Updated : 12 Aug 2020 10:55 IST

క్రీ.శ. 536... ఆ ఏడాది నరకం చూపించింది..

 

2020.. ఎంతో ఆనందోత్సాహాలతో ప్రారంభమైంది.. కోట్లాదిమంది తమ భవిష్య ప్రణాళికలు రచించుకున్నారు... ఎన్నో ఆశలు.. అన్నీ కరోనా మహమ్మారి దెబ్బకు తలకిందులయ్యాయి. బతికుంటే చాలు అన్న విధంగా జీవితం మారింది. ఈ ఏడాది ఇలా మారడంపై అనేక మంది అవేదన  చెందుతున్నారు. అయితే కొన్ని శతాబ్దాలకు ముందు ఓ ఏడాదిలో ప్రజలు పడిన కష్టాల్ని తలచుకుంటే ఇప్పుడు మన ముందు ఉన్నది చాలా చిన్న కష్టమే అని తెలుస్తుంది.  అష్టకష్టాల ఏడాది క్రీ.శ. 536 ...

సూర్యుడు మాయమయ్యాడు..

ఆ ఏడాది  ఐస్‌లాండ్‌లోని అగ్ని పర్వతం బద్దలయింది. మొత్తం ఐరోపాను ఇక్కడ నుంచి వెలువడిన బూడిద కప్పివేసింది. అనేక నెలల పాటు అగ్ని పర్వతం నుంచి పొగలు వస్తుండటంతో సూర్యకిరణాలు నేలపైకి ప్రసరించలేకపోయాయి. దీంతో వాతావరణ వైవిధ్యం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం అప్పటి ప్రజలకు తెలియలేకపోవడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు.  ఆ ఏడాది అంతా సూర్యుడు చంద్రుడిలాగా కనిపించాడు. ఉష్ణోగ్రతలు 2.5 నుంచి 1.5 సెల్సియస్‌ డిగ్రీలకు పడిపోయాయి. సుదూరంగా చైనాలో కూడా పంటలు నశించిపోయాయంటే అగ్నిపర్వత పేలుడు ఎంత తీవ్రంగా ఉందో ఊహించవచ్చు.

18 నెలలు.. పిట్టల్లా రాలిపోయారు..

దాదాపు 18 నెలలు సూర్యకాంతి ఐరోపా, ఆసియాలోని పలుదేశాలకు చేరలేదు. దీంతో పంటలు పండటం కష్టం కావడంతో ఆహార లభ్యత తక్కువగా ఉండేది. వేలమంది మనుషులు ఆకలితో ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో జంతువులు చనిపోయాయి.

మూడుగంటలే వెలుగు..

అప్పట్లో ప్రొకొపియస్‌ అనే బైజాంటిన్‌ చరిత్రకారుడు ఈ వైపరిత్యాన్ని గ్రంథస్తం చేశాడు.  రోజులో మూడుగంటల పాటు మాత్రమే సూర్యుడు ఉండేవాడని అయితే  ఆ కిరణాలు చంద్రుని నుంచి వచ్చినట్టు ఉండేవని పేర్కొన్నాడు. కనీసం పండ్లను కూడా  చూడలేదని సిరియన్‌ చరిత్రకారుడు మైఖెల్‌ తన పుస్తకాల్లో వెల్లడించాడు..

మహమ్మారుల దాడి..

536 ఏడాది పూర్తయి 537 అడుగుపెట్టింది. ఈ సమయంలోనే ప్లేగు వ్యాధి వ్యాపించింది. కానిస్టాంటినోపుల్‌  నగరంలోనే తొలిమూడు రోజుల్లో 40 వేలమంది వరకు మృత్యువాత పడ్డారు. మొదట పేదలపై ఈ వ్యాధి దాడి చేసింది. అనంతరం ఇతర వర్గాల్లోనూ వ్యాధి వ్యాపించింది.

రోమన్‌ సామ్రాజ్య పతనానికి  ఒక కారణం..

536 గడిచిన అనంతరం 537 చివరలో అగ్నిపర్వతం చల్లబడటంతో లావా తగ్గిపోయింది. దీంతో తిరిగి సాధారణ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ప్రజానీకం ఊపిరి పీల్చుకుంది.  బైజాంటిన్‌ సామ్రాజ్యంలో దాదాపు 40 శాతం ప్రజలు మృత్యువాత పడ్డారు. రోమన్‌  సామ్రాజ్య విస్తరణకు అడ్డుకట్ట పడింది. అనంతరం కోలుకోలేక పతనమైంది.

- ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Read latest Explained News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని