికిరాని టైర్‌లు, డ్రమ్‌లను ఉపయోగించుకున్నారు. వాటిని పునర్నిర్మించి ఆటవస్తువులుగా మార్చి అందంగా తీర్చిదిద్దారు. అలా ఖాళీగా ఉన్న స్థలం కాస్త పిల్లల ఆటస్థలంగా మారిపోయింది. అందులో ఆడుతున్న చిన్నారుల నవ్వుల్ని చూస్తూ మురిసిపోయింది పూజ. అలా మొదలైన తన ప్రయాణం ఇప్పుడు దేశవ్యాప్తంగా అనేక ఆటస్థలాలను నిర్మించి ఎంతోమంది చిన్నారుల ముఖాలను నవ్వులతో నింపేస్తోంది. అంతేకాదు, ఆటస్థలాలను నిర్మించడమే తన కెరీర్‌గా మార్చుకుంది. అందుకు ‘ఆంథిల్‌ క్రియేషన్స్’ అనే సంస్థను స్థాపించింది. ఖరగ్‌పూర్‌లో నిర్మించిన ప్లేగ్రౌండ్‌ వంటిది వేర్వేరు ప్రాంతాల్లోని కాలనీలు, పాఠశాలల్లో నిర్మించమని పిలిచినపుడు దేశవ్యాప్తంగా ఎంత తక్కువ స్థలాలు అందుబాటులో ఉన్నాయో ఆ సంస్థ గ్రహించింది.

పాత టైర్లు, ట్రక్‌లు చాలు
పాత అరిగిపోయిన టైర్లు ఏం పనికొస్తాయనుకుంటే పొరపాటే. అవి దాదాపు ‘లెగో బ్లాక్స్‌’ వలే ఉంటాయి. వీటిని సింపుల్‌గా మీరు కూర్చునే కుర్చీగానూ మార్చేయొచ్చు. ఓ ఆటస్థలాన్ని కట్టేయొచ్చు. అదే చేసిందీ సంస్థ. పాత అరిగిపోయిన ట్రక్‌ టైర్లను వాడి ఏనుగులు, ఆక్టోపస్‌, బైక్‌లు, కొండలు తదితర ఆట వస్తువులను తయారు చేశారు. సుమారు పదేళ్ల వరకూ మన్నికతో ఉంటాయవి. అంతేకాదు, వాటికి నిర్వహణ అవసరం లేదు. మరికొన్ని ఆట వస్తువులను సృష్టించేందుకు ఇనుప చక్రాలను వినియోగించారు. ముందుగా ఆట స్థలంలో ఏ నిర్మాణాలను చేయాలనే దానిపై ప్రేరణ పొందేలా ఈ సంస్థ బృందం అక్కడి పాఠశాల విద్యార్థులతో చర్చించి, వారికి కావాల్సినవేంటో తెలుసుకుంటుంది. దానికనుగుణంగా ఆటస్థలాన్ని తీర్చిదిద్దుతారు. దాంతోపాటు వివిధ వర్క్‌షాప్‌లు నిర్వహించి పాడైన టైర్లను తిరిగి ఎలా వినియోగించుకోవచ్చో ప్రజలకి తెలియజేస్తున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోనూ..
అలా ఖరగ్‌పూర్‌లో మొదటి ఆట స్థలం నిర్మించిన నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రతో పాటు సుమారు 17కి పైగా రాష్ట్రాల్లో ఆటస్థలాలను నిర్మించారు. తక్కువ ఆదాయ వర్గాలలోని కమ్యూనిటీల్లో ఈ ఆటస్థలాలను నిర్మించేందుకు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ కృషి చేస్తోంది. అందుకు మహీంద్రా వంటి అనేక కార్పొరేట్‌ సంస్థలతో కలిసి పని చేస్తోంది. టైర్లు, కేబుల్ డ్రమ్‌లు తదితర వ్యర్థాలను రీసైకిల్‌ చేసి, ఆట వస్తువులుగా మలుస్తోంది. ప్రస్తుతం బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న సంస్థ అక్కడ 100కి పైగా ఆట స్థలాలను ఏర్పాటు చేసింది. కేవలం పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లలకు వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తోంది. ఈ నిర్మాణాల్లో అక్కడి పిల్లలు, ప్రజలను భాగస్వాముల్ని చేస్తోంది. దిల్లీ, హరియాణా రాష్ట్రాల్లోని మురికివాడల్లో నివసించే చిన్నారులకోసం వారికి దగ్గరి ప్రాంతాల్లోనే ఆటస్థలాలను నిర్మించింది. అంతేకాదు, ‘తిండి, గుడ్డతో పాటు ఆటలు పిల్లల హక్కు’ అని నమ్ముతూ ఐక్యరాజ్యసమితి శరణార్థుల హైకమిషన్‌ను కలిసి, రొహింగ్యా శరణార్థుల కోసమూ ఆటస్థలాన్ని నిర్మించారు. వీటి నిర్మాణానికి ఎక్కువగా కంపెనీలు ఇచ్చే సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల నుంచి నిధులు సమకూరుతుంటాయి. కొన్నిసార్లు ప్రభుత్వం నుంచీ నిధులు లభిస్తాయి. కేవలం ఆటస్థలాలు మాత్రమే కాకుండా నగరాలను శుభ్రంగా మార్చేందుకూ కృషి చేస్తుందీ సంస్థ. 

లాక్‌డౌన్‌ సమయంలోనూ..
అన్నింటిలాగే ఈ సంస్థ కూడా కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బంది పడింది. పాఠశాలలు మూసేయడంతో వారి కార్యక్రమాలు ఆగిపోయాయి. లాక్‌డౌన్‌తో పిల్లలు ఆటస్థలానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో పిల్లలకు సాయం చేసేందుకు ‘ప్లే ఇన్‌ ఎ బాక్స్‌’ను అభివృద్ధి చేసిందీ సంస్థ. ఇది ఆరు విభిన్న అభివృద్ధి అంశాలను లక్ష్యంగా చేసుకుని బొమ్మలు, ఆటలను కలిగి ఉన్న పెట్టె. దీంతో చదువుతోపాటు ఆటలూ ఆడొచ్చు. ఇప్పటికి వేయికి పైగా ఈ పెట్టెలను పంపిణీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని